Fraud: అమెరికన్లను మోసగించిన భారత సంతతి యువకుడికి 4 ఏళ్ల జైలు శిక్ష..!

ABN , First Publish Date - 2022-07-25T22:43:54+05:30 IST

కరోనా సంక్షోభాన్ని(Covid crisis) అడ్డుపెట్టుకుని అమెరికాలో పలువురిని మోసగించిన భారత సంతతి వ్యక్తికి అక్కడి న్యాయస్థానం ఇటీవల జైలు శిక్ష విధించింది.

Fraud: అమెరికన్లను మోసగించిన భారత సంతతి యువకుడికి 4 ఏళ్ల జైలు శిక్ష..!

ఎన్నారై డెస్క్: కరోనా సంక్షోభాన్ని(Covid crisis) అడ్డుపెట్టుకుని అమెరికాలో పలువురిని మోసగించిన భారత సంతతి వ్యక్తికి(NRI) అక్కడి న్యాయస్థానం ఇటీవల జైలు శిక్ష విధించింది. న్యూజెర్సీ రాష్ట్రం, మాంట్‌గోమరీకి చెందిన 27 ఏళ్ల గౌరవ్‌జిత్ సింగ్..తను చేసిన నేరాన్ని అంగీకరించడంతో న్యాయస్థానం అతడికి నాలుగేళ్ల కారాగార శిక్ష విధించింది. అంతేకాకుండా..గౌరవ్‌జిత్‌ విడుదలయ్యాక మరో మూడేళ్ల పాటు అతడిపై అధికారుల నిఘా ఉంటుందని చెప్పింది.


పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పీపీఈ కిట్లు సరఫరా చేసేందుకు నిందితుడు పలువురితో మొత్తం 7.1 మిలియన్ డాలర్ల విలువైన ఒప్పందాలు కుదుర్చుకున్నాడు. 1.5 మిలియన్ కిట్లు సరఫరా చేస్తానని వారికి హామీ ఇచ్చాడు. అనంతరం.. గౌరవ్‌జిత్ కోరిన విధంగా పది మంది బాధితులు ఆన్‌లైన్‌లో 2 మిలియన్ డాలర్ల పైచిలుకు మొత్తాన్ని బదిలీ చేశారు. తొలుత అడ్వాన్స్ కింద బాధితుల నుంచి ఒప్పందంలో పేర్కొన్న మొత్తంలో పది శాతాన్ని తీసుకున్నాడు. ఆ తరువాత.. నిందితుడి ఒత్తిడి చేయడంతో మిగిలిన మొత్తాన్ని కూడా వారు ఆన్‌లైన్‌ ట్రాన్సఫర్ చేశారు. అయితే.. ఈ నిధులను గౌరవ్‌జిత్ తన సొంత అవసరాల కోసం వినియోగించడంతో చివరికి అతడిపై కేసు నమోదైంది. నేరం రుజువుకావడంతో గౌరవ్‌జిత్ సింగ్ చివరికి కటకటాలపాలయ్యాడు. 

Updated Date - 2022-07-25T22:43:54+05:30 IST