వివాదం తర్వాత తొలిసారి.. మళ్లీ రంగంలోకి జొకోవిచ్

ABN , First Publish Date - 2022-01-28T00:23:06+05:30 IST

కొవిడ్ వ్యాక్సినేషన్ వివాదంలో ఆస్ట్రేలియాలో నిర్బంధానికి గురై ఆస్ట్రేలియా ఓపెన్‌కు దూరమైన నొవాక్ జొకోవిచ్

వివాదం తర్వాత తొలిసారి.. మళ్లీ రంగంలోకి జొకోవిచ్

దుబాయ్: కొవిడ్ వ్యాక్సినేషన్ వివాదంలో చిక్కుకుని మెల్‌బోర్న్‌లో నిర్బంధానికి గురై ఆస్ట్రేలియా ఓపెన్‌కు దూరమైన స్టార్ టెన్నిస్ ప్లేయర్ నొవాక్ జొకోవిచ్ మళ్లీ రంగంలోకి దిగాడు. వచ్చే నెలలో దుబాయ్‌లో జరగనున్న టోర్నెమెంట్ కోసం రెడీ అవుతున్నాడు. 34 ఏళ్ల ఈ సెర్బియన్ ఆటగాడు వ్యాక్సిన్ తీసుకోకుండా మెల్‌బోర్న్‌లో అడుగుపెట్టి 11 రోజులపాటు అక్కడ నిర్బంధంలో గడిపాడు. ప్రభుత్వం అతడి వీసాలను రెండుసార్లు రద్దు చేయడంతో ఆస్ట్రేలియన్ ఓపెన్ ఆడకుండానే వెనుదిరగాల్సి వచ్చింది.  


వచ్చే నెల 21న జరగనున్న ఏటీపీ 500 దుబాయ్ టెన్నిస్ చాంపియన్‌షిప్స్‌లో జొకోవిచ్ ఆడుతున్నట్టు నిర్వాహకులు తెలిపారు. జొకోవిచ్‌ను దుబాయ్‌లో మళ్లీ చూడబోతున్నందుకు ఆనందంగా ఉందని దుబాయ్ డ్యూటీ ఫ్రీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ కోమ్ మెక్ లాగిన్ తెలిపారు. నొవాక్ దుబాయ్‌లో అడుగుపెట్టనుండడం ఇది 12వసారి కాగా, ఆరో టైటిల్‌పై కన్నేశాడు. జొకోవిచ్ దుబాయ్ టోర్నమెంటులో ఆడుతున్నట్టు అతడి అధికారిక వెబ్‌సైట్ కూడా ధ్రువీకరించింది. 

Updated Date - 2022-01-28T00:23:06+05:30 IST