నెలాఖరులోగా నోటిఫికేషన

ABN , First Publish Date - 2021-10-17T06:13:43+05:30 IST

నెల్లూరు నగరపాలక సంస్థ, బుచ్చిరెడ్డిపాళెం నగర పంచాయతీ ఎన్నికలకు రంగం సిద్ధమైంది.

నెలాఖరులోగా నోటిఫికేషన
బుచ్చి నగర పంచాయతీ వ్యూ

నెల్లూరు నగర కార్పొరేషన, బుచ్చి నగర పంచాయతీ ఎన్నికలకు...

సిద్ధంగా ఉండంటూ అధికారులకు ఆదేశాలు

సమాయత్తమవుతున్న రాజకీయ పార్టీలు

అభ్యర్థులు, ఆశావహులతో అధికార పార్టీ నేతల మంతనాలు

సిటీ, రూరల్‌ పార్టీ కార్యాలయాల్లో సమావేశాలు

ఎన్నికల వ్యూహరచనలో టీడీపీ నాయకులు


నెల్లూరు, అక్టోబరు16(ఆంధ్రజ్యోతి): నెల్లూరు నగరపాలక సంస్థ, బుచ్చిరెడ్డిపాళెం నగర పంచాయతీ ఎన్నికలకు రంగం సిద్ధమైంది.  ఏ క్షణానైనా నోటిఫికేషన వెలువడే అవకాశం ఉంది... సిద్ధంగా ఉండండి.. అని కార్పొరేషన అధికారులకు ప్రభుత్వం నుంచి ఆదేశాలు అందినట్లు తెలిసింది. దీన్ని ధ్రువీకరించేలా రాజకీయ పక్షాల్లో ఎన్నికల హడావిడి మొదలైంది. అధికార పార్టీ ఒక అడుగు ముందుకేసి కార్పొరేషనలో పోటీ చేసే అభ్యర్థులు, ఆశావహులు, ముఖ్యనాయకులతో సమావేశాలు నిర్వహించింది. ఎన్నికల వ్యూహరచనపై టీడీపీ ముఖ్య నాయకులు సమాలోచనలు ప్రారంభించారు. అలాగే కార్పొరేషన అధికారులు ఎన్నికల ఏర్పాట్లకు సమాయత్తం అవుతున్నారు.కమిషనర్‌ అధ్యక్షతన  శనివారం టౌనప్లానింగ్‌, రెవెన్యూ, ఎలక్షన సెల్‌ విభాగాలతో జరిగిన సమావేశంలో ఎన్నికల అంశంపై కూడా చర్చ జరిగినట్లు తెలిసింది. ఈ విషయమై నెల్లూరు, బుచ్చి కమిషనర్లతో శనివారం సాయంత్రం జిల్లా కలెక్టర్‌ సమావేశమైనట్లు సమాచారం. 


ఐదింటిలో రెండింటికే ఎన్నికలు


కోర్టు కేసుల కారణంగా జిల్లాలో ఒక కార్పొరేషనతో పాటు రెండు ఏ గ్రేడ్‌ మున్సిపాలిటీలు, కొత్తగా ఏర్పడిన రెండు నగర పంచాయతీలకు ఎన్నికలు ఆగిపోయాయి. గూడూరు, కావలి, అల్లూరు మున్సిపాలిటీలకు సంబం ధించిన కేసులు ఇంకా కోర్టులో నడుస్తుండగా, నెల్లూరు కార్పొరేషన, బుచ్చి నగర పంచాయతీల కేసులు క్లోజ్‌ అయ్యాయి. ఈ క్రమంలో న్యాయపరమైన వివాదాలు లేని నెల్లూరు, బుచ్చిలకు ఎన్నికలు నిర్వహించడానికి ప్రభుత్వం సన్నద్ధం అయినట్లు సమాచారం. 

 

ఎట్టకేలకు కదలిక 


149.20 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంతో 1,39,719 గృహ సముదాయాలతో, సుమూరు 7.56 లక్షల జనాభాతో 54 డివిజన్లుగా నెల్లూరు కార్పొరేషన విస్తరించి ఉంది. తాజా ఓటర్ల జాబితా ప్రకారం కార్పొరేషన పరిధిలో 4,77,,244 మంది ఓటర్లు ఉన్నారు. నెల్లూరు సిటీ, రూరల్‌ అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో విస్తరించి ఉన్న ఈ కార్పొరేషనకు జరిగే ఎన్నికలకు రాజకీయ ప్రాధాన్యం ఎక్కువ.  ఓటర్ల జాబితా, డివిజన్ల విభజన తదితర అంశాలపై కోర్టు కేసుల నేపథ్యంలో కార్పొరేషన ఎన్నికలు వాయిదాపడ్డాయి. అయితే కోర్టు కేసులు క్లియర్‌ కావడంతో ఎన్నికలకు రంగం సిద్ధమైంది.


ఇప్పటికే రిజర్వేషన్ల ఖరారు


కార్పొరేషన ఎన్నికలకు సంబంధించి రిజర్వేషన్ల ప్రక్రియ ఇదివరకే పూర్తయింది. మేయర్‌ పదవి ఎస్టీ వర్గాలకు కేటాయించారు. డివిజన్ల రిజర్వేషన్ల విషయానికి వస్తే ఎస్టీ మహిళ1, ఎస్టీ జనరల్‌ 2, ఎస్సీ మహిళ 3, ఎస్సీ జనరల్‌ 4, బీసీ మహిళ 8, బీసీ జనరల్‌ 9, జనరల్‌ మహిళ 15, జనరల్‌ 12 వార్డులు కేటాయించారు. వీటిలో ఏ వర్గానికి ఏ వార్డు రిజర్వు చేసిన విషయాన్ని ప్రభుత్వం ఇదివరకే గెజిట్‌ విడుదల చేసింది.ఈ రిజర్వేషన్ల మేరకే ఎన్నికలు జరగనున్నాయి. బుచ్చి నగర పంచాయతీ రిజర్వేషన్ల ప్రక్రియ కూడా ఇదివరకే పూర్తి అయిన విషయం తెలిసిందే. 


ఎన్నికల సందడి  ప్రారంభం


నెల్లూరు కార్పొరేషన, బుచ్చి నగర పంచాయతీ ఎన్నికలకు సంబంధించి సిద్ధంగా ఉండమని ప్రభుత్వం నుంచి సంకేతాలు అందడంతో ఒక్కసారిగా రాజకీయ, అధికార వర్గాల్లో సందడి మొదలైంది. శుక్రవారం అధికార పార్టీ నాయకులు నగర పరిధిలోని ముఖ్య నాయకులతో సమావేశం నిర్వహించారు. నెల్లూరు సిటీ, రూరల్‌ వైసీపీ పార్టీ కార్యాలయాల్లో ఆయా నియోజకవర్గ నాయకులు కేడర్‌తో సమావేశమయ్యారు. అధికార పార్టీ ఇప్పటికే పలు డివిజన్లకు సంబంధించిన అభ్యర్థులను ఖరారు చేసుకుంది. ఇప్పటికే ఖరారైన అభ్యర్థులను వెంటనే ఎన్నికల ప్రచారంలోకి దిగాలని, అవసరమైన అన్ని ఏర్పాట్లు సిద్ధం చేసుకోవాలని అధికార పార్టీ నాయకులు ఆదేశించినట్లు సమాచారం. ఇక తెలుగుదేశం పార్టీ ముఖ్య నాయకులు కార్పొరేషన ఎన్నికల వ్యూహరచనపై సమాలోచనలు మొదలుపెట్టారు. శుక్రవారం రాత్రి టీడీపీ ముఖ్యనేతలు సమావేశమై ఎన్నికలపై చర్చించుకున్నట్లు సమాచారం. 

ఇక అధికారవర్గాల విషయానికి వస్తే శనివారం నెల్లూరు కార్పొరేషనలో కమిషనర్‌ వివిధ శాఖల అధికారులతో సమావేశమై ఎన్నికల అంశంపై చర్చించినట్లు తెలిసింది. పోలింగ్‌ కేంద్రాల ఏర్పాటుకు, తదితరాలకు సంబంధించి చర్చ జరిగింది. శనివారం సాయంత్రం కలెక్టర్‌ చక్రధర్‌ బాబు తన కార్యాలయంలో జిల్లా పరిధిలోని మున్సిపల్‌ కమిషనర్లతో సమావేశమై మున్సిపాలిటీలు ఆదాయం పెంచుకునే విషయమై చర్చించారు. ఈ సమావేశం అనంతరం నెల్లూరు, బుచ్చి కమిషనర్లతో కలెక్టర్‌ ప్రత్యేకంగా చర్చించారు. ఎన్నికల నోటిఫికేషన ఎప్పుడు వచ్చినా నిర్వహణకు సిద్ధంగా ఉండాలని, అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకోవాలని ఈ ఇద్దరు కమిషనర్లకు కలెక్టర్‌ సూచించినట్లు తెలిసింది. 

Updated Date - 2021-10-17T06:13:43+05:30 IST