ఉపాధి పనుల్లో మెక్కింది ఎంత?

ABN , First Publish Date - 2022-06-12T05:05:36+05:30 IST

మండలంలో జరిగిన ఊపాధి పనుల్లో భారీగా నిధుల దుర్వినియోగం జరిగినట్లు తెలుస్తుంది. డీఆర్‌పీలు

ఉపాధి పనుల్లో మెక్కింది ఎంత?

అనంతసాగరం, జూన్‌ 11: మండలంలో జరిగిన ఊపాధి పనుల్లో భారీగా నిధుల దుర్వినియోగం జరిగినట్లు తెలుస్తుంది. డీఆర్‌పీలు ఇటీవల పనులపై క్షేతస్థాయిలో తనిఖీ చేసిన సందర్భంలో అవినీతి పెచ్చుమీరినట్లు గుర్తించారు. అయితే ఎంత మేరకు నిదులు దుర్వినియోగం జరిగాయి, అవకతవకలకు సంబంధించిన వివరాలు బయటకు రాలేదు. మూడేళ్లలో ఇళ్ల స్థలాల అభివృద్ధి, కాలువలో పూడికతీత పనులు, ఫారం పాండ్స్‌, జంగిల్‌ క్లియరెన్స్‌, అవెన్యూ ప్లాంట్ల ద్వారా గ్రామాల్లో మొక్కలు నాటించడం తదితర పనులు జరిగాయి. 2019-20, 2020-21, 2021-22 ఆర్థిక సంవత్సరాల్లో సుమారు రూ.10 కోట్లతో ఈ పనులు జరిగాయి. అయితే కరోనా కారణంగా పనులపై వార్షిక తనిఖీ కార్యక్రమం రెండేళ్లుగా జరగలేదు. ఈ క్రమంలో మూడేళ్లకు సంబంధించిన సామాజిక తనిఖీ కార్యక్రమం గత నెల రెండవ వారంలో డీఆర్‌పీ ద్వారా చేపట్టారు. ఈ సందర్భంగా కొన్ని చోట్ల పనులు చేసిన ఆనవాళ్లు లేని విషయాలను గుర్తించారు. 

గ్రామసభల్లో అవకతవలపై నిలదీత

కొన్ని గ్రామాల్లో ఫారంపాండ్స్‌ తవ్వకుండానే తవ్వినట్లు రికార్డులలో నమోదు చేయడంతో పాటు పనికి రాని వారిని వచ్చినట్లు మస్టర్లు వేసిన విషయం ఇటీవల జరిగిన గ్రామసభల ద్వారా బహిర్గతమైంది. ఎఫ్‌ఏ, టీఏలు కలిసి భారీగా స్వాహా చేసినట్లు ఆరోపణలు వెలువెత్తాయి. పడమటికంభంపాడు, చిలకలమర్రి తదితర గ్రామాల్లో జరిగిన గ్రామసభలలో నిఽధుల దుర్వినియోగంపై ప్రజలు అధికారులను నిలదీశారు. చిలకలమర్రిలో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగులు కూడా పని చేసిన ట్లు మస్టర్లు నమోదు చేసిన విషయాన్ని మాజీ ఎంపీపీ సుబ్బరాజు గ్రామసభలో వివరాలను బయటపెట్టారు. గత ఏడాది ఆగస్టులో చిలకలమర్రి వాగు నీరు పుష్కలంగా ఉంటే రూ.4 లక్షలతో ఉపాధి పనులు చేసినట్లు రికార్డులో నమోదు చేసిన విషయాన్ని ప్రశ్నించారు. వాగులో నీరు ఉంటే పనులు ఎలా చేస్తారో చెప్పాలని నిలదీశారు. ఇన్ని అవకతవకలపై వివరాలు వెల్లడించాల్సి ఉండగా ఎన్నికల కోడ్‌ పేరుతో అధికారులు గత నెల 26న ఆ కార్యక్రమాన్ని జిల్లా కార్యాలయంలో నిర్వహించడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఎంత అవినీతి జరిగింది.. రికవరీ ఎంత.. ఎవరిపై ఎలాంటి చర్యలు తీసుకున్నారు.. అన్న విషయాలు బయటకు రాకుండా అధికారులు జాగ్రత్తలు తీసుకోవడంలో మతలబు ఏమిటని ప్రజలు చర్చించుకుంటున్నారు. ఈ విషయంపై ఏపీవో దయాసాగర్‌ను వివరణ కోరగా ఆ వివరాలు తమ దగ్గర లేవని చెప్పడం గమనార్హం.

Updated Date - 2022-06-12T05:05:36+05:30 IST