ఇక ఎన్‌పీఎస్ ఖాతా తెరవడం మరింత సులభం

ABN , First Publish Date - 2020-06-30T01:04:02+05:30 IST

జాతీయ పింఛన్‌ వ్యవస్థ (ఎన్పీఎస్‌) ఖాతాలను తెరిచేందుకు మరింత సులభతర విధానాన్ని తీసుకొచ్చినట్టు..

ఇక ఎన్‌పీఎస్ ఖాతా తెరవడం మరింత సులభం

న్యూఢిల్లీ: జాతీయ పింఛన్‌ వ్యవస్థ (ఎన్పీఎస్‌) ఖాతాలను తెరిచేందుకు మరింత సులభతర విధానాన్ని తీసుకొచ్చినట్టు పింఛను నిధి నియంత్రణ అభివృధ్ధి ప్రాధికార సంస్థ (పీఎఫ్‌ఆర్‌డీఏ) వెల్లడించింది. ఇకపై వన్‌ టైం పాస్‌వర్డ్ (ఓటీపీ) ఆధారిత అథెంటికేషన్ ద్వారా ఎన్పీఎస్ ఖాతాలను తెరవొచ్చని పేర్కొంది. ‘‘ఈ ప్రక్రియ ద్వారా ఎలాంటి అడ్డంకులు లేకుండా ఖాతాలను తెరవొచ్చు. పూర్తిస్థాయి డిజిటైజేషన్‌తో పాటు, వేగంగా విరాళాలను జమచేయడం ద్వారా పెట్టుబడులకు గరిష్ట లాభాలను అందుకోవచ్చు...’’ అని పీఎఫ్‌ఆర్‌డీఏ పేర్కొంది. ఈ ప్రక్రియలో భాగంగా బ్యాంకు వినియోగదారులు ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా తమ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌‌కు వచ్చే ఓటీపీతో ఎన్పీఎస్ ఖాతాలను తెరవొచ్చు. ఇక బ్యాంకు పీవోపీల సదుపాయం ద్వారా నాన్‌ ఇంటర్నెట్ బ్యాంకింగ్ డిజిటల్ మోడ్‌‌తో ఓటీపీ, ఈమెయిల్‌ను ఉపయోగించి పేపర్‌లెస్ విధానంలో ఖాతాలు తెరవొచ్చు. కేవైసీ ప్రక్రియ పూర్తయిన తర్వాత పీవోపీలు ఎన్‌పీఎస్ చందాదారుల వివరాలు, ఫోటో, సంతకాలను సెంట్రల్ రికార్డ్ కీపింగ్ ఏజెన్సీలకు (సీఆర్ఏలు) సమర్పించాల్సి ఉంటుంది. ఇవన్నీ కేవైసీ/ఏఎంఎల్ మార్గదర్శకాలు/నిబంధనలకు అనుగుణంగా ఉండాలి. 

Updated Date - 2020-06-30T01:04:02+05:30 IST