హాకీలో నవశకం

ABN , First Publish Date - 2021-08-06T06:31:04+05:30 IST

స్వర్ణపోరులో నిలిచే అవకాశం చేజారినా, పతక పోరాటంలో భారత హాకీ కుర్రాళ్లు కదం తొక్కారు. ప్రత్యర్థిపై రణం చేసి, కడదాకా నిలిచి, అనుకున్నది సాధించారు...

హాకీలో నవశకం

స్వర్ణపోరులో నిలిచే అవకాశం చేజారినా, పతక పోరాటంలో భారత హాకీ కుర్రాళ్లు కదం తొక్కారు. ప్రత్యర్థిపై రణం చేసి, కడదాకా నిలిచి, అనుకున్నది సాధించారు. విశ్వక్రీడల్లో మసకబారిపోతున్న హాకీ ప్రతిష్ఠను నిలబెడుతూ, పునర్‌వైభవానికి నాంది పలికారు. 


ధ్యాన్‌చంద్‌, బల్బీర్‌సింగ్‌, అశోక్‌ కుమార్‌, మహ్మద్‌ షాహిద్‌లాంటి దిగ్గజ ఆటగాళ్లతో ఒకనాడు భారత హాకీ స్వర్ణయుగాన్ని చవిచూసింది. 1928 నుంచి వరుసగా ఆరుసార్లు ఒలింపిక్స్‌లో హాకీ స్వర్ణం మనదే. తర్వాత మరో రెండుసార్లు విశ్వక్రీడల్లో బంగారు పతకాలను మన జట్టు గెలిచింది. 1980 మాస్కో ఒలింపిక్స్‌లో చివరి స్వర్ణం...ఆ తర్వాత అంతా శూన్యం. కనీసం కాంస్యానికి కూడా నోచుకోలేకపోయాం. తర్వాతి రోజుల్లో కొందరు ఆటగాళ్లు తమదైన ప్రతిభతో భారత హాకీలో కొన్ని తీపి జ్ఞాపకాలు మిగిల్చారు కానీ ఒలింపిక్‌ పతకాన్ని మాత్రం సాధించలేకపోయారు. ఇదిగో, మళ్లీ నాలుగు దశాబ్దాల తర్వాత టోక్యోలో పతకంతో విశ్వక్రీడల వేదికపై మన హాకీ స్టిక్‌ సగర్వంగా నిలబడింది. అందుకే, గెలిచింది కాంస్యమే అయినా బంగారమంత సంబరాలు చేసుకుంటున్నాం. ఈ విజయానికి ఇంతటి ప్రత్యేకత ఉన్నది కనుకనే, కాంస్య పతక పోరులో జర్మనీపై గెలిచిన వెంటనే భారత హాకీ జట్టు కెప్టెన్‌ మన్‌ప్రీత్‌ సింగ్‌కు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్వయంగా ఫోన్‌ చేసి అభినందనలు తెలిపారు. ఒలింపిక్స్‌ హాకీలో భారత్‌కు ఇది పన్నెండో పతకం. ఒలింపిక్స్‌ హాకీ చరిత్రలో ఇన్ని పతకాలు ఏ దేశమూ సాధించలేదు. భారత్‌ ఇప్పటిదాకా ఎనిమిది స్వర్ణాలు, ఓ రజతం, మూడు కాంస్యాలు గెలుచుకుంది.


ఐదేళ్ల క్రితం రియో ఒలింపిక్స్‌లో నిరాశపరిచిన భారత హాకీ బృందం టోక్యోలో సత్తా చాటేందుకు నాలుగేళ్లు తీవ్రంగా శ్రమించింది. పలు టోర్నమెంట్లలో విజేతగా నిలిచి మూడో స్థానంతో ప్రపంచ ర్యాంకును మెరుగుపరచుకొని టోక్యోలో అడుగుపెట్టింది. గ్రూప్‌ దశలో తొలి మ్యాచ్‌లోనే న్యూజిలాండ్‌ను ఓడించి శుభారంభం చేసిన భారత్‌, రెండో మ్యాచ్‌లో ఆస్ట్రేలియా చేతిలో దారుణ పరాజయాన్ని చవిచూసింది. అయినా నిబ్బరం కోల్పోకుండా స్పెయిన్‌, అర్జెంటీనా, జపాన్‌పై వరుస విజయాలతో క్వార్టర్‌ఫైనల్‌ బెర్త్‌ను ఖరారు చేసుకుంది. అదే జోరులో గ్రేట్‌ బ్రిటన్‌పై గెలుపుతో సెమీస్‌ చేరి స్వర్ణపతకంపై ఆశలు రేపింది. కానీ, ఫైనల్‌ చేరడంలో విఫలమవుతూ ప్రపంచ రెండో ర్యాంకర్‌ బెల్జియం చేతిలో ఓటమి చవిచూసింది. దీంతో, భారత జట్టు కసితో రియో ఒలింపిక్స్‌ కాంస్య పతక విజేత జర్మనీపై అద్భుతంగా పోరాడి ఫలితాన్ని రాబట్టింది. హోరాహోరీ మ్యాచ్‌లో జట్టులోని కుర్రాళ్లు చిరస్మరణీయ పోరాటాన్ని ప్రదర్శించి పతకాన్ని సాధించారు. మూడోసారి ఒలింపిక్స్‌ ఆడిన మన్‌ప్రీత్‌ సింగ్‌లాంటి అనువజ్ఞుడు జట్టును నడిపించడం, గోల్‌కీపర్‌ శ్రీజేష్‌లాంటి సీనియర్‌ ఆటగాడి సలహాలను జూనియర్లు పాటించడం, ఆస్ట్రేలియాకు చెందిన విదేశీ కోచ్‌ గ్రహం రీడ్‌ శిక్షణలో యూరోపియన్‌ శైలిని అలవాటు చేసుకోవడం వంటి అనేకానేక అంశాలు భారత్‌ విజయానికి దోహదం చేశాయి. 


ఈ గెలుపులో మరో ప్రధాన పాత్రధారి ఒడిశా ముఖ్యమంత్రి నవీన్‌ పట్నాయక్‌. కాసులు కురిపించే క్రికెట్‌ను స్పాన్సర్‌ చేయడం తప్ప, మూడేళ్ల క్రితం వరకూ మన దేశంలో హాకీని ప్రమోట్‌ చేసేందుకు ఎవరూ ముందుకు రాని స్థితి. హాకీ కథాంశంగా నిర్మించిన ‘చక్‌ దే ఇండియా’ సినిమాలో కథానాయకుడిగా మెప్పించిన షారుక్‌ ఖాన్‌ కూడా ఐపీఎల్‌లో పెట్టుబడులు పెట్టి క్రికెట్‌లో తన వ్యాపారాన్ని విస్తరించుకున్నారు. ఇలాంటిస్థితిలో నవీన్‌ పట్నాయక్‌ ముందుండి పురుషులు, మహిళల హాకీ జట్టుకు ఒడిశా సర్కారు రూపంలో ప్రధాన స్పాన్సరర్‌ అయ్యారు. గతంలో హాకీ క్రీడాకారుడైన ఆయన ఇరుజట్లతో ఐదేళ్లకుగాను వంద కోట్ల రూపాయలకు ఒప్పందం కుదుర్చుకొని జాతీయ క్రీడకు అండగా నిలిచారు. తన ప్రోత్సాహంతో ముందుకెళ్లిన ఆటగాళ్లు ఇప్పుడు ఒలింపిక్‌ పతకంతో తిరిగివస్తుండడంతో పట్నాయక్‌ ఆనందానికి అవధుల్లేవు. మహిళల హాకీ జట్టు కూడా టోక్యోలో అద్భుత ప్రదర్శన చూపుతున్నది. శుక్రవారం జరిగే కాంస్య పతక పోరులో అమ్మాయిలు కూడా విజయం సాధిస్తే భారత్‌ ఆనందానికి అవధులుండవు. మన క్రీడారంగాన్ని క్రికెట్‌ శాసిస్తున్న ఈ రోజుల్లో ఒలింపిక్‌ విజయం ఈ జాతీయ క్రీడలో తిరిగి జవసత్వాలు నింపుతుందని ఆశిద్దాం.

Updated Date - 2021-08-06T06:31:04+05:30 IST