ఫ్లాట్‌లో NRI భార్య దారుణ హత్య.. విదేశాల్లో ఉన్న భర్త.. ‘టీ కప్పుల’తో వీడిన మర్డర్ మిస్టరీ..!

ABN , First Publish Date - 2021-09-10T03:20:19+05:30 IST

ఎంత పెద్ద నేరస్థుడైనా ఎక్కడో ఓ చోట తప్పు చేస్తాడు. తెలివిగా తప్పించుకోవడానికి ప్రయత్నించినా కచ్చితంగా తప్పటడుగు వేస్తాడు. ఆ తప్పే అతడిని చట్టం ముందు నిందితుడిగా నిలబెడుతుంది. దోషిగా శిక్ష పడేలా చేస్తుంది. తాజాగా వెలుగులోకొచ్చిన ఓ మర్డర్ మిస్టరీలో..

ఫ్లాట్‌లో NRI భార్య దారుణ హత్య.. విదేశాల్లో ఉన్న భర్త.. ‘టీ కప్పుల’తో వీడిన మర్డర్ మిస్టరీ..!

ఎంత పెద్ద నేరస్థుడైనా ఎక్కడో ఓ చోట తప్పు చేస్తాడు. తెలివిగా తప్పించుకోవడానికి ప్రయత్నించినా కచ్చితంగా తప్పటడుగు వేస్తాడు. ఆ తప్పే అతడిని చట్టం ముందు నిందితుడిగా నిలబెడుతుంది. దోషిగా శిక్ష పడేలా చేస్తుంది. తాజాగా వెలుగులోకొచ్చిన ఓ మర్డర్ మిస్టరీలో అదే జరిగింది. భర్త విదేశాల్లో ఉన్న సమయంలో ఓ ఎన్నారై మహిళను దారుణ హత్యకు గురైంది. భార్య హత్య విషయం తెలుసుకున్న భర్త ఇండియాకు తిరిగొచ్చాడు. ఆమె అంతిమ సంస్కారాల్లో కూడా పాల్గొన్నాడు. అయితే హత్య కేసు కావడంతో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. అందులో లభించిన ఓ చిన్న ఆధారంతో హంతకుడిని పట్టుకున్నారు. అంతా పర్ఫెక్ట్‌గా ప్లాన్ చేశాననుకున్న నిందితుడిని కటకటాల్లోకి నెట్టారు.


వివరాల్లోకి వెళితే.. కర్ణాటకలోని ఉడుపి జిల్లాకు చెందిన విశాల గనిగె అనే మహిళ.. తన భర్త, పిల్లలతో కలిసి దుబాయ్‌లో నివశిస్తోంది. అయితే ఇటీవల ఉడుపిలోని పుట్టింటికి వచ్చింది. భర్త చెప్పాడని ఓ రోజు బ్యాంకుకు బయలుదేరింది. అయితే అలా వెళ్లిన ఆమె బ్యాంకుకు వెళ్లలేదు. తిరిగి ఇంటికీ రాలేదు. దీంతో కంగారు పడిన కుటుంబ సభ్యులు ఆమె కోసం గాలింపు చర్యలు మొదలుపెట్టారు. విశాల భర్త ఫ్లాట్‌ కూడా అక్కడే ఉండడంతో అక్కడకు వెళ్లి చూశారు. ఆ ఫ్లాట్‌లో విశాల మృతదేహం వారి కంట పడింది. దీంతో కన్నీరుమున్నీరయిన కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు గది మొత్తం చిందరవందరగా సామన్లు పడి ఉండడం చూసి, ఇదేదో దొంగల పనై ఉంటుందని ముందు అనుకున్నారు. అక్కడ దొరికిన అన్ని ఆధారాలను సేకరించారు. ఈ క్రమంలోనే వారి కంట రెండు టీ కప్పులు పడ్డాయి. వాటిని కూడా తమతో ఎవిడెన్స్‌గా తీసుకెళ్లారు. వచ్చిన వారికి విశాల టీ ఇచ్చిందంటే హంతుకులు  కచ్చితంగా ఆమెకు తెలిసిన వారే అయి ఉంటారని పోలీసులు నిర్ధారణకు వచ్చారు.


మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించిన తరువాత కుటుంబ సభ్యులకు అందించారు. ఆమె అంతిమ సంస్కారాల కోసం భర్త రామకృష్ణ కూడా భారత్‌కు చేరుకున్నాడు. ఈ క్రమంలోనే విశాల మృతి గురించి పోలీసులు అతడిని ప్రశ్నించారు. అయితే రామకృష్ణ డొంకతిరుగుడు సమాధానాలు చెప్పడంతో పోలీసులకు అనుమానం వచ్చింది. అతడి ఫోన్ నెంబర్ కాల్ డీటెయిల్స్ తీయడంతో విశాల చనిపోవడానికి ముందు రామకృష్ణ తన వాట్సాప్ నుంచి ఓ వ్యక్తికి కాల్ చేశాడు. ఆ నంబర్ గోరఖ్‌పూర్‌లో రిజిస్టర్ అయి ఉంది. అలాగే విశాల మొబైల్‌కు కూడా రామకృష్ణ కాల్ చేసినట్లు తేలింది. దీంతో పోలీసులు అతడిని అదుపులోనికి తీసుకుని ప్రశ్నించేసరికి అసలు విషయం బయటపెట్టాడు.


విశాలపై కొంతకాలంగా అనుమానం పెంచుకున్న రామకృష్ణ ఆమె ఎవరితోనే అక్రమసంబంధం పెట్టుకుందని భావించసాగాడు. ఈ క్రమంలోనే 6 నెలల క్రితం నుంచి ఆమెను చంపేందుకు కుట్ర పన్నాడు. అప్పటి నుంచి తన ప్లాన్ అమలు చేస్తూ వచ్చాడు. విశాలను హత్య చేసేందుకు గోరఖ్‌పూర్‌కు చెందిన ఇద్దరు సుపారీ కిల్లర్లను పిలిపించాడు. హత్య అనంతరం రూ.5 లక్షలు ఇస్తానని ఒప్పందం కుదుర్చుకున్నాడు. ముందుగా రూ.2 లక్షలు అడ్వాన్స్ కూడా ఇచ్చాడు. ఆ తర్వాత వారిని తన ఇంటికి తీసుకెళ్లి తన స్నేహితులుగా భార్య విశాలకు పరిచయం చేశాడు. దీంతో హంతకులు వారి ఇంటికి నేరుగా వెళ్లగలిగారు.


హత్య జరిగిన రోజు కూడా రామకృష్ణ విశాలకు ఫోన్ చేశాడు. తన స్నేహితులు వస్తున్నారని, ఫ్లాట్‌కు వెళ్లాలని చెప్పాడు. దీంతో ఆమె బ్యాంకు వెళ్లకుండా తిరిగి ఫ్లాట్‌కు వెళ్లింది. అక్కడకు వచ్చిన సుపారీ కిల్లర్లకు ఆమె టీ ఇచ్చింది. ఆ టీ తాగిన తరువాత వారిద్దరూ ఆమెను గొంతు నులిమి హతమార్చారు. అనంతరం ఇంట్లోని వస్తువులన్నింటినీ చిందరవందరగా పడేశారు. ఎవరో దొంగలు ఈ పనిచేశారనేలా సీన్ క్రియేట్ చేశారు. వారు తాగిన టీ కప్పుల విషయం మాత్రం మర్చిపోయారు. చివరికి ఆ చిన్న తప్పే నిందితులను పోలీసులకు పట్టించింది.

Updated Date - 2021-09-10T03:20:19+05:30 IST