అబుధాబి: యూఏఈ ప్రభుత్వం వివిధ రంగాల్లో దేశ అభివృద్ధికి కృషి చేసిన విదేశీయులకు 2019 నుంచి ఐదు, పదేళ్ల కాలపరిమితితో గోల్డెన్ వీసాలు మంజూరు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో యూఏఈ ఫెడరల్ అథారిటీ ఫర్ ఐడెంటిటీ అండ్ సిటిజెన్షిప్(ఐసీఏ) తాజాగా కీలక ప్రకటన చేసింది. గోల్డెన్ వీసాకు అర్హులైన వారు ఐసీఏ యూఏఈ స్మార్ట్ యాప్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. అయితే, దరఖాస్తు సమయంలో అవసరమైన ధృవపత్రాలను అప్‌లోడ్ చేయడం తప్పనిసరి అని పేర్కొంది. అలాగే దరఖాస్తు రుసుముగా 50 దిర్హమ్స్(సుమారు రూ.1000) చెల్లించాల్సి ఉంటుందని తెలిపింది.
అవసరమైన పత్రాలను సమర్పించిన తర్వాత దరఖాస్తుదారుకు సంబంధిత అధికారుల నుండి ఒక టెక్స్ట్ మెసేజ్ వస్తుందని, అలాగే ఈ-మెయిల్ ద్వారా కూడా సమాచారం ఇస్తామని పేర్కొంది. వాటిలో పేర్కొన్న సమాచారం దరఖాస్తు స్టేటస్ తెలుసుకోవడానికి ఉపయోగపడుతుందని ఐసీఏ తెలియజేసింది. తగినంత సమాచారం ఇవ్వకపోయిన లేదా అవసరమైన అన్ని పత్రాలను సమర్పించడంలో వైఫల్యం కారణంగా దరఖాస్తు తిరస్కరించబడితే 30 రోజుల తర్వాత అప్లికేషన్ ఆటోమెటిక్‌గా క్యాన్సిల్ అవుతుందని ఐసీఏ అధికారులు హెచ్చరించారు.