ఇక సమరమే..!

ABN , First Publish Date - 2021-10-14T06:03:14+05:30 IST

బద్వేలు ఉప ఎన్నికలో కీలకమైన వితడ్రా ఘట్టం బుధవారం ముగిసింది. పోరులో తలపడేది ఎవరో తేలిపోయింది. 35 నామినేషన్లు దాఖలు చేయగా.. వీటిలో ఎనిమిది డబుల్‌ నామినేషన్లు వచ్చాయి. అంటే

ఇక సమరమే..!

ముగిసిన వితడ్రా పర్వం

పోటీ నుంచి తప్పుకున్న ముగ్గురు.. బరిలో మిగిలింది 15 మంది

ప్రచార జోరు పెంచిన అభ్యర్థులు

టీడీపీ ఓట్లపై కన్నేసిన ప్రధాన రాజకీయ పార్టీలు

30న ఓటర్ల తీర్పు

(కడప-ఆంధ్రజ్యోతి): బద్వేలు ఉప ఎన్నికలో కీలకమైన వితడ్రా ఘట్టం బుధవారం ముగిసింది. పోరులో తలపడేది ఎవరో తేలిపోయింది. 35 నామినేషన్లు దాఖలు చేయగా..  వీటిలో ఎనిమిది డబుల్‌ నామినేషన్లు వచ్చాయి. అంటే 27 మంది మాత్రమే బరిలో దిగారు. వివిధ కారణాల వల్ల 9 మంది నామినేషన్లను ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి తిరస్కరించారు. 18 మంది అభ్యర్థుల నామినేషన్లు అర్హత సాధించాయి. వారిలో స్వతంత్ర అభ్యర్థులుగా నామినేషన్లు వేసిన చందులూరి బ్రహ్మయ్య, జి.విజయకాంత, పసుపుల బాలక్రిష్ణ పోటీ నుంచి తప్పుకున్నారు. ప్రధాన రాజకీయ పార్టీలు వైసీపీ, కాంగ్రెస్‌, బీజేపీలతో పాటు వివిధ గుర్తింపు పార్టీలు, స్వతంత్రులు 15 మంది సమరానికి సై అన్నారు. బరిలో మిగిలిన అభ్యర్థుల జాబితాను రిటర్నింగ్‌ అధికారి, రాజంపేట సబ్‌ కలెక్టరు కేతనగార్గ్‌ అధికారికంగా బుధవారం ప్రకటించారు. కేంద్ర ఎన్నికల సంఘం గుర్తింపు, రిజిస్ట్రేషన పార్టీలకు సీఈసీ కేటాయించిన ఎన్నికల గుర్తులే కేటాయిస్తారు. స్వతంత్రులకు సీఈసీ నిబంధనల ప్రకారం గుర్తులను కేటాయిస్తారు. 


పోలింగ్‌ వ్యూహాలకు పదును

బరిలో 15 మంది ఉన్నా.. ప్రధానంగా వైసీపీ, కాంగ్రెస్‌, బీజేపీ మధ్య త్రిముఖ పోటీ ఉంటుందని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు. ప్రధాన ప్రతిపక్షం టీడీపీ పోటీ నుంచి తప్పుకోవడంతో అధికార పార్టీ నాయకత్వం ఊపిరి పీల్చుకున్నా.. పెరిగిన ధరలు, అభివృద్ధి జాడే లేకపోవడం, రాష్ట్రంలో రాజకీయ పరిస్థితుల కారణంగా అధిరాక పార్టీపై వ్యతిరేక సెగ గ్రామాల్లో కనిపిస్తోంది. దీంతో ఎక్కడ ఇబ్బంది పడుతామో.. అన్న భయంతో అధికార పార్టీ మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఆదిమూలపు సురేష్‌, డిప్యూటీ సీఎం అంజాద్‌బాషా, ప్రభుత్వ చీఫ్‌విప్‌ శ్రీకాంతరెడ్డి, కడప ఎంపీ వైఎస్‌ అవినా్‌షరెడ్డి తదితరులు బద్వేలు కేంద్రంగా తిష్టవేసి పోలింగ్‌ వ్యూహాలకు పదును పెడుతున్నారు. కాంగ్రెస్‌, బీజేపీ జాతీయ, రాష్ట్ర నాయకులు దసరా తరువాత ప్రచారంలో వేగం పెంచేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.


టీడీపీ ఓటర్లకు గాలం

దివంగత ఎమ్మెల్యే డాక్టరు జి.వెంకటసుబ్బయ్య సతీమణి డాక్టరు దాసరి సుధాకు వైసీపీ టికెట్‌ ఇవ్వడంతో రాజకీయ సంప్రదాయానికి కట్టుబడి టీడీపీ పోటీ నుంచి తప్పుకున్న సంగతి తెలిసిందే. నియోజకవర్గంలో టీడీపీకి బలమైన పట్టు ఉంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో కీలకమైన స్థానాల్లో టీడీపీ, ఆ పార్టీ మద్దతుదారులు గెలిచారు. దీంతో ఆ పార్టీ ఓటర్లను ఆకట్టుకునే దిశగా ఎత్తులు వేస్తున్నారు. ముఖ్యంగా మండల, గ్రామస్థాయి నాయకులు తమకు అనుకూలంగా పని చేసేందుకు అధికార వైసీపీతో పాటు బీజేపీ ముఖ్యనాయకులు ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే.. తాము ఏ పార్టీకీ మద్దతు ఇవ్వడం లేదని టీడీపీ కడప పార్లమెంట్‌ అధ్యక్షుడు మల్లెల లింగారెడ్డి ప్రకటించడం కొసమెరుపు.

Updated Date - 2021-10-14T06:03:14+05:30 IST