Advertisement
Advertisement
Latest Telugu News
Advertisement

ఎడారి దేశాల్లో కలలు పండించుకున్నాడు...

twitter-iconwatsapp-iconfb-icon

వలస అంటేనే ఒక బతుకు పోరాటం. ప్రపంచవ్యాప్తంగా కుబేరులైన వాళ్లలో ఎక్కువ మంది వలస జీవులే!. ఒట్టి చేతులతో ఎడారి దేశంలో అడుగుపెట్టిన ఈ కేరళ వాసి... ఇరవైరెండు దేశాల్లో సూపర్‌మార్కెట్లు, ఇతర వ్యాపారాలతో ఎలా ఎదిగాడు? వేల కోట్ల సామ్రాజ్యాన్ని ఎలా స్థాపించాడు? ఇవన్నీ ఆసక్తికరమే  కదూ! అన్ని మజిలీలున్న ఆ అపర కుబేరుడు.. లూలు గ్రూప్‌ వ్యవస్థాపకుడు యూసఫ్‌ అలీ ఎమ్‌.ఎ. 


ఆగస్టు 1990, నట్టికా, త్రిసూర్‌ జిల్లా, కేరళ. ‘హలో... హలో... యూసఫ్‌..! నాన్నను మాట్లాడుతున్నానురా.. కువైట్‌ మీద ఇరాక్‌ దాడి చేసింది కదా! గల్ఫ్‌ యుద్ధం మొదలవుతుందేమో? భయంగా ఉంది రా. మన జిల్లా కుర్రాళ్లు అందరూ వెనక్కి వచ్చేస్తున్నారు. నువ్వు కూడా వచ్చేసేయ్‌. ఊపిరి ఉంటే ఉప్పు అమ్ముకునైనా బతకొచ్చు...’’ అంటూ ఆందోళన వ్యక్తం చేశాడు  అబ్దుల్‌ ఖాదిర్‌.


‘‘ఎడారి దేశాలన్నిటికీ ముప్పు లేదు నాన్నా. నువ్వేమీ కంగారు పడకు. అమీర్‌షేక్‌లకు కూడా వాళ్ల ప్రాణాలంటే తీపే కదా. జీవితం అంటేనే సాహసం. ఇరాక్‌ వేసే బాంబులు అబుదాబిని తాకవులే. బెంగపడకు. నాకు ఏమీ కాదు..’’ అంటూ తండ్రికి భరోసా కల్పించాడు యూసఫ్‌.


కేరళలోని త్రిసూర్‌ తీర ప్రాంతంలోని పల్లెటూరు నట్టికా. ఆ ఊరిలోని ఓ మధ్య తరగతి కుటుంబంలో యూసఫ్‌ అలీ ముసలియాం వీట్టిల్‌ అబ్దుల్‌ ఖాదర్‌ (యూసఫ్‌ అలీ ఎం.ఎ.) పుట్టాడు. తండ్రి గుజరాత్‌కు వలస వెళ్లి, అక్కడ కిరాణా దుకాణం నడుపుతుండేవాడు. తాత, పెదనాన్నలే ఇంటికి పెద్దదిక్కు. యూసఫ్‌ బాగోగుల్ని తాత కుంజహమ్ము హాజీ చూసుకునేవాడు. చిన్నప్పటి నుంచే వ్యాపార నైపుణ్యాలు ఒంటబట్టాయి. సినిమాల్లో వాదించే న్యాయవాదులను చూశాక... ఆ వృత్తిలోకి వెళ్లాలన్న ఉబలాటం కలిగింది. హైస్కూలు పూర్తయ్యాక వేసవి సెలవుల్లో అహ్మదాబాద్‌కు వెళ్లి ... తండ్రి కిరాణా దుకాణంలో కూర్చుని సహాయపడేవాడు. పెట్టుబడి, లాభాల లెక్కలన్నీ చూసేవాడు. కొడుకు అకౌంట్స్‌ బాగా చేస్తున్నాడనిపించింది తండ్రికి. యూసఫ్‌ను బిజినెస్‌ మేనేజ్‌మెంట్‌ కోర్సులో చేర్పించాడాయన.

ఎడారి దేశాల్లో కలలు పండించుకున్నాడు...

ఓడలో గల్ఫ్‌కు...

1970... కేరళలో ఉపాధి అవకాశాలు లభించడం లేదు. గల్ఫ్‌, మధ్య ప్రాచ్య దేశాలకు మలయాళీల వలస మొదలైంది. బంధువులందరూ గల్ఫ్‌కు వెళ్లడం వల్ల యూసఫ్‌లో కుతూహలం కలిగింది. ఏదోఒక రోజు పనికొస్తుందని పాస్‌పోర్టు తీసుకున్నాడు. పద్దెనిమిదేళ్లు నిండాయి. డిప్లమో చేసినా ఉద్యోగం రాలేదు. ఏ పనీ లేకుండా ఖాళీగా తిరుగుతున్న మనవడిని చూసిన తాతకు మనసు వికలమైంది. అబుదాబిలోని ఓ బంధువుకు యూసఫ్‌ గురించి చెప్పింది అతని తల్లి సఫియా. ‘‘వాడు ఇక్కడికి వస్తే ఏదో ఒక ఉపాధి దొరుకుతుంద’’ని హామీ ఇచ్చాడతను. అక్కడికి పంపాలని నిర్ణయించుకుంది కుటుంబం. ఆ రోజుల్లో (1973) కేరళ నుంచి దుబాయికి చేరుకోవాలంటే... ఓడలో ఐదు రోజులు ప్రయాణించాలి. మనవడు వెళుతున్నాడన్న బెంగతో ఓడరేవులో అతనికి వీడ్కోలు పలికి... చేతిలో ఐదు రూపాయలు పెట్టి దిగాలుగా ఇంటికొచ్చాడు తాత. ‘‘కష్టపడి పనిచేసే వ్యక్తిని ఏ దేశమైనా అక్కున చేర్చుకుంటుంది బిడ్డా...’’ అంటూ ఆ పెద్దాయన చెప్పిన మాటలు ఓడలో కూర్చున్నంత సేపూ యూసఫ్‌ చెవుల్లో గిర్రున తిరుగుతున్నాయి.

ఎడారి దేశాల్లో కలలు పండించుకున్నాడు...

కిరాణాకొట్టులో పనిచేసి...

దుబాయ్‌లోని ‘పోర్ట్‌ రషీద్‌’ చేరుకున్నాడు యూసఫ్‌. అక్కడి నుంచి అబుదాబికి ఇప్పుడైతే గంటన్నర ప్రయాణం. అప్పట్లో ఐదుగంటలు ప్రయాణం చేసి చేరుకున్నాడు. మావయ్యకున్న చిన్న కిరాణ దుకాణంలో చేరాడు. ఇరుకిరుకు గదిలో నివాసం. నిప్పులు చెరిగే ఎండలున్న ఆ దేశంలో అప్పటికి ఏసీలు లేవు. అందులోనూ తీవ్రమైన విద్యుత్‌ కొరత. బకెట్ల నీళ్లు కుమ్మరిస్తేకానీ గచ్చు చల్లబడేది కాదు. కటికనేల మీదే పడుకునేవాడు. అప్పుడే చమురు నిక్షేపాలు వెలుగులోకి వచ్చాయి. పెద్దగా అభివృద్ధి లేదు. జనాభా కూడా తక్కువే. అనుభవం, అవగాహన లేని వయసులో జీవితం ఎటు తీసుకెళితే అటే అతని పయనం. ఎవరైనా ఒక పనిని అప్పగిస్తే శ్రద్ధతో చేస్తారు కానీ యూసఫ్‌ మాత్రం ఇలాగే ఎందుకు చెయ్యాలి? అంటూ యక్షప్రశ్నలు సంధించేవాడు. మూడేళ్లు కిరాణాకొట్టులో పనిచేసినన్ని రోజులు... ఆ వస్తువులు ఏ దేశాల నుంచీ వస్తున్నాయో గమనించాడు. ఎక్కడ ఏ ఉత్పత్తి చౌకగా లభిస్తుందో అర్థమైంది. ‘‘కిరాణా దుకాణంలో పైసలు లెక్కిస్తూ కూర్చునేకంటే... దిగుమతుల వ్యాపారంలోకి వెళితే మంచిది’’ అనుకున్నాడు. అదే సమయంలో షబీరాతో పెళ్లి అయ్యింది. ముగ్గురు ఆడపిల్లలు పుట్టారు. అదృష్టం మొదలైంది.

ఎడారి దేశాల్లో కలలు పండించుకున్నాడు...

సూపర్‌ మార్కెట్లపై కన్ను..

ఒకవైపు ఉద్యోగం చేస్తూనే మరోవైపు దిగుమతుల వ్యాపారంలోకి దిగాడు. మొదట్లో అనేక అడ్డంకులు ఎదురయ్యాయి. అనుభవం నేర్పిన పాఠాలతో నిలదొక్కుకున్నాడు. లాభాలను కళ్లజూడటంతో మావయ్య కూడా అండగా నిలిచాడు. సరుకు ఆర్డర్‌ చేయడం, కస్టమ్స్‌ సుంకం చెల్లించడం, పోర్టు నుండి ట్రక్కులోకి సరుకును లోడ్‌ చేసి గిడ్డంగికి తరలించడం... ఉత్పత్తులను నేరుగా దుకాణాలకు చేరవేయడం... ఇలా ప్రతీ పనీ తనొక్కడే చూసుకునేవాడు. గుమాస్తా, కూలీ, డ్రైవర్‌, సేల్స్‌మాన్‌ వంటి పాత్రలన్నీ పోషించేవాడు. దాదాపు రెండు దశాబ్దాల పాటు ఎగుమతులు-దిగుమతుల వ్యాపారంతో పాటు రిటైల్‌ రంగాన్ని కూడా కాచి వడబోశాడు. అప్పుడప్పుడే (1989) సూపర్‌మార్కెట్లు పుట్టుకొస్తున్న తరుణం. చిన్నచిన్న కిరాణా దుకాణాలకు భిన్నంగా... సువిశాలమైన భవంతుల్లో కస్టమర్లను ఆకర్షించే రీతిలో వస్తువులను అమర్చి... ఎవరికి కావాల్సినవి వారు తీసుకునే సౌలభ్యం కలిగిన సూపర్‌మార్కెట్లపై మక్కువ ఏర్పడింది. ఎందుకో ఆ కొత్త ట్రెండ్‌ యూసఫ్‌ను విపరీతంగా ఆకర్షించింది. వెంటనే ఉద్యోగం మానేసి ఆస్ట్రేలియా, హాంకాంగ్‌, సింగపూర్‌లకు వెళ్లిపోయాడు. ఆ దేశాల్లోని గొలుసుకట్టు సూపర్‌మార్కెట్లను పరిశీలించాడు. తను కూడా అబుదాబిలో ప్రయోగాత్మకంగా ఇలాంటి సూపర్‌మార్కెట్‌ను ప్రారంభించాలన్న ఆలోచన కలిగింది. ఏడాది పాటు శ్రమించి 1990లో ‘ఎమిరేట్స్‌ జనరల్‌ మార్కెట్‌’ పేరుతో ఒక సూపర్‌మార్కెట్‌ను మొదలుపెట్టాడు.

ఎడారి దేశాల్లో కలలు పండించుకున్నాడు...

షేక్‌ల మెప్పు పొంది...

సద్దాం హుస్సేన్‌ కువైట్‌పై దాడి చేశాడు. అగ్రరాజ్యాలు ఏకమై ఇరాక్‌ మీద యుద్ధం ప్రకటించాయి. ఏ ముహూర్తాన సూపర్‌మార్కెట్‌ ప్రారంభించాడో కానీ యుద్ధంతో కొత్త కష్టాలు వచ్చిపడ్డాయి. ‘‘ఆ వ్యాపారం వద్దు ఏమీ వద్దు. మనిషి బతికుంటే అదే పదివేలు. వెంటనే ఇండియాకు వచ్చేసేయ్‌’ అని తల్లిదండ్రులు ఒకటే పోరు పెట్టారు. ఇరాక్‌ మీద అమెరికా ప్రయోగించిన పేట్రియాట్‌ క్షిపణి అదుపుతప్పి దుబాయ్‌ మీద పడబోతోందన్న వదంతుల మధ్య... గల్ఫ్‌లోని భారతీయులంతా కట్టుబట్టలతో తిరిగి వచ్చేశారు. అయినా యూసఫ్‌ భయపడలేదు. ఆశను వదులుకోలేదు. విదేశీయులందరూ ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని గల్ఫ్‌ దేశాలను వదిలిపెడుతుంటే... అందుకు భిన్నంగా సూపర్‌మార్కెట్లను నెలకొల్పి ఽధైర్యంగా నిలబడటం అబుదాబి రాజకుటుంబీకులను ఆశ్చర్యపరిచింది. పలుకుబడి కలిగిన షేక్‌లతో యూసఫ్‌కు పరిచయాలు ఏర్పడ్డాయి. రాజ కుటుంబీకులతో కూడా కలిసే అవకాశాలు వచ్చాయి. ‘లూలు గ్రూప్‌ ఇంటర్నేషనల్‌’ అనే సంస్థను స్థాపించాడు. 1995లో అబుదాబిలో లూలు బ్రాండ్‌ పేరుతో అతి పెద్ద సూపర్‌మార్కెట్‌ను ప్రారంభించాడు. 2000లో దుబాయ్‌లో తొలి లూలు హైపర్‌మార్కెట్‌ స్టోర్‌ను తెరిచాడు. యూఏఈ, ఖతార్‌, సౌదీ అరేబియా, ఒమన్‌, కువైట్‌, బహ్రెయిన్‌, ఈజిప్టు, ఇండోనేషియా, మలేషియా, ఫిలిప్పీన్స్‌, యెమన్‌ వంటి దేశాలకు విస్తరించి... షాపింగ్‌మాల్స్‌, డిపార్ట్‌మెంట్‌ స్టోర్లు, సూపర్‌మార్కెట్‌, హైపర్‌మార్కెట్‌ స్టోర్లు నెలకొల్పాడు. గల్ప్‌లోని అన్ని దేశాలతో సాన్నిహిత్యం ఏర్పడింది.

ఎడారి దేశాల్లో కలలు పండించుకున్నాడు...

50 వేల ఉద్యోగులు...

యూసఫ్‌కు ఇక ఎదురేముంది? అరబ్బులో ఆశ్చర్యపోయే సామ్రాజ్యాన్ని విస్తరించాడు. రిటైల్‌ రంగంతో పాటు ఫుడ్‌ ప్రాసెసింగ్‌, ఎగుమతి-దిగుమతి, ఆతిథ్యం వంటి రంగాలకు ఎగబాకాడు. లండన్‌లోని పోలీస్‌ శాఖ ప్రధాన కార్యాలయం స్కాట్లాండ్‌ యార్డ్‌కు చెందిన పురాతన భవంతిని 170 మిలియన్‌ డాలర్లకు కొనుగోలు చేసి... స్టార్‌హోటల్‌గా మార్చేశాడు. సొంత రాష్ట్రం కేరళలోని కొచ్చిలో 17 ఎకరాల్లో లూలు మాల్‌ను నిర్మించాడు. ఒకప్పుడు భారత్‌లో అడుగుపెట్టి బ్రిటిష్‌ పాలనకు కారణమైన ఈస్ట్‌ ఇండియా కంపెనీలో 85 మిలియన్‌ డాలర్లు వెచ్చించి వాటాను కొన్నాడు. ధనలక్ష్మి బ్యాంక్‌, ఫెడరల్‌ బ్యాంక్‌, క్యాథలిక్‌ సిరియన్‌ బ్యాంక్‌, సౌత్‌ ఇండియన్‌ బ్యాంక్‌లతో పాటు కొచ్చి అంతర్జాతీయ విమానాశ్రయంలో కూడా పెట్టుబడులు పెట్టాడు యూసఫ్‌. ప్రస్తుతం లూలు గ్రూప్‌ 22 దేశాల్లో 215 రిటైల్‌స్టోర్లు, యాభైవేలకు పైగా ఉద్యోగులతో వెలిగిపోతోంది. -సునీల్‌ ధవళ, 97417 47700 సీయీవో, ద థర్డ్‌ అంపైర్‌ మీడియా అండ్‌ అనలిటిక్స్‌


Advertisement
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International

విదేశీ విన్నర్Latest News in Teluguమరిన్ని...

Advertisement
OpinionPoll
Advertisement
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.