బడిలో.. ఎన్నికల గంట!

ABN , First Publish Date - 2021-09-16T05:13:55+05:30 IST

ప్రభుత్వ పాఠశాలల్లో ఎన్నికల గంట మోగనుంది. తల్లిదండ్రుల కమిటీ (పీసీ)ల ఎంపికకు గురువారం (నేడు) నోటిఫికేషన్‌ జారీ కానుంది. 22న చైర్మన్‌, వైస్‌ చైర్మన్లతో పాటు కమిటీ సభ్యుల ఎన్నిక జరగనుంది. ఈ మేరకు ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేసింది. ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఎన్నికలు నిర్వహించాలని ఆదేశించింది. ఈమేరకు రంగం సిద్ధమవుతోంది.

బడిలో.. ఎన్నికల గంట!
మెళియాపుట్టిలో ఇరువర్గాల వైసీపీ నేతల వాగ్వాదం

- తల్లిదండ్రుల కమిటీ ఎంపికకు నేడు నోటిఫికేషన్‌

- 22న 3,875 చోట్ల ఎన్నికలకు ఏర్పాట్లు

- 128 సమస్యాత్మక పాఠశాలలు గుర్తింపు 

(శ్రీకాకుళం-ఆంధ్రజ్యోతి/రాజాం/రూరల్‌)

ప్రభుత్వ పాఠశాలల్లో ఎన్నికల గంట మోగనుంది. తల్లిదండ్రుల కమిటీ (పీసీ)ల ఎంపికకు గురువారం (నేడు) నోటిఫికేషన్‌ జారీ కానుంది. 22న చైర్మన్‌, వైస్‌ చైర్మన్లతో పాటు కమిటీ సభ్యుల ఎన్నిక జరగనుంది. ఈ మేరకు ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేసింది. ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఎన్నికలు నిర్వహించాలని ఆదేశించింది. ఈమేరకు రంగం సిద్ధమవుతోంది. జిల్లాలో 3,875 ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయి. వీటిలో ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్నారు. పాఠశాల కమిటీలో ప్రతి తరగతి నుంచి ముగ్గురు సభ్యులను ఎన్నుకోవాలి. ప్రాథమిక పాఠశాలలో 15 మంది, ప్రాథమికోన్నత పాఠశాలలో ఒకటి నుంచి 8వ తరగతి వరకూ 24 మంది, ఉన్నత పాఠశాలలో తొమ్మిది మందిని ఎన్నుకుంటారు. హెచ్‌ఎం కన్వీనర్‌గా ఉండే ఈ కమిటీలో ఆరుగురు ఎక్స్‌ అఫీషియో సభ్యులను నియమించుకొనే అవకాశం ఉంది. పాఠశాల హెచ్‌ఎం, పంచాయతీ వార్డు సభ్యుడు, అంగన్‌వాడీ కార్యకర్త, ఏఎన్‌ఎం, మహిళా సమాఖ్య అధ్యక్షురాలికి అవకాశమిస్తారు. విద్యార్థి తల్లిదండ్రుల్లో ఒకరికి మాత్రమే ఓటు హక్కు ఉంటుంది. ఇద్దరు పిల్లలు వేర్వేరు పాఠశాలల్లో చదివితే.. రెండు చోట్లా ఒకరికి మాత్రమే ఓటు వేసే అవకాశం ఉంది. 


షెడ్యూల్‌ ఇలా.. : 

- ఈ నెల 16న ఉదయం 10 గంటలకు ఎన్నికల నోటిఫికేషన్‌ జారీచేస్తారు. మధ్యాహ్నం 2 గంటలకు ఓటర్ల జాబితాను పాఠశాలల నోటీసు బోర్డులో ప్రకటిస్తారు.

- 20న ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ఓటర్ల జాబితాపై అభ్యంతరాలు స్వీకరిస్తారు. మధ్యాహ్నం 3 నుంచి 4 గంటల వరకు ఓటర్ల తుది జాబితా ప్రదర్శిస్తారు. 

- 22న ఉదయం 7 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు తల్లిదండ్రుల కమిటీ సభ్యుల ఎన్నిక నిర్వహిస్తారు. ఎంపికైన సభ్యుల్లో చైర్మన్‌, వైస్‌చైర్మన్లను కూడా ఎన్నుకోనున్నారు. అనంతరం చైర్మన్‌, వైస్‌చైర్మన్‌లతో పాటు సభ్యులంతా ప్రమాణ స్వీకారం చేస్తారు.  


‘నాడు-నేడు’తో పెరిగిన ప్రాధాన్యం : 

పాఠశాలల్లో ‘నాడు-నేడు’  పనులకు పెద్ద ఎత్తున నిధులు కేటాయిస్తుండడంతో తల్లిదండ్రుల కమిటీలకు ప్రాధాన్యం పెరిగింది. త్వరలో ‘నాడు-నేడు’ రెండో విడత పనులకు నిధులు మంజూరయ్యే అవకాశం ఉంది. మరోవైపు మధ్యాహ్న భోజన పథకం అమలు, పాఠశాల నిర్వహణ నిధుల ఖర్చు, విద్యాకానుకల పంపిణీ వ్యవహారాల్లో కూడా కమిటీలు కీలకపాత్ర పోషించనున్నాయి. ఈ నేపథ్యంలో రాజకీయ నాయకులు తెర వెనుక ఉండి.. తమ అనుచరులకు చైర్మన్‌, వైస్‌చైర్మన్‌ పదవులు దక్కేలా పావులు కదుపుతున్నారు. కొన్నిచోట్ల అధికార పార్టీ నాయకులు.. తమ వారే చైర్మన్లుగా ఉండాలని పట్టుబడుతున్నారు. ఈ క్రమంలో కొన్నిచోట్ల వివాదాలు తలెత్తుతున్నాయి. బుధవారం మెళియాపుట్టి మండలంలో పాఠశాల కమిటీ సమావేశం రసాభాసగా మారడమే ఇందుకు ఉదాహరణ. అధికార పార్టీ నాయకులు కొందరు సమావేశానికి హాజరై వివాదానికి తెర లేపారు. సజావుగా ఎన్నికల నిర్వహించేలా అధికారులు చర్యలు చేపడుతున్నారు. జిల్లాలో 128 సమస్యాత్మక పాఠశాలలు ఉన్నట్టు గుర్తించారు. ఎన్నికల రోజు ఆ పాఠశాలల్లో భారీ బందోబస్తు ఏర్పాటు చేయనున్నారు. పాఠశాలల్లో ఎన్నికల నిర్వహణకు పకడ్బందీగా ఏర్పాట్లు చేస్తున్నామని సర్వశిక్ష అభియాన్‌ ఏపీసీ తిరుమల చైతన్య తెలిపారు. 


మెళియాపుట్టిలో రసాభాస

- వైసీపీలో రెండు వర్గాల మధ్య వాగ్వాదం  

మెళియాపుట్టి, సెప్టెంబరు 15: పాఠశాల తల్లిదండ్రుల కమిటీ ఎన్నికలు మరో 24 గంటల్లో ప్రారంభం కానుండగా.. బుధవారం నిర్వహించిన తల్లిదండ్రుల సమావేశం రసాభాసగా మారింది. వైసీపీలోని రెండు వర్గాలు ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటూ రోడ్డుపైకి వచ్చిన సంఘటన స్థానిక మండల పరిషత్‌ పాఠశాలలో చోటుచేసుకుంది. ఈ ఘటనకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి. హెచ్‌ఎం త్రినాథరావు అభివృద్ధి పనులపై వివరించేందుకు పాత కమిటీ తల్లిదండ్రుల సమావేశం నిర్వహించారు. పాఠశాలలో చదువుతున్న విద్యార్థుల తల్లిదండ్రులు ఈ సమావేశానికి వెళ్లాల్సి ఉన్నప్పటికీ కొందరు వైసీపీ నాయకులు హాజరవడంతో వారిని ఆ పార్టీ వ్యతిరేక వర్గం ప్రతినిధులు నిలదీశారు. దీంతో పాత కమిటీ చైర్మన్‌ కిరణ్‌కుమార్‌ పాఠశాల అభివృద్ధికి ఏం చేశారని? వ్యతిరేక వర్గానికి చెందినవారు ప్రశ్నించారు. దీంతో ఇరువర్గాల మధ్య మాటామాటా పెరిగింది. ఒకానొక సందర్భంలో కొట్లాటకు దారితీసింది. పాఠశాల తల్లిందండ్రులు కమిటీ సమావేశానికి రాజకీయ రంగులు పులిమేందుకు వైసీపీ నాయకులు వెళ్లడం... తల్లిదండ్రులు తిరగబడడంతో ఇరువర్గాల (వైసీపీ నాయకుల) పరువు బజారునపడింది. ఈ సంఘటనతో మెళియాపుట్టి మండల కేంద్రంలో వైసీపీ నాయకుల మధ్య వర్గ విభేదాలు మరోసారి బయట పడినట్టయింది. దీంతో కార్యకర్తలు ఆందోళన చెందుతున్నారు. తల్లిదండ్రులు కమిటీ ఎన్నికలు జరగకముందే ఇలా ఉంటే.. నోటిఫికేషన్‌ తరువాత ఎటువంటి పరిణామాలు జరుగుతాయోనని ఆందోళనకు గురవుతున్నారు. 


అభివృద్ధి పనులు వివరించేందుకే...

 పాఠశాలలో చేపట్టిన అభివృద్ధి పనులు వివరించడం.. విద్యార్థుల సంఖ్య పెంచేందుకే ఈ సమావేశం నిర్వహించాం. పాత కక్షల వల్ల రసాభాస అయింది. ఇరువర్గాలు పంతాలకు పోవడం వల్ల రోడ్డెక్కారు.

- త్రినాథరావు, హెచ్‌ఎం, మెళియాపుట్టి

 

Updated Date - 2021-09-16T05:13:55+05:30 IST