ఉపాధి పనుల్లో నూతన విధానం

ABN , First Publish Date - 2022-05-16T03:49:43+05:30 IST

జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో కేంద్ర ప్రభుత్వం నూతన విధానాల అమలుకు శ్రీకారం చుట్టింది. నిన్నటి వరకు రాష్ట్రాల పరిధిలో ఉన్న పెత్తనాన్ని కేంద్రం తమ చేతిలోకి తీసుకుంది.

ఉపాధి పనుల్లో నూతన విధానం
ఉపాధి పనులు చేస్తున్న కూలీలు

నేటి నుంచి అమలు

వరికుంటపాడు, మే 15: జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో కేంద్ర ప్రభుత్వం నూతన విధానాల అమలుకు శ్రీకారం చుట్టింది. నిన్నటి వరకు రాష్ట్రాల పరిధిలో ఉన్న పెత్తనాన్ని కేంద్రం తమ చేతిలోకి తీసుకుంది. ఇక నుంచి పనుల ఎంపికతో పాటు పనులు జరిగే తీరును మరింత కఠినతరం చేయనుంది. ఆ విధానాలను సైతం సోమవారం నుంచే అమలు చేయనుంది. దీంతో ఇప్పటి వరకు తమ ఇష్టానుసారంగా వ్యవహరించి నిధుల దుర్వినియోగానికి పాల్పడిన క్షేత్ర సహాయకులు, కూలీల ఆగడాలకు అడ్డుకట్ట పడనుంది. అందులో భాగంగా ఒక పూట సాగుతున్న పనులను రెండు పూటలుగా చేయాల్సి ఉంది. అందుకు గాను సమయాన్ని నిర్ణయించి ఉదయం 7 గంటల నుంచి 11 వరకు, మధ్యాహ్నం 2నుంచి 5 గంటల వరకు ప్రతి కూలీ తప్పని సరిగా పనులకు హాజరు కావాలనే నిబంధనను విధించింది. బినామీలను కట్టడి చేసేందుకు కూలీలపై నిఘాను పెంచుతూ రెండు పూటలు కూడా పనులు జరుగుతున్న తీరు, మస్టర్లను ఫొటోలు తీసి ఎన్‌ఎంఎంఎ్‌స యాప్‌లో అప్‌లోడ్‌ చేయాలనే ఆదేశాలను జారీ చేసింది. ఈ నేపథ్యంలో  కష్టపడి పనిచేసిన కూలీలకు తగిన రీతిలోనే ఆశించిన మేరకు నగదు అందే అవకాశం ఉంది. ప్రస్తుతం వరికుంటపాడు మండలంలో 225 శ్రమశక్తి సంఘాల పరిధిలో నాలుగు వేల మంది కూలీలు పనులకు హాజరవుతున్నారు.

Updated Date - 2022-05-16T03:49:43+05:30 IST