మెడికల్ అడ్మిషన్లు.. NRI కోటాపై లేని విమర్శలు రిజర్వేషన్లపై ఎందుకు..?

ABN , First Publish Date - 2022-03-16T02:08:11+05:30 IST

ఎన్నారై కోటా పేరుతో జరుగుతున్న మెడికల్ అడ్మిషన్ల కారణంగా ప్రతిభావంతులైన విద్యార్థులకు అసలైన అన్యాయం జరుగుతోందని కేరీర్స్ 360 అనే సంస్థ తన తాజా అధ్యయనంలో లెక్కలతో సహా తేల్చి చూపింది. కానీ.. రిజర్వేషన్లపై వస్తున్న విమర్శలు.. ఎన్నారై కోటా విషయంలో రావట్లేదని కుండబద్దలు కొట్టింది.

మెడికల్ అడ్మిషన్లు.. NRI కోటాపై లేని విమర్శలు రిజర్వేషన్లపై ఎందుకు..?

ఇంటర్నెట్ డెస్క్: కొన్ని శతాబ్దాల పాటు కుల వ్యవస్థ కింద నలిగిపోయిన అణగారిన వర్గాలు.. అందరితో సమానంగా సమాజంలో ఉన్నత స్థానానికి చేరుకునేందుకు, సమానావకాశాలు కల్పించేందుకు రాజ్యాంగం ప్రసాదించిన ఓ వరం రిజర్వేషన్లు. అయితే.. రిజర్వేషన్ల కారణంగా ప్రతిభగలవారు నష్టపోతున్నారనేది తొలి నుంచీ వినిపిస్తున్న ప్రధాన విమర్శ. ఇందులోని నిజనిజాలు, ఈ వాదనపై జరుగుతున్న అనుకూల, వ్యతిరేక వాదనలు పక్కన పెడితే.. ఎన్నారై కోటా పేరుతో జరుగుతున్న మెడికల్ అడ్మిషన్ల కారణంగా ప్రతిభావంతులైన విద్యార్థులకు అసలైన అన్యాయం జరుగుతోందని కేరీర్స్ 360 అనే సంస్థ తన తాజా అధ్యయనంలో లెక్కలతో సహా తేల్చి చూపింది. కానీ.. రిజర్వేషన్లపై వస్తున్న విమర్శలు.. ఎన్నారై కోటా విషయంలో రావట్లేదని కుండబద్దలు కొట్టింది. వివిధ కోటాల్లో చిట్టచివరి సీటు దక్కించుకున్న వారి ర్యాంకు(క్లోజింగ్ ర్యాంకు), ఆయా కోటాల్లోని కటాఫ్ మార్కుల ఆధారంగా ఈ అంచనాకు వచ్చింది. ప్రతిభగల వారికి మాత్రమే సీటు దొరికేలా రూపొందించిన నీట్(NEET) పరీక్షలో.. ఎన్నారై కోటా పుణ్యమా అని అతి తక్కువ కటాఫ్ మార్కులు సాధించిన వారు కూడా సునాయసంగా వైద్య విద్య అందిపుచ్చుకుంటున్నారు. మార్కుల కంటే కూడా డబ్బులు లేకపోతే సీటు రాదనే స్థితికి ఎన్నారై కోటా అడ్మిషన్లు నిదర్శనంగా మారాయి.


అసలు ఏంటీ ఎన్నారై కోటా.. 

మెడికల్ కాలేజీల్లో అండర్ గ్రాడ్యుయేట్ కోర్సుల్లో(ఎంబీబీఎస్, బీడీఎస్) చేరాలనుకున్న విద్యార్థులు ముందుగా నీట్ పరీక్షలో కనీసార్హత(కటాఫ్) మార్కులు సాధించాలన్న విషయం తెలిసిందే. భారత్‌లో మెడికల్ విద్యా విధానం మొత్తం మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా(MCI) కనుసన్నల్లో సాగుతుంది. ఇక నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(NTA) నీట్ పరీక్ష నిర్వహిస్తుంటుంది. నీట్ ర్యాంక్ ఆధారంగా ప్రభుత్వ, ప్రైవేట్ కాలేజీల్లో సీట్ల కేటాయింపు జరుగుతుంది. కౌన్సెలింగ్‌లో సీటు సంపాదించలేనివారు మేనేజ్‌మేంట్ లేదా ఎన్నారై కోటాలో అడ్మిషన్ పొందవచ్చు. భారత సంతతికి చెందిన వారు మాత్రమే ఎన్నారై కోటా అడ్మిషన్లకు అర్హులు. అయితే.. ఏ కోటాలో పొందాలన్నా విద్యార్థులు విధిగా కనీస కటాఫ్ స్కోర్ సాధించాల్సి ఉంటుంది. 


కాగా..  వివిధ రాష్ట్రాల్లో ఎన్నారై లేదా ప్రభుత్వ కోటాల్లోని చిట్టచివరి సీటు సంపాదించిన విద్యార్థి తాలూకూ ర్యాంకు, కటాఫ్ మార్కుల ఆధారంగా ‘కెరీర్స్360’ ఓ సవివరమైన అధ్యయనం చేసింది. 2020 నాటి అడ్మిషన్ల ఆధారంగా ఈ అధ్యయనం జరిగింది. దీని ప్రకారం..  కొన్ని కాలేజీల్లో రిజర్వేషన్‌లోని చిట్టచివరి సీటు పొందిన విద్యార్థి ర్యాంకు కంటే.. ఎన్నారై సీటు కోటాలో సీటు పొందిన విద్యార్థి ర్యాంకు దాదాపు ఐదు లక్షలు తక్కువ. ఉదాహరణకు.. డా. రాజేంద్రప్రసాద్ ప్రభుత్వ మెడికల్ కాలేజీలో.. ఎన్నారై, రిజర్వేషన్ల కేటగిరీలను పోలిస్తే ర్యాంకులో వ్యత్యాసం ఏకంగా 5.8 లక్షలు ఉన్నట్టు తేలింది. ప్రైవేటు కాలేజీల్లో ఈ వ్యత్యాసం మరింత ఎక్కువ.


2020లో మొత్తం 15.9 లక్షల మంది నీట్‌కు దరఖాస్తు చేసుకోగా.. వారిలో 13.6 లక్షల మంది(వీరిలో ఎన్నారైలు 1869 మంది ఉన్నారు) పరీక్ష రాశారు. మొత్తం 7.7 లక్షల మంది మినిమం పర్సెంటైల్ మార్కులు సాధించి కౌన్సెలింగ్‌కు అర్హత సాధించారు. అయితే.. ప్రతి ఏటా పరీక్ష రాసే మొత్తం విద్యార్థుల సంఖ్య బట్టి ఈ మినిమం పర్సెంటైల్ మారుతూ ఉంటుంది. నీట్ నిబంధనల ప్రకారం.. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ విద్యార్థులు 40 పర్సెంటైల్ సాధించాల్సి ఉండగా.. జనరల్ కేటగిరీ విద్యార్థులు 50 శాతం మార్కులు సాధిస్తే.. కౌన్సెలింగ్‌కు అర్హత సాధిస్తారు. అయితే.. లో కటాఫ్స్ కారణంగా ‘తక్కువ ప్రతిభ’(నీట్ స్కోర్ ప్రకారం) కలిగిన విద్యార్థులు ఆర్థిక బలంతో మెడికల్ సీటు సంపాదిస్తున్నారని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఎన్నారై కోటా విద్యార్థులు.. మంచి ప్రతిభ కనబర్చిన విద్యార్థులను పక్కకు నెట్టి మెడికల్ విద్య పొందుతున్నారు. ఈ అసమానత ఎన్నారై కోటాలో మరింత స్పస్టంగా కనిపిస్తోందని ఈ అధ్యయనం తేల్చింది.


2020 నాటి నీట్ లెక్కల ప్రకారం.. జనరల్ కేటగిరీ విద్యార్థి కటాఫ్ స్కోర్ 147 కాగా.. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ కేటగిరీల్లో ఇది 113గా ఉంది. అయితే.. మెడికల్ సీట్లు తక్కువ సంఖ్యలో ఉన్న కారణంగా.. కటాఫ్ స్కోర్ కంటే అధిక మార్కులు సాధించిన వారు మాత్రమే కౌన్సెలింగ్‌లో సీటు సంపాదించగలరు. ఇక.. కౌన్సెలింగ్‌లో జనరల్ సీటు సాధించిన విద్యార్థి సగటు స్కోరు 500 పైచిలుకు ఉండగా.. రిజర్వేషన్ కేటగిరీ విద్యార్థుల్లో ఇది 250 నుంచి 300 మధ్య ఉంది. ఇక ప్రైవేటు, డీమ్డ్, సెల్ఫ్ ఫైనాన్సింగ్ సంస్థలో కూడా నీట్ స్కోర్ ఆధారంగా సీట్ల భర్తీ జరిగినప్పటికీ.. ఇక్కడ విద్యార్థుల ఆర్థిక స్థోమత ఎక్కువ ప్రభావం చూపిస్తుంది.


ఎన్నారై కోటాలో ఆర్థిక స్థితిగతులు మరింత ప్రముఖ పాత్ర పోషిస్తాయి. ఎన్నారై కోటాలో కటాఫ్ మార్కుల సగటు 300 కంటే తక్కువగానే ఉండటంతో.. ఇక్కడ విద్యార్థుల కటాఫ్ స్కోరులోని వ్యత్యాసాలు మరింత స్పష్టంగా కనిపిస్తున్నాయి. తక్కువ స్కోరు సాధించి.. ఎన్నారై కోటాలో సీటు పొందిన వారి కారణంగా వైద్య రంగంలో  ప్రతిభకు కోత పడుతున్నట్టేనని ఓ డాక్టర్ అభిప్రాయపడ్డారు. రిజర్వేషన్ కారణంగా నష్టం జరుగుతోందన్న వాదనకు ఈ పరిణామం మరింత బలం చేకూర్చుతుందని తెలిపారు.

Updated Date - 2022-03-16T02:08:11+05:30 IST