అమరావతి అజరామరం.. రైతులతో కలిసి న్యాయపోరాటం చేస్తాం: జయరాం కోమటి

ABN , First Publish Date - 2020-08-01T16:09:20+05:30 IST

ఏపీ ముఖ్యమంత్రి అంటే 5 కోట్ల మందికి న్యాయం జరిగేలా నిర్ణయం తీసుకోవాలి గాని స్వార్థ రాజకీయ ప్రయోజనాలతో మాట మార్చి వేల మంది రైతుల జీవితాలను, కోట్ల మంది ప్రజల భవిష్యత్తును కాలరాసే నిర్ణయాలు తీసుకోవడం నియంతృత్వానికి పరాకాష్ట అని సీనియర్ ఎన్నారై జయరాం కోమటి మండిప‌డ్డారు.

అమరావతి అజరామరం.. రైతులతో కలిసి న్యాయపోరాటం చేస్తాం: జయరాం కోమటి

అమరావతి: ఏపీ ముఖ్యమంత్రి అంటే 5 కోట్ల మందికి న్యాయం జరిగేలా నిర్ణయం తీసుకోవాలి గాని స్వార్థ రాజకీయ ప్రయోజనాలతో మాట మార్చి వేల మంది రైతుల జీవితాలను, కోట్ల మంది ప్రజల భవిష్యత్తును కాలరాసే నిర్ణయాలు తీసుకోవడం నియంతృత్వానికి పరాకాష్ట అని సీనియర్ ఎన్నారై జయరాం కోమటి మండిప‌డ్డారు. ఆయన నేతృత్వంలో ఇటీవలే  ‘‘అమరావతి కోసం ఎన్నారైలు‘‘ 200వ రోజున పెద్ద ఎత్తున నిరసన తెలిపిన విషయం తెలిసిందే. తాజాగా రాజధాని వికేంద్రీకరణ బిల్లును గవర్నర్ ఆమోదించిన నేపథ్యంలో ఆయన తీవ్ర నిరసన వ్యక్తంచేస్తూ స్పందించారు. ఇది ఒక చారిత్రక తప్పిదమని, రాష్ట్రానికి దుర్దినం అని వ్యాఖ్యానించారు. అమరావతిపై నిర్ణయం తీసుకునేప్పుడు ముఖ్యమంత్రి గాని, గవర్నర్ గాని మొత్తం ప్రజల విశాల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని నిర్ణయం తీసుకోలేదని  ఆరోపించారు.


మూడు రాజధానులు ప్రపంచంలో ఎక్కడా ప్రాక్టికల్‌గా సాధ్యం  కాలేదని, అది ఒక విఫల ప్రయోగంగా మిగిలిపోతుందని అభిప్రాయ పడ్డారు. ఈరోజు దేశంలో ఆదాయ పరంగా ముందంజలో ఉన్న రాష్ట్రాలు ఏవంటే... మహారాష్ట్ర, తమిళనాడు, కేరళ, గుజరాత్, కర్ణాటక, తెలంగాణ అని... దీనికి  ఉపాధి, ఉద్యోగ, వ్యాపార కేంద్రాలైన మహానగరాలు ముంబై, చెన్నై, కోచి, అహ్మదాబాద్, బెంగుళూరు, హైదరాబాదు వాటిలో ఉండటమే కారణం అన్నారు. తన సుధీర్ఘ అనుభవంతో  దీనిని దృష్టిలో పెట్టుకునే అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు భావి తరాలకు దారి   చూపేలా మహానగరం నిర్మాణానికి ప్రణాళిక రచించారని అన్నారు. మూడు పంటలు వేసుకుని ఏటా లక్షలు సంపాదిస్తూ హాయిగా బతికే అమరావతి రైతులు రాష్ట్ర ప్రజలందరి భవిష్యత్తు కోసం ప్రభుత్వం మాట నమ్మి తమ పంట పొలాలను రాజధానికి ఇచ్చేశారన్నారు. అది త్యాగం మాత్రమే కాదని, ప్రభుత్వ వ్యవస్థలపై ప్రజలకు ఉన్న నమ్మకం అన్నారు.


నేడు ముఖ్యమంత్రి జగన్... దేశానికి ఒక చెడు దారి చూపించారని... ప్రభుత్వాల మాటకు, ఒప్పందాలకు విలువ ఉండదని నిరూపించాడని... దీనివల్ల భారతదేశం తీవ్రంగా నష్టపోతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం చేసుకున్న ఒప్పందాలకు గ్యారంటీ లేకపోతే... భారతదేశంలో ఏ పౌరుడు ఇకపై ప్రభుత్వాలను, ప్రభుత్వాల ఒప్పందాలను నమ్మరు అని అన్నారు. దీనివల్ల ప్రభుత్వానికి ప్రజలకు మధ్య దూరం పెరుగుతుందని, సమాజంలో ఒక అశాంతికి దారితీస్తుందని హెచ్చరించారు. ఏపీ ముఖ్యమంత్రి బిల్లును రూపొందించినా, గవర్నర్ దానిని ఆమోదించి చట్టమయ్యేలా మార్చినా, రాజ్యాంగం ద్వారా ఏర్పడిన పునర్విభజన చట్టం ప్రకారం ఇది చెల్లుబాటు కాదన్నారు. అమరావతి రైతులకు అండగా ఎన్నారైలంతా కలసి న్యాయ పోరాటం చేస్తామని వెల్లడించారు. నిమ్మగడ్డ రమేష్ కుమార్ వ్యవహారంలో కూడా తాను ఆమోదించిన ఆర్డినెన్స్ ద్వారా పదవి కోల్పోయిన రమేష్ కుమార్ చివరకు అదే గవర్నర్ తన చేతుల మీదుగా నియమించాల్సి వచ్చిందన్నారు. రాజ్యాంగం కంటే ఈ దేశంలో ఏదీ శక్తిమంతమైనది లేదని.... ఆ రాజ్యాంగాన్ని పరిరక్షించే కోర్టుల ద్వారా అమరావతి రైతులకు కచ్చితంగా న్యాయం జరుగుతుందని ఆశాభావం వ్య‌క్తం చేశారు. ఏపీ చరిత్రలో దీనిని చీకటి రోజుగా మిగిలిపోనివ్వమని... తిరిగి అమరావతి శాశ్వత రాజధానిగా వెలుగొందుతుందన్నారు.  ‌    


Updated Date - 2020-08-01T16:09:20+05:30 IST