బోస్టన్‌‌లో మే 20-21 తేదీల్లో ‘మ‌హానాడు’ వేడుక‌లు!

ABN , First Publish Date - 2022-05-14T22:12:18+05:30 IST

అమెరికాలో తెలుగుదేశం పార్టీ మహానాడు వేడుకలు నిర్వహిచేందుకు ఎన్నారై టీడీపీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఏర్పాట్లు జరుగుతున్నాయి.

బోస్టన్‌‌లో మే 20-21 తేదీల్లో ‘మ‌హానాడు’ వేడుక‌లు!

ఏర్పాట్లను స్వయంగా సమీక్షించిన ఎన్నారై టీడీపీ యూఎస్ఏ కోఆర్డినేటర్ జయరాం కోమటి  


అమెరికాలో తెలుగుదేశం పార్టీ మహానాడు వేడుకలు నిర్వహిచేందుకు ఎన్నారై టీడీపీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇక పచ్చ పండుగగా భాసిల్లుతున్న ఈ వేడుకులను ఏపీలో ప్రతి ఏటా 27-29 తేదీల్లో ఘనంగా నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఈ వేడుకల్లో చేయాల్సిన పార్టీ తీర్మానాలు, భవిష్యత్తు పోరాటాలు, ఉద్యమాలు,  కొత్త నేత‌ల ప‌రిచ‌యాలు.. ఇలా అనేక అంశాలకు సంబంధించి  పార్టీ వర్గాలు ఏర్పాట్లు చేస్తున్నాయి. 


అయితే, క‌రోనా నేప‌థ్యంలో గ‌త రెండేళ్లుగా మ‌హానాడును వ‌ర్చువ‌ల్‌గానే నిర్వహించారు. ఈ ఏడాది ఏపీలోని ఒంగోలు వేదికగా నిర్వహిస్తున్న మ‌హానాడును రెండు రోజుల‌కే ప‌రిమితం చేశారు. అయిన‌ప్పటికీ, అన్ని విష‌యాల‌ను స‌మ‌గ్రంగా చ‌ర్చించి పార్టీ భ‌విత‌కు పునాదులు ప‌టిష్టం చేసేలా వేడుకలను నిర్వహించనున్నారు. ఇదిలావుంటే, అమెరికాలో ఈ నెల 20, 21 తేదీల్లో మ‌హానాడు నిర్వహించేందుకు ఎన్నారై టీడీపీ యూఎస్ఏ సంకల్పించింది. బోస్టన్‌లోని బెస్ట్ వెస్టర్న్ రాయ‌ల్ ప్లాజా హోట‌ల్‌లో ఈ మ‌హానాడు నిర్వహించేందుకు ఎన్నారై టీడీపీ సభ్యులు నిర్ణయించారు.


ఎన్నారై టీడీపీ యూఎస్ఏ కోఆర్డినేట‌ర్‌గా ఇటీవ‌ల నియ‌మితులైన‌ జ‌య‌రాం కోమ‌టి ఆధ్వర్యంలో ఈ మ‌హానాడును అంగ‌రంగ వైభ‌వంగా నిర్వహించేందుకు ఏర్పాటు జరుగుతున్నాయి. ఈ కార్యక్రమానికి ఏపీ నుంచి రాజ‌మండ్రి రూర‌ల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌద‌రి, ఎమ్మెల్సీ ఎంవీఎస్ రాజు, టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యద‌ర్శి గౌతు శిరీష‌, టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి న‌న్నూరి న‌ర్సిరెడ్డి, మాజీ ఎమ్మెల్యే కందుల  నారాయ‌ణ‌రెడ్డి, అనంత‌పురం అర్బన్ మాజీ ఎమ్మెల్యే ప్రభాక‌ర్ చౌద‌రి, టీడీపీ సీనియ‌ర్ నాయ‌కుడు మ‌న్నవ సుబ్బారావు త‌దిత‌రులు హాజ‌రుకానున్నారు.



ఈ నేప‌థ్యంలో బోస్టన్‌లో మ‌హానాడు నిర్వహ‌ణ ఏర్పాట్లను ప‌రిశీలించేందుకు జ‌య‌రాం కోమ‌టి బోస్టన్‌కు చేరుకున్నారు. అతిథుల‌కు అవ‌స‌ర‌మైన ఏర్పాట్లతో పాటు, మ‌హానాడులో చ‌ర్చించే విష‌యాల‌పై ఆయ‌న స‌మీక్ష చేయ‌నున్నారు. ఏపీలో అంగరంగ వైభవంగా జరిగే మహానాడు వేడుకల తరహాలోనే  ఈ కార్యక్రమాన్ని నిర్వహించేలా జ‌య‌రాం కోమ‌టి చ‌ర్యలు చేపడుతున్నారు. ఈ వేడుకలను ఫేస్‌బుక్‌, యూట్యూబ్ లైవ్‌ల‌లో ప్రసారం చేసే ఏర్పాట్లు కూడా చేస్తుండ‌డం విశేషం.



Read more