త్వరలో నోటిఫికేషన్లు అంటూ.. బార్లకు నోటిఫికేషన్లు ఇవ్వడం సిగ్గుచేటు: విజయశాంతి

ABN , First Publish Date - 2021-11-20T02:15:27+05:30 IST

త్వరలో నోటిఫికేషన్లు అంటూ.. బార్లకు నోటిఫికేషన్లు ఇవ్వడం సిగ్గుచేటు: విజయశాంతి

త్వరలో నోటిఫికేషన్లు అంటూ.. బార్లకు నోటిఫికేషన్లు ఇవ్వడం సిగ్గుచేటు: విజయశాంతి

హైదరాబాద్: టీఆర్ఎస్ ప్రభుత్వంపై బీజేపీ నాయకురాలు విజయశాంతి విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలో కొలువుల భర్తీ ఒక అడుగు ముందుకు... రెండడుగులు వెనక్కు అన్నట్టు సాగుతోందని, త్వరలో నోటిఫికేషన్లు అంటూ ఉసూరుమనిపించడం ప్రభుత్వానికి పరిపాటిగా మారిందని విజయశాంతి మండిపడ్డారు. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో నిరుద్యోగుల చావులు సీఎం కేసీఆర్‌కు కనబడడంలేదని, రాష్ట్రంలో లక్షా 90 వేల ఖాళీలున్నట్టు పీఆర్సీ నివేదిక వెల్లడించినా ఉద్యోగాల భర్తీపై టీఆర్ఎస్ మంత్రులు, ఎమ్మెల్యేలు మాటలు దాటవేస్తూ నిరుద్యోగులను ఆందోళనలో పడేస్తున్నారని సోషల్ మీడియా వేదికగా ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. రాములమ్మ పోస్టు యథాతథంగా...


''రాష్ట్రంలో కొలువుల భర్తీ ఒక అడుగు ముందుకు... రెండడుగులు వెనక్కు అన్నట్టు సాగుతోంది. త్వరలో నోటిఫికేషన్లు... అంటూ ఉసూరుమనిపించడం ప్రభుత్వానికి పరిపాటిగా మారింది. 2016 నుంచి ఇప్పటివరకు ఒక్క నోటిఫికేషన్ కూడా విడుదల చేయకపోవడంతో ఇన్నాళ్లు వేచిచూసి, నిరాశనిస్పృహలకు లోనైన  21 మంది నిరుద్యోగులు బలవన్మరణానికి పాల్పడినా ప్రభుత్వం మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తూ... ఖజానాకు ఆదాయం తెచ్చే బార్లకు మాత్రం నోటిఫికేషన్లు ఇవ్వడం సిగ్గుచేటు. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో నిరుద్యోగుల చావులు సీఎం కేసీఆర్‌కు కనబడడంలేదు. రాష్ట్రంలో లక్షా 90 వేల ఖాళీలున్నట్టు పీఆర్సీ నివేదిక వెల్లడించినా ఉద్యోగాల భర్తీపై టీఆర్ఎస్ మంత్రులు, ఎమ్మెల్యేలు మాటలు దాటవేస్తూ నిరుద్యోగులను ఆందోళనలో పడేస్తున్రు. ఇదిలా ఉండగా లక్షా 35 వేల ఉద్యోగాలు భర్తీ చేశామని రాష్ట్ర ప్రభుత్వం చెప్పడం ముమ్మాటికీ అబద్దమేనని స్పష్టంగా చెప్పగలం. ఎందుకంటే, కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ కొలువులను కలిపి చెప్పడమే నిదర్శనం. కొలువుల భర్తీ విషయంలో అసలు ప్రభుత్వం  చెబుతున్న లెక్కలన్నీ తప్పుల తడకేనని స్పష్టమవుతోంది. ఇటీవల హుజురాబాద్ ఉపఎన్నికలో ఓటమి తర్వాత ప్రెస్ మీట్ పెట్టి మరీ త్వరలోనే 80 వేల ఉద్యోగాల భర్తీ అంటూ మాట్లాడిన సీఎం కేసీఆర్ గారు... తాజాగా వడ్లపై ధర్నాల పేరుతో కొలువుల భర్తీ అంశాన్ని పక్కన పెట్టేసి... స్వార్థ రాజకీయాలకు తెరలేపి, నిరుద్యోగుల ఆశలపై నీళ్లు చల్లడం... భవిష్యత్తులో వారు మీపై నీళ్లుచల్లనీకి సంకేతమని గుర్తించండి. ఇప్పటికైనా మీ వట్టి మాటలు, ఉత్త ధర్నాలు పక్కన పెట్టి నిరుద్యోగులు ఎదురుచూస్తున్న సర్కారీ కొలువుల భర్తీకి చర్యలు తీసుకుంటే మంచిది.'' అని విజయశాంతి పేర్కొన్నారు.



Updated Date - 2021-11-20T02:15:27+05:30 IST