అంబులెన్స్ డ్రైవ‌ర్‌గా మారిన ఎన్నారై..!

ABN , First Publish Date - 2021-05-17T00:41:02+05:30 IST

అమెరికా నుంచి స్వ‌దేశానికి తిరిగి వ‌చ్చిన ఓ ఎన్నారై.. ఇక్క‌డి ప‌రిస్థితుల‌ను చూసి చలించిపోయాడు. అత్య‌వ‌స‌ర స‌మ‌యంలో అంబులెన్స్ స‌ర్వీసులు దొర‌కక ఇబ్బందులు ప‌డుతున్న క‌రోనా బాధితుల‌ను చూసిన ఎన్నారై.. త‌న సొంత కారును అంబులెన్స్‌గా మార్చేశాడు.

అంబులెన్స్ డ్రైవ‌ర్‌గా మారిన ఎన్నారై..!
ప్ర‌తీకాత్మ‌క చిత్రం..

క‌రోనా రోగుల‌కు ఉచిత‌ సేవలు

హైద‌రాబాద్‌: అమెరికా నుంచి స్వ‌దేశానికి తిరిగి వ‌చ్చిన ఓ ఎన్నారై.. ఇక్క‌డి ప‌రిస్థితుల‌ను చూసి చలించిపోయాడు. అత్య‌వ‌స‌ర స‌మ‌యంలో అంబులెన్స్ స‌ర్వీసులు దొర‌కక ఇబ్బందులు ప‌డుతున్న క‌రోనా బాధితుల‌ను చూసిన ఎన్నారై.. త‌న సొంత కారును అంబులెన్స్‌గా మార్చేశాడు. ఈ అంబులెన్స్‌లోనే న‌యా పైసా కూడా తీసుకోకుండా క‌రోనా రోగుల‌ను ఉచితంగా ఆస్ప‌త్రుల‌కు తీసుకెళ్తున్నాడు. ఆక్సిజ‌న్ సౌక‌ర్యం కూడా అంబులెన్స్‌లో ఏర్పాటు చేశాడు. తాను తీసుకెళ్లిన రోగికి ఆస్ప‌త్రిలో అడ్మిష‌న్ దొరికాకే అక్కడి నుంచి క‌దిలేది. అప్పటివ‌ర‌కు వారితోనే ఉంటాడు. ఇటీవ‌ల త‌న మిత్రుడి విష‌యంలో జ‌రిగిన ఓ సంఘ‌ట‌న తాను ఇలా అంబులెన్స్ డ్రైవ‌ర్‌గా మార‌డానికి కార‌ణ‌మ‌ని ఈ ఎన్నారై చెబుతున్నాడు. 


పూర్తి వివ‌రాల్లోకి వెళ్తే.. త‌రుణ్ క‌ప్పాల అనే ఎన్నారై అమెరికాలో డెలాయిట్ సంస్థ‌లో టెక్నిక‌ల్ ప్రాజెక్ట్ మెనేజ‌ర్‌గా ప‌ని చేస్తున్నాడు. అయితే, హైద‌రాబాద్‌లో ఉండే త‌న త‌ల్లికి అనారోగ్యంగా ఉండ‌డంతో చూసి వెళ్దామ‌ని స్వ‌దేశానికి వ‌చ్చాడు. ఈ క్ర‌మంలో క‌రోనా సెకండ్ వేవ్ కార‌ణంగా ఇక్క‌డ ప‌రిస్థితులు దారుణంగా మారాయి. రోగుల‌కు ప్రాణ‌వాయువు కొర‌త‌, ఆస్ప‌త్రుల్లో బెడ్స్ దొర‌క‌ని దారుణ ప‌రిస్థితులు త‌లెత్తాయి. ఇలాంటి ప‌రిస్థితుల్లో త‌న మిత్రుడి విష‌యంలో జ‌రిగిన ఓ సంఘ‌ట‌న త‌రుణ్ మ‌న‌సు మార్చేసింది. క‌రోనాతో ఆస్ప‌త్రిలో చ‌నిపోయిన త‌న స్నేహితుడి త‌ల్లిని అంత్య‌క్రియ‌ల కోసం త‌ర‌లించ‌డానికి అంబులెన్స్ డ్రైవ‌ర్ ఏకంగా రూ. 34వేలు వ‌సూలు చేయ‌డం త‌రుణ్‌ను ఆలోచింప చేసింది. పేద‌వారు ఇంత భారీ మొత్తం చెల్లించి త‌మ‌వారిని ఆస్ప‌త్రికి తీసుకెళ్ల‌డం గానీ, అక్క‌డి నుంచి ఇంటికి తీసుకురావ‌డం గానీ చేయ‌డం చాలా క‌ష్టం అనిపించింది. 


అంతే.. అమెరికాలో ఉన్న త‌న స్నేహితుల స‌హాయంతో ఓ వ్యాన్ కొనుగోలు చేసి, దాన్ని అంబులెన్స్‌గా మార్చేశాడు. అందులో ఆక్సిజ‌న్ సిలిండ‌ర్‌ కూడా ఏర్పాటు చేశాడు. ఈ అంబులెన్స్‌లోనే ఎమ‌ర్జెన్సీ ఉన్న క‌రోనా రోగుల‌కు ఆస్ప‌త్రుల‌కు త‌ర‌లిస్తున్నాడు. గ‌త వారం రోజుల్లో సుమారు 24 ట్రిప్పులు తిరిగిన‌ట్లు త‌రుణ్ చెప్పాడు. తాను తీసుకెళ్లిన రోగుల‌కు ఆస్ప‌త్రిలో బెడ్ దొరికే వ‌ర‌కు అక్క‌డే ఉంటున్న‌ట్లు తెలిపాడు. ఈ క్ర‌మంలో ఇటీవ‌ల త‌న‌కు ఎదురైన ఓ విషాద‌క‌ర‌ సంఘ‌ట‌న‌ను ఈ సంద‌ర్భంగా త‌రుణ్ తెలియ‌జేశాడు. ఆస్ప‌త్రిలో క‌రోనాతో చికిత్స పొందుతున్న ఓ పెద్దావిడా భ‌ర్త మ‌రో ఆస్ప‌త్రిలో క‌రోనాతో చ‌నిపోయాడు. ఆమె కుమారుడు క‌రోనాతో పోరాడుతూ ఐసీయూలో ఉన్నాడు. భ‌ర్త చనిపోయిన విష‌యం తెలుసుకున్న ఆ పెద్దావిడా ఎలాగైన చివ‌రిసారిగా త‌న భ‌ర్త‌ను చూడాల‌ని అనుకుంది. కానీ, ఆమెకు ఆ స‌మ‌యంలో సాయం చేసేవారు ఎవ‌రూ లేరు. ఆ స‌మ‌యంలో ఆమె చికిత్స పొందుతున్న ఆస్ప‌త్రిలోని ఎమ‌ర్జెన్సీ వార్డు ద‌గ్గ‌ర త‌రుణ్ నిల‌బ‌డి ఉండ‌డం గ‌మ‌నించిదామె. 


త‌రుణ్‌ను సైగ‌తోనే పిలిచింది. వెంట‌నే ఆమె వ‌ద్ద‌కు వెళ్లాడు. దాంతో క‌రోనాతో చ‌నిపోయిన త‌న భ‌ర్త‌ను చివ‌రిసారిగా చూడాల‌నుకుంటున్న విష‌యం త‌రుణ్‌తో చెప్పింది. వెంట‌నే త‌రుణ్ ఆ ఆస్ప‌త్రి వైద్యుల అనుమ‌తితో ఆ పెద్దావిడాను ఆమె భ‌ర్త చ‌నిపోయిన ఆస్ప‌త్రికి తీసుకెళ్లాడు. స‌మ‌యానికి ఆస్ప‌త్రికి తీసుకెళ్ల‌డంతో ఆమె త‌న భ‌ర్త‌ను చూసుకుంది. ఈ ఘ‌ట‌న త‌న‌ను తీవ్రంగా క‌లిచి వేసిన‌ట్లు త‌రుణ్ చెప్పుకొచ్చాడు. ఇలా అత్య‌వ‌స‌రంగా అంబులెన్స్ కావాల్సిన పేద‌ల‌కు త‌న వంతు సాయం చేస్తూ మాన‌వ‌త్వం చాటుతున్నాడు ఈ యంగ్ ఎన్నారై. త‌రుణ్ ఉదార‌త ప‌ట్ల నెటిజ‌న్లు హ‌ర్షం వ్య‌క్తం చేస్తున్నారు. 

Updated Date - 2021-05-17T00:41:02+05:30 IST