Abn logo
Oct 28 2021 @ 20:22PM

ఎన్నారైని బలవంతంగా భారత్ నుంచి పంపించేశారు.. సాయం చేయండి.. మోదీకి వినతి

ఇంటర్నెట్ డెస్క్: గ్లోబలైజేషన్ పుణ్యమా అని భారతీయులు ప్రపంచంలోని పలు దేశాల్లో స్థిరపడి భారత్ పేరుప్రఖ్యాతులు జగద్విదితం చేస్తున్నారు. అయితే.. భారతీయ మూలాలు ఎన్నటికీ మరువలేని ప్రవాసీలపై ఇక్కడి పరిణామాలు కూడా ఎంతో కొంత ప్రభావం చూపిస్తుంటాయి. అయితే.. ఇటీవల కాలంలో భారత్‌లో జరుగుతున్న రైతు ఉద్యమాలతో కలత చెందిన దర్శన్ సింగ్ ధలీవాల్ అమెరికా నుంచి ఇండియాకు వచ్చారు. ఆయన తన వయసును కూడా లెక్క చేయకుండా సాగు చట్టాలకు వ్యతిరేకంగా ఉద్యమిస్తున్న రైతుల కోసం ఏదోకటి చేయాలనే తపనతో లంగర్ ఏర్పాటు చేశారు. లంగర్ అంటే సామూహిక భోజన వసతి అని అర్థం. ఆకలితో ఉన్న వారెవరైనా ఇక్కడికి వచ్చి కడుపునిండా భోజనం చేయచ్చు. రైతులకు తాను ఉడతాభక్తిగా చేయగలిగినంత చేయాలనే ఉద్దేశ్యంతోనే ఆయన లంగర్ ఏర్పాటు చేశారు.  అయితే.. ఇటువంటి ప్రయత్నాలు చేస్తున్న ఆయనను అధికారులు అమెరికాకు తిరిగి పంపించేశారు. ఈ నేపథ్యంలో దర్శన్ సింగ్ ధలీవాల్ ఉదంతం ప్రస్తుతం వైరల్‌గా మారింది. 

ఎవరీ ధలీవాల్.. 

పాటియాలాకు దగ్గర్లో ఉన్న చిన్న గ్రామంలో దర్శన్ సింగ్ దలీవాల్ జన్మించారు. 1972లో 22 ఏళ్ల వయసున్నప్పుడు ఆయన అమెరికాకు వలస వెళ్లారు. అక్కడ స్వశక్తితో అంచలంచెలుగా ఎదిగి ఉన్నతస్థానానికి చేరుకున్నారు. ఆయన ప్రస్తుతం మిల్వాకీలో నివసిస్తున్నారు. దలీవాల్‌కు అక్కడ అనేక పెంట్రోల్ పంప్‌లు ఉన్నాయి. ఆయన తమ్ముడు.. మునుపటి శిరోమణి అకాలీధళ్ ప్రభుత్వంలో మంత్రిగా కూడా పనిచేశారు. ఇక 2004లో భారత్‌ను సునామీ కుదిపేసినప్పుడు దర్శన్ సింగ్ కూడా రంగంలోకి దిగి బాధితులకు తన వంతు సాయం చేశారు. అంతేకాకుండా.. తన అభివృద్ధికి కారణమైన అమెరికాలోనూ అనేక సేవా కార్యక్రమాలు చేపట్టారు. మిల్వాకీలో ఓ ఫుట్‌బాల్ గ్రౌండ్ నిర్మాణం కోసం ఒక మిలియన్ డాలర్లను విరాళంగా ఇచ్చారు. అక్కడ మహాత్మా గాంధీ విగ్రహాన్ని ఏర్పాటు చేయడంతో పాటూ  విస్కాన్సిన్ యూనివర్శిటీకి కూడా తరచూ విరాళాలు ఇస్తుంటారు. దర్శన్ సింగ్ 1977లో స్థానికురాలైన డెబ్రాను వివాహం చేసుకున్నారు. వారికి ఆరుగురు సంతానం. 

కాగా.. గత ఏడాది దర్శన్ సింగ్ నాలుగు సార్లు భారత్‌కు వచ్చి వెళ్లారు. అయితే.. ఢిల్లీ విమానాశ్రయంలో దిగిన ప్రతిసారీ ఆయనను అధికారులు దాదాపు 2 గంటల పాటు వివిధ రకాల ప్రశ్నలు వేసి ఆ తరువాతే వదిలిపెట్టేవారు. ఇక అక్టోబర్ 23న మరోసారి దర్శన్ సింగ్ ఇండియాలో కాలు పెట్టారు. ఈ మారు మాత్రం ఎయిర్ పోర్టులోని అధికారులు ఆయనను ఏకంగా 6 గంటల పాటు ప్రశ్నించారు. రైతులకు సహాయపడొద్దంటూ ఆయనను అధికారులు కోరారని, అయితే.. తాను కేవలం లంగర్ మాత్రమే ఏర్పాటు చేశానని దర్శన్ పేర్కొన్నట్టు ఆయన సోదరుడు మీడియాకు తెలిపారు. అయితే..అధికారులు మాత్రం ఆయను ఇండియాకు వచ్చిన ఫ్లైట్‌లోనే తిరిగి వెనక్కు పంపించారు. కాగా.. పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి ప్రకాశ్ సింగ్ బాదల్ ఈ విషయాన్ని నేరుగా ప్రధాని దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. రైతుల కోసం లంగర్ ఏర్పాటు చేసినందుకు శిక్షగా ఆయనను వెనక్కు పంపించేశారని, ఈ విషయంలో మోదీ కల్పించుకోవాలని మాజీ ముఖ్య మంత్రి కోరారు. 

తాజా వార్తలుమరిన్ని...