Abn logo
Sep 10 2021 @ 03:29AM

రికార్డుకు చేరువలో జొకో

సెమీస్‌లో జ్వెరెవ్‌తో నొవాక్‌ ఢీ

యూఎస్ ఓపెన్‌

న్యూయార్క్‌:  వరల్డ్‌ నంబర్‌ వన్‌ నొవా క్‌ జొకోవిచ్‌ క్యాలెండర్‌ గ్రాండ్‌స్లామ్‌కు రెండే అడుగుల దూరంలో నిలిచాడు. ఆరో సీడ్‌ మాటో బెరెట్టినిపై నెగ్గి.. యూఎస్‌ ఓపెన్‌ సెమీ్‌సకు చేరుకున్నాడు. ఫైనల్లో చోటుకోసం జర్మన్‌ స్టార్‌ అలెగ్జాండర్‌ జ్వెరెవ్‌తో అమీతుమీ తేల్చుకోనున్నాడు. అన్‌సీడెడ్‌ లాయడ్‌ హారి్‌సపై గెలుపుతో జ్వెరెవ్‌ ఫైనల్‌ ఫోర్‌కు చేరుకున్నాడు. చెక్‌ భామ కరోలినా ప్లిస్కోవాకు చెక్‌ చెప్పిన 17వ సీడ్‌ మరి యా సక్కారి కూడా ముందంజ వేసింది. 


తడబడి.. నిలబడి..

టాప్‌ సీడ్‌ జొకో తడబడుతూనే సాగుతున్నాడు. టోర్నీలో వరుసగా మూడోసారి మొదటి సెట్‌ను కోల్పోయాడు. పురుషుల సింగిల్స్‌ క్వార్టర్స్‌ మ్యాచ్‌లో సెర్బియా యోధుడు జొకోవిచ్‌ 5-7, 6-2, 6-2, 6-3తో ఇటలీ ఆటగాడు బెరెట్టినిపై విజయం సాధించాడు. జొకో 12 ఏస్‌లు సంధిస్తే.. పొడగరి అయిన బెరెట్టిని 17 ఏస్‌లు వేశాడు. కానీ, 43 అనవసర తప్పిదాలతో మ్యాచ్‌ను చేజార్చుకున్నాడు. మరో మ్యాచ్‌లో 4వ సీడ్‌ జ్వెరెవ్‌ 7-6(6), 6-3, 6-4తో దక్షిణాఫ్రికా ఆటగాడు లాయడ్‌పై వరుస సెట్లలో నెగ్గాడు. 


ప్లిస్కోవాకు షాక్‌..:

ఫేవరెట్లలో ఒకరైన 4వ సీడ్‌ ప్లిస్కోవాకు క్వార్టర్స్‌లో షాక్‌ తగిలింది. మహిళల సింగిల్స్‌లో ప్లిస్కోవా 4-6, 4-6తో గ్రీస్‌ ప్లేయర్‌ సక్కారి చేతిలో చిత్తయింది. సెమీ్‌సలో బ్రిటన్‌ సంచలనం ఎమ్మా రదుకానుతో సక్కారి, రెండో సీడ్‌ మెద్వెదెవ్‌తో ఫెలిక్స్‌ అలియసిమ్‌ తలపడనున్నారు. 


గోల్డెన్‌ స్లామ్‌ కోసం..

వీల్‌ చెయిర్‌ టెన్నిస్‌ పురుషుల్లో డ్యాలన్‌ అల్కాట్‌ (ఆస్ట్రేలియా), మహిళల్లో డైడి డి గ్రూట్‌ (నెదర్లాండ్స్‌) గోల్డెన్‌ స్లామ్‌ (ఒకే ఏడాది నాలుగు గ్రాండ్‌స్లామ్‌లతోపాటు ఒలింపిక్‌ స్వర్ణం కూడా నెగ్గడం) దిశగా సాగుతున్నారు. వీరిద్దరూ తమతమ విభాగాల్లో ఆస్ట్రేలియన్‌, ఫ్రెంచ్‌, వింబుల్డన్‌ టైటిళ్లతోపాటు పారాలింపిక్స్‌లో స్వర్ణాలు సాధించారు. యూఎస్‌ ఓపెన్‌లో కూడా వీరిద్దరూ చాంపియన్లుగా నిలిస్తే.. వీల్‌చెయిర్‌ టెన్ని్‌సలో అత్యంత అరుదైన గోల్డెన్‌స్లామ్‌ దక్కించుకున్న ప్లేయర్లుగా చరిత్ర సృష్టిస్తారు. 1988లో స్టెఫీగ్రాఫ్‌ మాత్రమే ఓపెన్‌ ఎరాలో గోల్డెన్‌స్లామ్‌ సాధించింది. కాగా, టోక్యో ఒలింపిక్స్‌లో జొకో పతకం లేకుండా నిష్క్రమించడంతో ఆ చాన్స్‌ కోల్పోయాడు.