ఇదేం ఉపాధి

ABN , First Publish Date - 2022-05-16T06:48:47+05:30 IST

మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం.. (ఎమ్‌జీఎన్‌ఆర్‌ఈజీఎస్‌) ద్వారా దేశవ్యాప్తంగా కోట్లాదిమంది నిరుపేదలు 16 ఏళ్లుగా జీవనోపాధి పొందుతున్నారు. కూలీల వలసలను నిర్మూలించి సొంత గ్రామాల్లోనే 100 రోజుల పనిదినాలతో వారికి జీవనోపాధి, సామాజిక భద్రత కల్పించడానికి రూపొందించిన ఈ పథకం మన రాష్ట్రంలో 2007లో ప్రారంభమైంది. ఈ పథకం అన్‌స్కిల్డ్‌ కూలీల పాలిటవరంగా మారింది. కానీ ఇటీవల కేంద్రం అమల్లోకి తీసుకువచ్చిన మార్పులతో ఉపాధి కూలీలకు ఇబ్బందికర పరిస్థితులు తలెత్తాయి.

ఇదేం ఉపాధి
కరప మండలంలో ఇటీవల మధ్యాహ్నం పూడికతీత పనిచేస్తున్న కూలీలు

రెండు పూటలా పనిచేస్తేనే వేతనం

మండే ఎండలకు మాడిపోతున్న కూలీలు

కొత్త సర్వర్‌ ఎన్‌ఐసీతో తిప్పలు

కేంద్ర నిర్ణయంపై సర్వత్రా విమర్శలు

కరప, మే 15: మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం.. (ఎమ్‌జీఎన్‌ఆర్‌ఈజీఎస్‌) ద్వారా దేశవ్యాప్తంగా కోట్లాదిమంది నిరుపేదలు 16 ఏళ్లుగా జీవనోపాధి పొందుతున్నారు. కూలీల వలసలను నిర్మూలించి సొంత గ్రామాల్లోనే 100 రోజుల పనిదినాలతో వారికి జీవనోపాధి, సామాజిక భద్రత కల్పించడానికి రూపొందించిన ఈ పథకం మన రాష్ట్రంలో 2007లో ప్రారంభమైంది. ఈ పథకం అన్‌స్కిల్డ్‌ కూలీల పాలిటవరంగా మారింది. కానీ ఇటీవల కేంద్రం అమల్లోకి తీసుకువచ్చిన మార్పులతో ఉపాధి కూలీలకు ఇబ్బందికర పరిస్థితులు తలెత్తాయి.

ఉపాధి నిధుల వినియోగంలో అవకతవకలను నిరోధించడానికి  కేంద్రం కొత్తగా ఎన్‌ఐసీ సర్వర్‌ను రూపకల్పన చేసింది. కొత్త నిబంధనలకు లోబడి రెండుపూటలా ఉపాధి పని చేయాల్సి రావడం, అలా చేస్తేనే వేతనమని మెలిక పెట్టడంతో కూలీలకు శరాఘాతంగా మారింది. మండే ఎండలకు తాళలేక.. రెండు పూటల పనిచేయలేక వారు పడరాని పాట్లు పడుతున్నారు. గతంలో ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు పనిచేసి ఎండదెబ్బ తగలకుండా ఇంటికి వెళ్లిపోయేవారమని, ఇప్పుడు ఉదయం 7నుంచి 12గంటల వరకు, మళ్లీ మధ్యాహ్నం 2నుంచి 5గంటల వరకు పనిచేయాల్సిన దుస్థితి నెలకొందని పలువురు వాపోతున్నారు. పని ప్రదేశంలో రెండుపూటలా రెండు ఫొటోలను తీసి అప్‌లోడ్‌ చేస్తేనే కూలీలకు వేతనం పడుతుందని ఫీల్డ్‌అసిస్టెంట్లు చెబుతున్నారు. ఒకపూట వచ్చి రెండో పూట పనికి రాకపోతే సదరు కూలీ ఖాతాలో ఒక్క పైసా కూడా వేతనం పడదని అంటున్నారు. నిర్ధేశిత కొలతల ప్రకారం రెండుపూటల పనిచేసిన కూలీకి గరిష్ఠంగా రూ.257 వేతనం అందుతుందని తెలిపారు. దీనంతంటికీ మేట్‌లను బాధ్యులను చేస్తూ వారు పనిచేయనవసరం లేకుండా రెండు పూటల కూలీల మస్తర్లు నమోదు చేసి ఫొటోలు తీసి యాప్‌లో అప్‌లోడ్‌ చేస్తే సరిపోతోంది.

చెట్ల కింద భోజనాలు

గత ఏప్రిల్‌ నెల నుంచి రెండు పూటల పని విధానం అమలు చేస్తుండడంతో కూలీలు పనికొచ్చేటప్పుడే కూడా భోజనాన్ని తెచ్చుకుంటున్నారు. ఇంటికి వెళ్లి మళ్లీ తిరిగి రాలేక వెంట తెచ్చుకున్న భోజనాన్ని చెట్ల కింద, గట్ల మీద తిని అక్కడే కొద్దిసేపు విరామం తీసుకుంటున్నారు. ఊరికి దూరంగా, శివారు గ్రామాల్లో పనికి పోవాలంటే ఆటోలే శరణ్యమవుతున్నాయని, రానుపోను ఒక్కో కూలీకి రూ.30 ఖర్చువుతుందని గొర్రిపూడి గ్రామానికి చెందిన మేడిశెట్టి సత్యవేణి, ఊబా సుధ చెబుతున్నారు. గతంలో రవాణా చార్జీల కింద మనిషికి రూ.15 వరకు ఇచ్చేవారు. ఇప్పుడు ఆ చార్జీల ఊసే లేదని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇంటికి పలుమార్లు తిరగలేక, ఎండలకు తాళలేక వెంట ముంతలు తెచ్చుకుంటున్నామని పలువురు కూలీలు చెబుతున్నారు. వయసు మళ్లిన కూలీలు రెండు పూటల పనిచేయలేక తీవ్ర అవస్థలు పడుతున్నారు. ఎండ వేడిమి భరించలేక సొమ్మసిల్లి పడిపోతున్న ఘటనలు ఉత్పన్నమవుతున్నాయి.

అలవెన్స్‌లు లేవు.. మెడికల్‌ కిట్లు ఇవ్వరు..

గత ప్రభుత్వ హయాంలో కూలీలకు వేసవికాలంలో వేత నం పెంచడమేగాక మజ్జిగ, తాగునీటికి అలవెన్స్‌ల రూపం లో అదనంగా రోజుకు రూ.5 వరకు చెల్లించేవారు. ప్రస్తుతం ఎక్కడా మజ్జిగ, మంచినీరు అలవెన్స్‌లు ఇవ్వడంలేదు. పనిచేసే చోటు ఐదు కిలోమీటర్లు దాటితే ఇచ్చే రవాణా చార్జీల కు కూడా ఎగనామం పెట్టారని పలువురు కూలీలు ఆరోపిస్తున్నారు. పనిచేసే చోట కూలీలకు గాయమైనా, ప్రమాదం బారిన పడినా ప్రథమ చికిత్స నిమిత్తం గ్రూపునకు ఒక మెడికల్‌ కిట్‌ చొప్పున ఇచ్చేవారు. ఇప్పుడు కొన్నిచోట్ల గ్రామ పంచాయతీకి ఒక కిట్టు చొప్పున ఇస్తున్నారని, కొన్ని మండలాల్లో ఫస్ట్‌ ఎయిడ్‌ కిట్ల ప్రసక్తే లేదని తెలుస్తోంది. గుణ పం, పార తదితర పనిముట్లకు ఆరు పెట్టించుకోవడానికి గతంలో రూ.10 చొప్పున ఇచ్చేవారని, ఇప్పుడు అటువంటి చెల్లింపులు లేవని పలువురు కూలీలు చెబుతున్నారు. పనిచేసే చోట ఎండ తగలకుండా రక్షించేందుకు ఇటీవల కూలీలకు బ్లాక్‌ కలర్‌ టెంట్‌లు ఇచ్చారు. ఎండ వేడిమిని తీవ్రం గా గ్రహించుకునే నల్ల రంగు కలిగిన టెంట్‌లను పంపిణీ చేయడంపై కూలీలతోపాటు ఉపాధి సిబ్బంది తప్పుబడుతున్నారు. మొత్తంగా ఎన్‌ఐసీ సర్వర్‌తో కూలీలు పడుతున్న తి ప్పలు, కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని పలు కార్మికులు, ప్రజాసంఘాల నాయకులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. రెండు పూటల ఉపాధి పనులు చేయించడంతో స్థానికంగా తమపై వ్యతిరేకత వస్తుందని, ఈ విధానాన్ని మార్చకపోతే రాజకీయంగా తమకు ఇబ్బందులు తప్పవని కరప మండల గ్రా మాల అధికార పార్టీ నాయకులు, సర్పంచ్‌లు, ఎంపీటీసీలు అధికారుల వద్ద మొరపెట్టుకుంటున్నారు. తమ చేతుల్లో ఏమీ లేదని, కూలీలకు సర్ధిచెప్పి స్థానికంగా పరిస్థితిని చక్కదిద్దుకోవాలంటూ ఇటీవల జరిగిన ఒక సమావేశంలో అధికారులు నాయకులకు సూచించడం గమనార్హం.

Updated Date - 2022-05-16T06:48:47+05:30 IST