9/11లో పుట్టి.. 9/11న చనిపోయిన NRI.. ట్విన్ టవర్స్‌పై టెర్రరిస్టులు జరిపిన దాడిలో పక్కవారికి సాయం చేయబోయి..

ABN , First Publish Date - 2021-09-12T04:02:38+05:30 IST

9/11 ఎటాక్. అమెరికా చరిత్రలో జరిగిన అత్యంత దారుణమైన టెర్రరిస్ట్ ఎటాక్ అది. ఈ దాడిలో 2వేల మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. అంతటి వికృతమైన దాడి జరిగి నేటికి సరిగ్గా..

9/11లో పుట్టి.. 9/11న చనిపోయిన NRI.. ట్విన్ టవర్స్‌పై టెర్రరిస్టులు జరిపిన దాడిలో పక్కవారికి సాయం చేయబోయి..

9/11 ఎటాక్. అమెరికా చరిత్రలో జరిగిన అత్యంత దారుణమైన టెర్రరిస్ట్ ఎటాక్ అది. ఈ దాడిలో 2వేల మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. అంతటి వికృతమైన దాడి జరిగి నేటికి సరిగ్గా 20 ఏళ్లు. ఆ నాటి ఘటనలో కొందరు భారతీయులు కూడా ప్రాణాలు కోల్పోయారు. అలా మరణించిన వారిలో పుట్టిన రోజు నాడే చివరి శ్వార విడిచిన ఓ తెలుగువ్యక్తి గురించి ఇప్పుడు తెలుసుకుందాం.


ఆ రోజు సాయంత్రం తన భార్య వసంతతో కలిసి ఎంతో ఆనందంగా జన్మదిన వేడుకలు జరుపుకోవాలని వెలమూరి శంకర్ భావించారు. కానీ అది జరగలేదు. పుట్టిన రోజు జరుపుకోవాల్సిన ఆయన ప్రాణాలే కోల్పోయారు. తీవ్రవాదుల దాడిలో కాలి బూడిదయ్యారు. 60 ఏళ్ల శంకర్ వెలమూరి న్యూయార్క్ స్టేట్ టాక్సేషన్ డిపార్ట్‌మెంట్‌లో ఆడిటర్‌, మేనేజర్‌గా పనిచేస్తున్నారు. అతడి భార్య వసంత కూడా అక్కడికి దగ్గరలోనే ఉన్న న్యూయార్క్ స్టేట్ ఇన్స్యూరెన్స్ ఫండ్ సంస్థలో పనిచేస్తున్నారు. సెప్టెంబర్ 11న శంకర్ పుట్టినరోజు. 2001 సెప్టెంబర్ 11న తన ఆఫీసులో త్వరగా పని ముగించుకుని, భార్యతో కలిసి పుట్టిన రోజు వేడుకలు జరుపుకోవాలని అనుకున్నారు. దాని కోసం అన్ని ఏర్పాట్లూ చేసుకున్నారు. కానీ అనుకోకుండా జరిగిన ఘోర ప్రమాదంలో శంకర్ ప్రాణాలు కోల్పోయారు.


న్యూ జెర్సీలోని వ్యాపారవేత్తగా ఉన్న శంకర్ అన్న కుమారుడు కలాధర్ బాపు అప్పటి ఘటన గురించి గుర్తు చేసుకున్నాడు. ‘మా మామయ్య కచ్చితంగా బతికేవారు. ఇతరులకు సాయం చేయాలనుకునే ఆలోచనే ఆయన ప్రాణాలు తీసింది. ఆయన దాదాపు భవనంలో నుంచి బయటకు వచ్చేశారు. కానీ ఓ గర్భవతిని కాపాడాలని తిరిగి లోనికి వెళ్లారు. ఆమెను కాపాడాడు. ఆ తర్వాత మరో తోటి ఉద్యోగినీ కాపాడాడు. వారిద్దరూ క్షేమంగా బయటకు వచ్చారు. కానీ మా మామయ్య మాత్రం ప్రాణాలు కోల్పోయారు.’ అని బాపు కన్నీరు పెట్టుకుంటున్నారు.


ఇక ప్రస్తుతం 80 ఏళ్ల వసంత.. అప్పట్లో భర్తతో కలిసి నివశించిన ఇంట్లోనే ఇప్పటికీ నివశిస్తున్నారు. 20 ఏళ్ల వివాహ బంధంలో పిల్లలు కూడా లేకపోవడంతో ఒంటరిగానే జీవితాన్ని వెళ్లదీస్తున్న వసంత.. భర్తతో కలిసి ఉన్నప్పటి జ్ఞాపకాలను నెమరువేసుకుంటూ గడుపుతున్నారు. ప్రతి ఏడాది సెప్టెంబర్ 11న భర్త స్మృతిగా ఆ ప్రాంతానికి వెళ్లి నివాళులు అర్పిస్తూ వస్తున్నారు. కానీ గతేడాది కోవిడ్ లాక్‌డౌన్ కారణంగా వెళ్లలేకపోయారు.


ఇదిలా ఉంటే ఆ దుర్ఘటనలో 2,606 మంద్రి ప్రాణాలు కోల్పోయారు. ఈ దుర్ఘటన జరిగి నేటికి 20 ఏళ్లు గడిచిన సందర్భంగా అమెరికా వ్యాప్తంగా ప్రత్యేక కార్యక్రమం నిర్వహించనున్నారు. దుర్ఘటనలో మరణించిన వారందరికీ వారి బంధువులు నివాళులు అర్పించనున్నారు.

Updated Date - 2021-09-12T04:02:38+05:30 IST