ఇప్పుడు తెలుగు కవితేమంటోంది?

ABN , First Publish Date - 2020-04-06T09:30:57+05:30 IST

కవిత్వం విశ్వమానవ ప్రేమను కాంక్షించే ఒక సృజనాత్మక పరికరం మాత్రమే కాదు. కవిత్వం కేవలం అంతర్జాతీయ కవితా దినోత్సవాలు జరుపుకోవడం మాత్రమే కాదు. అది ‘కరోనా’వంటి అంతర్జాతీయ ఉత్పాతాలను...

ఇప్పుడు తెలుగు కవితేమంటోంది?

కవిత్వం విశ్వమానవ ప్రేమను కాంక్షించే ఒక సృజనాత్మక పరికరం మాత్రమే కాదు. కవిత్వం కేవలం అంతర్జాతీయ కవితా దినోత్సవాలు జరుపుకోవడం మాత్రమే కాదు. అది ‘కరోనా’వంటి అంతర్జాతీయ ఉత్పాతాలను హృద్యంగా తడుముతుందని చెప్పటానికి తెలుగు కవుల ఈ స్పందన సమీప సాక్షి. కవిత్వం విశ్వమానవ ప్రేమను కాంక్షించే ఒక సృజ నాత్మక పరికరం మాత్రమే కాదు. కవిత్వం కేవలం అంతర్జాతీయ కవితా దినోత్సవాలు జరుపుకోవడం మాత్రమే కాదు. అది ‘కరోనా’వంటి అంతర్జాతీయ ఉత్పాతా లను హృద్యంగా తడుముతుందని చెప్పటానికి తెలుగు కవుల ఈ స్పందన సమీప సాక్షి. తెలుగు కవులు కరోనాపై స్పందించిన తీరును, కరోనాను అర్థంచేసుకున్న విధానాన్ని, కరోనాను తమదైన బౌద్ధిక క్షేత్రాల్లోంచి, సృజనాత్మక తలా ల్లోంచి సంవిధానించుకున్న విషయాన్ని సమీక్షించడం ఈ వ్యాసం ప్రధాన ఉద్దేశం. ఈ సమీక్షకోసం దాదాపు 100 కవితలను పరామర్శించాను. ఎన్‌.గోపి, యార్లగడ్డ రాఘవేం ద్రరావువంటి ప్రసిద్ధకవుల వ్యక్తీకరణలు మొదలుకొని మెర్సీ మార్గరేట్‌, తగుళ్ళ గోపాల్‌వంటి నవతరం కవుల వ్యక్తీక రణలు ప్రజలను కరోనాపట్ల జాగరూకం చేస్తున్నాయి. సుతి మెత్తని హెచ్చరికలు చేస్తున్నాయి. కరోనా ‘శిశిరం’లో కవితా వ్యక్తీకరణకు వారు ఎంచుకున్న భాష, నిర్మించుకొన్న నూతన పదజాలం, భిన్నమైన అర్థ, భావచ్ఛాయలు తెలుగువారి సృజనాత్మకతకు తార్కాణాలు.


తెలుగు కవులు కరోనాపై రాసిన కవిత్వాన్ని మూల్యాం కనం చేస్తే ప్రధానంగా కొన్ని అంశాల కేంద్రంగా సాగినట్టు తోస్తుంది. కరోనా కులమతాలకతీతంగా సమభావనతో మెలి గిందని, కరోనా దేవుడి ప్రమేయంలేని లోకాన్నిచ్చిందని, కరోనా ఒక బయోవార్‌ అనీ, ఒక పవిత్ర యుద్ధమనీ, కరోనా దేవుళ్లను లాకప్‌లో పెట్టి మేము చేయలేని పని చేసిందని, దేవుని పేరుచెప్పి ప్రజలను మూఢ విశ్వాసాల్లోకి తీసుకెళ్తున్నారనీ, ఎప్పటికైనా సైన్సే మనకు దిక్కు అనీ... మొదలైన గంభీరమైన సైద్ధాంతిక విషయాలను ప్రస్తావిం చడంతో పాటు, కరోనా ప్రేయసీ ప్రేమికుల విరహానికి కారణమైందనీ, కరోనా వల్ల ఉగాది కళ తప్పిపోయిందనీ, ఈ ఉగాది కరోనాను తరిమేసే ఆయుధం కావాలనీ, కరోనా పట్ల ప్రజలకు అవగాహన కలిగించాలనీ, కరోనా మావైపు రావద్దని వినతులు సమర్పించటం వంటి సాధారణ విష యాలను కూడా ఎంతో సృజనాత్మకంగా వ్యక్తీకరించారు. వచన కవిత్వంతోపాటు రుబాయిలు, రెక్కలు మొదలైన కవితా రూపాల్లోనూ కరోనా కవిత్వాన్ని వెలువరించారు.


నిచ్చెనమెట్ల భారతీయ కులసమాజంలో ‘కరోనా’ అన్ని కులాలవారినీ ఒకేలా ట్రీట్‌ చేయడం గురించి కొంతమంది కవులు సానుకూలంగా స్పందించారు. కరోనాను వారు సమ ర్థించరు కానీ, ఈ అగ్రకుల ఆధిపత్య సమాజం చేత చవి చూసిన అవమానాలు, అసమానత్వాలు, హత్యలు, అత్యాచా రాలు, సాంస్కృతిక వివక్ష చేసిన గాయాలకంటే, తీసిన ప్రాణాలకంటే కరోనా చేసే నష్టం ఇసుమంత కూడా కాదు అనే తీవ్రమైన వ్యతిరేకత వారి కవిత్వంలో వినిపించే ప్రధాన ధ్వని. ధ్వని కదా కవిత్వానికి ఆయువుపట్టు. మతం, దేవుడు పేరు చెప్పి దళితుల గాలి సోకితే మైలపడిపోతామంటూ, వారిని అంటరానివారిగా ముద్రవేసి వేళ ఏళ్ళుగా ప్రధాన స్రవంతికి దూరం చేసిన ఆధిపత్య మత సాంస్కృతిక కేంద్రాలైన దేవాలయాలను ‘క్వారంటైన్‌’గా ప్రకటించడం, ‘లాక్‌డౌన్‌’ చేయడాన్ని ఆహ్వానించిన కవులూ ఉన్నారు. కరోనా ఇతర దేశాలనుంచి వచ్చిన వ్యాధి కనుక ఇక్కడి దళితుల కోసం వందల ఏళ్ళుగా బహిరంగ చెరసాలలవంటి క్వారం టైన్‌ అమలవుతోన్న విషయాన్ని వీరు కరోనాకు తెలియచే స్తారు. ఇటువంటి క్వారంటైన్‌లు నిమ్నవర్గాలకు ముఖ్యంగా దళితులకు అలవాటైనవేనంటారు. ‘‘క్వారంటైన్‌’/ ఇప్పుడు కొత్తగా డిక్షనరీలోంచి/ బూజు దులుపుకుని/ బైటికొచ్చినట్టు ఫోజు గానీ,/ మూడు వేల ఏళ్లనాడే/ ఈ దేశానికి అలవాటైన పద్ధతి /తన గాలి ఇతరులకి/ ఇతరుల గాలి తనకి/ సోక కూడని దడి, మడి/ కరోనా,/ నీకు తెలవదనుకుంటా.../ మనుషులు పరస్పరం/ కలుసుకోవడం, కలబోసుకోవడం/ ఇక్కడెప్పుడూ నిషిద్ధమే! (స్వరూపరాణి, చల్లపల్లి) అంటూ వ్యక్తమైంది. కరోనా మనుషులను విడదీసి వారిమధ్య సామాజిక దూరాన్ని (social distance) పెంచడంలో మనువు కంటే రెండాకులు ఎక్కువే చదివిందంటూ ఈ దేశ వెనుకబాటుకు కారణమని భావిస్తున్న ‘మనుస్మృతి’ని ఎద్దేవా చేసారు మరికొందరు కవులు. ‘‘మనువు కంటే /రెండాకులు /ఎక్కువే /చదివావ్‌.../ మనుషుల్ని/ విడదీయడంలో...’’ (సత్యనారాయణ, మస్కా) ఎన్నో ఏళ్ళుగా భారతీయ వర్ణ, కుల వ్యవస్థపై దళితుల్లో, ప్రజాస్వామిక వాదుల్లో గూడుకట్టుకుపోయిన ధర్మాగ్రహం కరోనా సందర్భంలో ‘‘కళ్ళు బైర్లు కమ్మిన దేవుళ్ళు/ దుమ్ము దారాలకు దీనంగా వేళాడుతున్నారు/ తాళాలు పడ్డ గుళ్ళల్లో చెమటలు కక్కుతున్నారు’’ (లక్ష్మీనరసయ్య, గుంటూరు). భారతదేశంలో గుళ్ళకు తాళాలు వేయించి కులాలమధ్య అంతరాలు లేకుండా చేసావు అంటూ ‘‘ఎక్కడోయ్‌ నా ప్రాణ శత్రువా కానరావు కళ్ళకు/ నీ రాగానికి తాళాలు వేయించావు గుళ్ళకు/ ఇంతలో ఎంత సమానతను సాధించావోయ్‌ నువ్వు/ తేడాయే లేకుండా పోయింది జైళ్ళకు--ఇళ్ళకు (ఫైజ్‌ రుబాయత్‌) అంటూ గజల్లను కూడా రాసారు. కరోనావల్ల ఏర్పడబోయే ఉత్పాతంకంటే ‘దళితులు’ అనే ముద్రతో ‘ఐసోలేట్‌’ చేసిన ఈ దేశ మనువాదంమీదే వారికి కసి, ఆగ్రహం ఎక్కువ. వారు నడిచే గాయాలు కదా. 


కరోనాపై వెలువడిన కవిత్వంలో మరొక ముఖ్యమైన అంశం- పేదరికం తాండవించే ఈ భారతదేశంలో, ఉండ టానికి నివాసాలే లేని, ఉన్నా గుడారాల వంటి చిన్న చిన్న గూళ్ళల్లో మనిషిని మనిషి తాకకుండా ఎలా ఉండమంటా రంటూ పాలకులను బహుసున్నితంగా విమర్శించడం కని పిస్తుంది. (కఠిన విమర్శకు తావులేని దేశమని కవులు ఇప్పుడిప్పుడే తెలుసుకుంటున్నారు.) ప్రభుత్వాలు తీసుకునే ఏ చర్యల్లోనైనా ఈ ఆచరణాత్మక లేమి ఎప్పుడూ తేట తెల్లమౌతూనే ఉంటుంది. ఈ దేశ పాలకులు పులిని చూసి నక్కవాత పెట్టుకునే పథకాలనే తీసుకొస్తారు. ప్రభుత్వాల నుంచి తీసుకునే ముందస్తు చర్యలు, శాస్త్రీయ అవగాహ నను కలిగించే విద్యావ్యవస్థ పటిష్టత గురించి ఆలోచించ కుండా ప్రజలను మూఢులుగా తయారుచేసి, తీరా చేతులు కాలాక ఆకులు ముట్టుకునే తీరుపై కవులు స్పందించారు: ‘‘చేయిచేయి తగలకుంటా/ దూరం జరిగి ఉండమంటు న్నరు గదా/ అగ్గిపెట్టంత గుడిసెలో/ తల్లినల్గురం ఎట్లుం దుము దేవా’’ (గోపాల్‌, తగుళ్ళ). ‘‘రోజు కూలిపై బతికే మాకు ఇప్పుడిప్పుడే/ కడుపులు ‘లాక్‌డౌన్‌’ అవుతున్నాయి.’’ (వెంకటేశ్వర్లు, ఉన్నం) 


రెక్కాడితే కానీ డొక్కాడనీ భారతదేశంవంటి దేశాల్లో ‘లాక్‌డౌన్‌’లు బహిరంగంగా, లాఠీలకు పనిచెప్పి పాశవికంగా అమలుచేస్తున్నారు. ఈ దేశ ప్రజలు తమ ‘కడుపుల’కు ‘లాక్‌డౌన్‌’ ప్రకటించుకోవడం తప్ప మరోమార్గం లేదనే దయనీయమైన వాస్తవానికి కన్నీరు కారుస్తున్నారు తెలుగు కవులు. ఇది కదా విశ్వమానవ ప్రేమ ప్రకటనం అంటే.


ప్రపంచీకరణ సంతలో ఎప్పుడో ఇరవై ఏళ్ళక్రితం పోగొ ట్టుకోవడం, జారవిడుచుకోవడం ప్రారంభమైన ‘మనిషి తనం’పై పదునైన విమర్శ కూడా కరోనా సందర్భంలో చర్చకొస్తోంది. బహుళ జనాభా గల భారతదేశంలో కరోనా వచ్చినపుడో, మరో ఉపద్రవం వచ్చినప్పుడో స్పందించడం కాకుండా ఒక దీర్ఘకాలిక ప్రణాళికలు, మానవత్వాన్ని ప్రోది చేసే కార్యక్రమాలు తరంతరం అంతరంలేకుండా నిరంత రంగా జరగాల్సిన అవసరం చాలా ఎక్కువ ఉంది. ఇరుకైన మనస్సులను ఎక్కడికక్కడే ఏర్పాటుచేసుకుంటున్న మనుషులు విశాల మానవాళిని కాపాడటానికి నాలుగ్గోడల్లో స్వీయ నిర్భంధం చేసుకోవడానికి చచ్చేంత భయపడుతున్నారని ‘‘సువిశాల ప్రపంచంల తిరిగే/ ఇరుకైన మనుసులు కదా/ నాలుగ్గోడలకు పరిమితమై/ విశాలంగా ఆలోచించమంటే/ సచ్చేంత భయంగుంది’’ (దయాకర్‌, వడ్లకొండ) ఎవరూ పట్టుకోని భారతీయ మనస్తత్వాన్ని పట్టుకుంటున్నారు కవులు. ‘‘ఇంటి ముందున్న ఒక వేపచెట్టు ఉంటే/ బాగుండునేమో! గాల్లో తిరుగుతున్న/ బూచి... బొక్కలు మాయం చేస్తుండే’’ (కనపర్తి శ్రీను)వంటి కవులు పాతరోజులను తలపోసుకో వడం కనిపిస్తుంది.


ఈ ‘కరోనా’ కవిత్వంలో ఆంగ్ల పదాలను యథాతథంగా వాడటంతోపాటు వాటిని సృజనాత్మకంగా అన్వయించడం కనిపిస్తుంది. సోషల్‌ డిస్టెన్స్‌, ఐసోలేషన్‌, క్వారంటైన్‌, షట్‌ డౌన్‌, లాక్‌డౌన్‌, శానిటైజర్‌ ట్రీట్‌, ఐసోలేషన్‌, సెల్ఫ్‌ ఐసోలే షన్‌, వర్క్‌ ఫ్రం హోమ్‌ వంటి పదాలకు కొత్త అన్వయాలతో పాటు కరోనా శిశిరాలు, ప్రపంచీకరోనా, సామాజిక టీకా మొదలైన ఎన్నో విన్నూత్న పద ప్రయోగాలను చేసారు. క్వారంటైన్‌ను ఏకాంత విషాద ద్వీపవాసం అనీ, శరణార్థి అనే అర్థంలోనూ, అంపశయ్య అనే సరికొత్త విశేష అర్థాలను సృష్టించుకున్నారు.


 ‘‘ఉద్యోగపు చెరలో/ క్షణకాలం పిల్లలతో కలిసుండని నన్ను/ వాళ్లతో ఆడుకునేలా చేసింది/ ఎప్పుడూ చూపుల తోనే పలకరించే అమ్మతో/ గుండె నిండుగా మాట్లాడేలా చేసింది’’ (కరీం, జి.ఎస్‌.కె.) అంటూ కరోనాకు ధన్యవాదాలు చెప్పుకుంటున్న కవులూ ఉన్నారు. ‘‘ఏదైతేనేం/ కొంత కాలం/ మనల్ని మనం మౌనంలోకి నెట్టేసుకుని/ వేరుప డదాం/ అక్కడ పాలపుంతల సంఘర్షణమధ్య/ భూమి స్వస్థత కోసం కలకందాం’’ (మెర్సీ మార్గరేట్‌), ‘‘మైదానాల కలయికల్ని కత్తిరించి/ ఇంట్లోనే ఏకాంతాలుగా వెదజ ల్లుదాం... లాంగ్‌లివ్‌ల కోసమైనా లాక్‌డౌన్లను ప్రేమిద్దాం’’ (చిత్తలూరి నిరంతర) అంటూ ప్రభుత్వ ఆదేశాలను ఎంతో అభివ్యక్తి నైపుణ్యంతో ప్రజల్లోకి బలీయంగా తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. కరోనాపై బహుముఖీనంగా ప్రజలను చైతన్యం చేయడంలో తెలుగు కవుల కృషి ప్రశంసనీయమైంది.

ఎస్‌. చంద్రయ్య

99637 09032


Updated Date - 2020-04-06T09:30:57+05:30 IST