న్యాయ పోరాటంలో జొకోదే జయం

ABN , First Publish Date - 2022-01-11T09:20:21+05:30 IST

ఆస్ట్రేలియా ప్రభుత్వంపై న్యాయ పోరాటంలో ప్రపంచ నెం.1 టెన్నిస్‌ ఆటగాడు నొవాక్‌ జొకోవిచ్‌నే విజయం వరించింది.

న్యాయ పోరాటంలో జొకోదే జయం

వీసాను పునరుద్ధరించిన న్యాయమూర్తి

హడావిడిగా రద్దు చేశారని వ్యాఖ్య

ప్రత్యేక అధికారంతో మళ్లీ రద్దు చేయాలన్న యోచనలో ఆసీస్‌ ప్రభుత్వం?

మెల్‌బోర్న్‌: ఆస్ట్రేలియా ప్రభుత్వంపై న్యాయ పోరాటంలో ప్రపంచ నెం.1 టెన్నిస్‌ ఆటగాడు నొవాక్‌ జొకోవిచ్‌నే విజయం వరించింది. అతడి వీసా రద్దును తప్పుబట్టిన స్థానిక ఫెడరల్‌ సర్క్యూట్‌ కోర్టు న్యాయమూర్తి ఆంథోని కెల్లీ దానిని వెంటనే పునరుద్ధరించాలని ప్రభుత్వాన్ని ఆదేశించారు. నిర్దిష్ట కారణాలు చూపకుండా కరోనా వ్యాక్సిన్‌ మినహాయింపు పొందాడని ఆరోపిస్తూ జొకో వీసాను సరిహద్దు ఫోర్స్‌ అధికారులు రద్దు చేసిన సంగతి తెలిసిందే. అంతేకాదు గత గురువారం నుంచి అతడిని ఇక్కడి హోటల్‌లో నిర్బంధించారు. తన వీసా రద్దును నొవాక్‌ న్యాయస్థానంలో సవాలు చేయగా సోమవారం విచారణ జరిగింది. జొకో తన లాయర్లతో మాట్లాడేందుకు తగిన సమయం ఇవ్వకుండానే అతడి వీసాను రద్దు చేయడాన్ని న్యాయమూర్తి కెల్లీ ఆక్షేపించారు. వ్యాక్సిన్‌ మినహాయుంపు పొందడానికి అర్హుడినని నిరూపించుకొనేందుకు అవసరమైన ఆధారాలన్నీ నొవాక్‌ సమర్పించాడని చెప్పారు. జొకోవిచ్‌ ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌లో ఆడొచ్చని స్పష్టంజేశారు. తీర్పు అనంతరం హోటల్‌ నుంచి విడుదలైన నొవాక్‌.. మెల్‌బోర్న్‌ పార్క్‌లో సాధన కూడా ప్రారంభించాడు. ‘నా వీసా రద్దు నిర్ణయాన్ని న్యాయమూర్తి కొట్టివేసినందుకు సంతోషంగా ఉంది. ఎన్ని ఆటంకాలు ఎదురైనా ఇక్కడే ఉండి ఆస్ట్రేలియా ఓపెన్‌లో తలపడతా’ అని 34 ఏళ్ల జొకో అన్నాడు. 


ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌లో ఆడేనా?:

వీసాను కోర్టు పునరుద్ధరించడంతో ఈనెల 17నుంచి జరిగే ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌లో డిఫెండింగ్‌ చాంపియన్‌ జొకో బరిలోకి దిగే అవకాశముంది. కానీ కోర్టు తీర్పుతో కంగుతిన్న ప్రధాని స్కాట్‌ మారిసన్‌ ప్రభుత్వం..ప్రత్యేక అధికారంతో నొవాక్‌ వీసాను మళ్లీ రద్దు చేసే అవకాశాలు కన్పిస్తున్నాయి. ‘ఇమ్మిగ్రేషన్‌ వ్యవహారాల మంత్రి తనకుగల ప్రత్యేక అధికారాలను ఉపయోగించి నొవాక్‌ వీసాను మళ్లీ రద్దు చేసే విషయాన్ని పరిశీలిస్తారు’ అని సోమవారంనాటి విచారణ సందర్భంగా ప్రభుత్వ న్యాయవాది క్రిస్టొఫర్‌ ట్రాన్‌ తెలిపారు. ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ ప్రారంభానికి ముందు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోనున్నట్టు తెలుస్తోంది.

Updated Date - 2022-01-11T09:20:21+05:30 IST