రూ.37 కోట్ల కోసం NRI భారీ స్కెచ్.. చనిపోయినట్టు సీన్ క్రియేట్.. పోలీసులు కూడా నమ్మేశారు.. కానీ..

ABN , First Publish Date - 2021-10-26T23:13:38+05:30 IST

రూ. 37కోట్ల ఇన్సూరెన్స్ డబ్బుల కోసం ఓ ఎన్నారై వేసిన స్కెచ్ బెడిసి కొట్టింది.

రూ.37 కోట్ల కోసం NRI భారీ స్కెచ్.. చనిపోయినట్టు సీన్ క్రియేట్.. పోలీసులు కూడా నమ్మేశారు.. కానీ..

ముంబై: రూ. 37కోట్ల ఇన్సూరెన్స్ డబ్బుల కోసం ఓ ఎన్నారై వేసిన స్కెచ్ బెడిసి కొట్టింది. తనను తాను చనిపోయినట్టు నమ్మించి ఇన్సూరెన్స్ కంపెనీ నుంచి ఆ నగదు తీసుకోవాలనేది ఆ ఎన్నారై పన్నాగం. దానికోసం మరో నలుగురితో కలిసి పాముతో కరిపించి మరీ అన్యాయంగా ఓ మతిస్థిమితం లేని వ్యక్తిని కూడా చంపేశాడు. ఆస్పత్రి నుంచి చనిపోయింది తానేనని తన పేరుపై మరణధృవ పత్రం తీసుకుని అమెరికాలోని ఇన్సూరెన్స్ కంపెనీకి కూడా పంపించాడు. ఇక రూ.37 కోట్లు చేతికి రావడమే ఆలస్యం అనుకుంటున్న సమయంలో ఇన్సూరెన్స్ కంపెనీ నిర్వహించిన విచారణలో అసలు విషయం తెలిసింది. దాంతో ఎన్నారైను పోలీసులు అదుపులోకి తీసుకుని కటకటాల్లోకి నెట్టారు.


వివరాల్లోకి వెళ్తే.. మహారాష్ట్రలోని అహమ్మద్ నగర్ జిల్లాకు చెందిన ప్రభాకర్ వాఘచౌరే(54) అనే ఎన్నారై తన ఫ్యామిలీతో కలిసి 20 ఏళ్ల నుంచి అమెరికాలో నివాసం ఉంటున్నాడు. ఆయన అక్కడి ఓ ఇన్సూరెన్స్ కంపెనీ నుంచి 5 మిలియన్ డాలర్ల(భారత కరెన్సీలో రూ.37కోట్లు) పాలసీ తీసుకున్నాడు. ఈ పాలసీ నగదును ఎలాగైనా ముందే క్లైమ్ చేసుకోవాలనే ఆలోచనతో ప్రభాకర్ ఈ ఏడాది జనవరిలో స్వదేశానికి తిరిగొచ్చాడు. భారత్‌కు వచ్చిన తర్వాత అహమ్మద్ నగర్ జిల్లాలోని ధామన్‌గావ్ పత్‌ అనే గ్రామంలో ఉన్న తన అత్తగారి ఇంట్లో కొన్ని రోజులు ఉన్నాడు. అనంతరం రాజ్‌పూర్ అనే ఊరికి మకాం మార్చాడు. అక్కడ ఓ ఇల్లు కిరాయికి తీసుకున్నాడు. అయితే, ప్రభాకర్ రాజ్‌పూర్ గ్రామానికి ఓ భారీ స్కెచ్‌తోనే వెళ్లాడు. ఆ ఊరిలో మతిస్థితిమి లేని 50ఏళ్ల ఓ వ్యక్తి ఉన్నాడు. అతడ్ని చంపేసి తాను చనిపోయినట్లు నమ్మించాలనేది ప్రభాకర్ ప్లాన్. దీనికోసం సందీప్ తలేకర్, హర్షద్ లహమేజ్, హరిష్ కులాల్, ప్రశాంత్ చౌదరీ అనే నలుగురు వ్యక్తుల సహాయం తీసుకున్నాడు. వారికి భారీ మొత్తం ఇస్తానని ఒప్పందం చేసుకున్నాడు. దీంతో ఈ నలుగురు విషపూరితమైన పామును తీసుకొచ్చి మతిస్థిమితి లేని వ్యక్తిని కరిపించారు. దాంతో అతడు చనిపోయాడు. ఏప్రిల్‌లో ఈ ఘటన జరిగింది. 


అనతరం ఆ వ్యక్తి మృతదేహాన్ని ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లి చనిపోయింది ప్రభాకర్ వాఘచౌరే అనే ఎన్నారై అని ఆ నలుగురు నమ్మించారు. ఇటీవలే అమెరికా నుంచి వచ్చినట్లు కావాల్సిన ఆధారాలు కూడా చూపించారు. ఆ తర్వాత ప్రభాకర్ పేరు మీద డెత్ సర్టిఫికేట్ కూడా సంపాదించారు. అలా ప్రభాకర్ తనను తాను చనిపోయినట్టు ధృవపత్రాన్ని సృష్టించి అమెరికాకు పంపించాడు. ఆ సర్టిఫికేట్‌తో ఆయన కుమారుడు ఇన్సూరెన్స్ కంపెనీలో రూ.37కోట్ల పాలసీ క్లైమ్ కోసం దరఖాస్తు చేశాడు. కానీ, కంపెనీ అధికారులకు ఈ వ్యవహారం కొంచెం తేడాగా అనిపించింది. దాంతో నలుగురు అధికారులను దర్యాప్తు కోసం భారత్‌కు పంపించింది. అధికారులు ఆరా తీయడంతో అసలు విషయం తెలిసింది. దాంతో అధికారులు అహమ్మద్ నగర్ పోలీసులకు సమాచారం అందించారు. రంగంలోకి దిగిన పోలీసులు ప్రభాకర్‌ ఆచూకీ కోసం గాలించారు. దీంతో గుజరాత్‌లోని వడోదరలో ఆయన దొరికాడు. దాంతో అదుపులోకి తీసుకుని కటకటాల్లోకి నెట్టారు.  


Updated Date - 2021-10-26T23:13:38+05:30 IST