Abn logo
Aug 8 2021 @ 09:13AM

త్వరలో హైడ్రోజన్‌తో నడవనున్న రైళ్లు!

న్యూఢిల్లీ: ఇకపై దేశంలోని రైళ్లు సీఎన్జీతోనే కాకుండా హైడ్రోజన్ ఇంధనంతో కూడా నడవనున్నాయి. గ్రీన్ ట్రాన్స్‌పోర్ట్ సిస్టమ్‌లో ఈ ప్రయోగం విజయవంతమయ్యింది. ఇప్పటివరకూ జర్మనీ, పోలాండ్‌లలో హైడ్రోజన్ ఇంధనంతో రైళ్లు నడుస్తున్నాయి. త్వరలో భారత్‌లోనూ ఈ ఇంధనంతో రైళ్లు పరుగులు తీయనున్నాయి. ఇందుకోసం రైల్వే విభాగం డీజిల్ ఇంజిన్లను రెక్ట్రోఫిట్టింగ్ చేసి, హైడ్రోజన్ ఫ్యూయల్ ఆధారిత టెక్నిక్‌ను అభివృద్ధి చేయనుంది. ఇందుకోసం ముందుగా రెండు డెమూ ర్యాక్‌లను హైడ్రో ఇంజిన్లుగా మార్చనున్నారు. 

తరువాత 2 హైబ్రీడ్ నారో గేజ్ ఇంజిన్లను హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్ పవర్ మూమెంట్ ఆధారిత సిస్టమ్‌గా మార్చాలని రైల్వే అధికారులు యోచిస్తున్నారు. భారత్‌లో పైలట్ ప్రాజెక్టు తరహాలో ఇటువంటి బ్యాటరీని 10 బోగీలు కలిగిన డెమూ ట్రైన్‌లో ఏర్పాటు చేయనున్నారు. ఈ విధమైన బ్యాటరీ 1,600 హార్స్ పవర్ సామర్థ్యం కలిగివుండి, రైలును ముందుకు నడుపుతుంది. రైల్వే కాలుష్యం నుంచి విముక్తి కల్పించే దిశగా ఆ శాఖ అడుగులు వేస్తోంది. దీనిలో భాగంగా ట్రాక్‌లన్నింటినీ విద్యుదీకరణ చేయడంతోపాటు, హైడ్రోజన్ ఫ్యూయల్ విస్తృత వినియోగానికి రైల్వేశాఖ కసరత్తు చేస్తోంది.