HYD : రోజంతా ఓపీ సేవలు.. ప్రభుత్వ ఆస్పత్రుల్లో కీలక మార్పులు

ABN , First Publish Date - 2022-05-10T14:48:28+05:30 IST

రోజంతా ఓపీ సేవలు.. ప్రభుత్వ ఆస్పత్రుల్లో కీలక మార్పులు

HYD : రోజంతా ఓపీ సేవలు.. ప్రభుత్వ ఆస్పత్రుల్లో కీలక మార్పులు

  • ఉదయం 9 నుంచి 4 వరకు అందుబాటులో వైద్యులు
  • ఈవినింగ్‌ క్లినిక్‌లు కూడా..

హైదరాబాద్‌ సిటీ : రోగి ఏ సమయంలో ఆస్పత్రికి వచ్చినా వైద్య సేవలు అందించే దిశగా ప్రభుత్వం దృష్టి సారిస్తోంది. రోజంతా ఓపీ సేవలు అందించేలా కసరత్తు చేస్తోంది. ప్రస్తుతం ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఉదయం 9 నుంచి 11 గంటల వరకు మాత్రమే ఓపీ (OP) పని చేస్తోంది. దూర ప్రాంతాల నుంచి వచ్చే వారు 11 దాటితే మర్నాడు ఉదయం వరకూ వేచి ఉండాల్సిందే. ఇకపై ఆ పరిస్థితి లేకుండా రోజంతా ఓపీ సేవలు అందించే దిశగా కసరత్తు జరుగుతోంది. ఆయా ఆస్పత్రుల వైద్యాధికారులతో నిర్వహించిన సమీక్షలో మంత్రి హరీశ్‌రావు (Minister Harish Rao) ఈ అంశాన్ని ప్రస్తావించారు. 


వేల సంఖ్యలో రోగులు

గాంధీ (Gandhi Hospital), ఉస్మానియా, కోఠిలోని ఈఎన్‌టీ, నిలోఫర్‌ ఆస్పత్రులకు వేల సంఖ్యలో రోగులు ఓపీ సేవలు పొందుతారు. అంత మందిని కేవలం మూడు గంటల్లో పరీక్షించి పంపాల్సి వస్తోంది. ఈ నేపథ్యంలో ఉదయం 9 నుంచి సాయంత్రం 4 వరకు ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఓపీ తెరిచి ఉంచే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఈ మేరకు ప్రణాళిక సిద్ధం చేయాలని మంత్రి హరీశ్‌రావు ఆయా ఆస్పత్రుల సూపరింటెండెంట్లను ఆదేశించారు.  అలాగే ఆపరేషన్‌ థియేటర్ల సమయాన్ని కూడా పెంచి శస్త్రచికిత్సల సంఖ్యను పెంచనున్నారు.


ప్రసూతి ఆస్పత్రుల్లో..

ప్రసూతి ఆస్పత్రుల్లో అదనంగా సాయంత్రం క్లినిక్‌లు ఏర్పాటు చేయాలని అధికారులు యోచిస్తున్నారు. సుల్తాన్‌బజార్‌లోని ప్రభుత్వ ప్రసూతి ఆస్పత్రిలో ఓపీకి వచ్చిన రోగులు ఇబ్బంది పడుతున్న విషయాన్ని గుర్తించిన మంత్రి హరీశ్‌రావు ఇక్కడ ఈవినింగ్‌ క్లినిక్‌ను ప్రారంభించాలని ఆదేశించారు.

Read more