విజయవంతంగా కాలేయ మార్పిడి శస్త్రచికిత్స

ABN , First Publish Date - 2022-07-04T05:58:29+05:30 IST

చినకాకాని ఎన్నారై ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌లో కాలేయ మార్పిడి శస్త్రచికిత్సను ఆదివారం విజయవంతంగా నిర్వహించినట్టు వైద్య బృందం తెలిపింది.

విజయవంతంగా కాలేయ మార్పిడి శస్త్రచికిత్స
శస్త్రచికిత్స వివరాలను వెల్లడిస్తున్న ఎన్నారై వైద్య బృందం

ఎన్నారై ఆస్పత్రి వైద్యుల ఘనత 

మంగళగిరి, జూలై 3: చినకాకాని ఎన్నారై ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌లో కాలేయ మార్పిడి శస్త్రచికిత్సను ఆదివారం విజయవంతంగా నిర్వహించినట్టు వైద్య బృందం తెలిపింది. ఈ శస్త్రచికిత్సకు తమ వైద్య బృందం దాదాపు ఏడు గంటలు శ్రమించినట్లు ఎన్నారై ట్రాన్స్‌ప్లాంట్‌ సర్వీసెస్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ మస్తాన్‌ సాహెబ్‌ తెలిపారు. ఈ సందర్భంగా వారు విలేకర్లతో మాట్లాడుతూ మొవ్వ మండలం కారకంపాడుకు చెందిన ఓ వ్యక్తి కొన్నాళ్లుగా లివర్‌ ఫెయిల్యూర్‌ వ్యాధితో బాధపడుతు న్నాడు. కాలేయ మార్పిడి చేయవలసిన పరిస్థితి అనివార్యమైంది. కర్నూలు కిమ్స్‌ ఆసుపత్రిలో గద్వాల్‌కు చెందిన ఓ గర్భిణీ (30) శస్త్ర చికిత్స ద్వారా ఆడ శిశువుకు జన్మనిచ్చింది. ఈ క్రమంలో చికిత్స పొందుతున్న ఆ బాలింత దురదృష్టవశాత్తూ బ్రెయిన్‌డెడ్‌కు గురైంది. అవయవదానంలో భాగంగా ఎన్నారై మెడికల్‌ కళాశాలకు కాలేయం, నెల్లూరు అపోలో హాస్పిటల్‌కు రెండు కిడ్నీలు లభించాయి. కర్నూలు నుంచి ఆదివారం ఉదయం ఆరు గంటలకు కాలేయాన్ని ఎన్నారై వైద్య కళాశాలకు తీసుకువచ్చారు. అప్పటికే ఎన్నారైలో లివర్‌ ఫెయిల్యూర్‌ వ్యాధితో బాధపడుతున్న 40 ఏళ్ల బాధితుడికి కాలేయ మార్పిడి శస్త్ర చికిత్సను ఏడు గంటలపాటు శ్రమించి విజయవంతంగా నిర్వహించారు. ఆరోగ్యశ్రీ పరిధిలోకి రాని ఈ శస్త్రచికిత్సకు బాధిత కుటుంబం సీఎం సహాయ నిధి నుంచి రూ.పది లక్షలు పొందిందన్నారు. సమావేశంలో ఎన్నారై లివర్‌ ట్రాన్స్‌ప్లాంట్‌ సర్జన్లు డాక్టర్‌ వి.శ్రీకాంత్‌, డాక్టర్‌ జయపాల్‌ రెడ్డి, డాక్టర్‌ పీ.రాజశేఖర్‌ (చెన్నై), విజయవాడ ఆయుష్‌ సర్జన్‌ డాక్టర్‌ యు.చక్రపాణి, అనెస్థిస్ట్‌ డాక్టర్‌ మెహర్‌ ప్రదీప్‌ తదితరులు పాల్గొన్నారు.


Updated Date - 2022-07-04T05:58:29+05:30 IST