యువత కోసం లక్ష ఉద్యోగాలకు నోటిఫికేషన్‌

ABN , First Publish Date - 2022-05-26T06:03:53+05:30 IST

నిరుద్యోగ యువతీ, యువకుల కోసం తెలంగాణ ప్రభుత్వం లక్ష ఉద్యోగాలకు నోటిఫికేషన్‌ విడుదల చేస్తుందని రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్‌ చైర్మన్‌ బి వినోద్‌ కుమార్‌ తెలిపారు.

యువత కోసం లక్ష ఉద్యోగాలకు నోటిఫికేషన్‌
విద్యార్థులతో మాట్లాడుతున్న రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్‌ చైర్మన్‌ బి వినోద్‌ కుమార్‌

- ఇంటర్వ్యూ లేకుండానే ప్రతిభగల వారికి ఉద్యోగం

- యువత ప్రతిభ కనబరిచి ప్రభుత్వ ఉద్యోగాలు సాధించాలి

- రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్‌ చైర్మన్‌ బి వినోద్‌ కుమార్‌

కరీంనగర్‌ టౌన్‌, మే 25: నిరుద్యోగ యువతీ, యువకుల కోసం తెలంగాణ ప్రభుత్వం లక్ష ఉద్యోగాలకు నోటిఫికేషన్‌ విడుదల చేస్తుందని రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్‌ చైర్మన్‌ బి వినోద్‌ కుమార్‌ తెలిపారు. నగరంలోని కృషిభవన్‌లో ప్రతిమ ఫౌండేషన్‌ స్టడీసర్కిల్‌, ఎస్సీ స్టడీ సర్కిల్‌ తరగతులను మేయర్‌ సునీల్‌రావుతో కలిసి ఆయన సందర్శించారు. ఈ సదర్భంగా ఆయన మాట్లాడుతూ నాలుగు సంవత్సరాలుగా తనసొంత ఖర్చులతో ప్రతిమ ఫౌండేషన్‌ ద్వారా నిరుద్యోగ యువతీ, యువకులకు ఉచిత శిక్షణ తరగతులు నిర్వహించడం జరుగుతుందని అన్నారు. ఉద్యోగాల నోటిఫికేషన్‌ నేపథ్యంలో గత సంవత్సరం మాదిరిగానే ఈ సంవత్సరం కూడా దాదాపు 150 మంది నిరుద్యోగ యువతీ, యువకులకు ఉచిత భోజన, శిక్షణ తరగతులు చేపట్టినట్లు తెలిపారు. కావాల్సిన సౌకర్యాలను సమకూర్చాలని మేయర్‌ సునీల్‌రావు, డెయిరీ చైర్మన్‌ రాజేశ్వర్‌రాలను ఆదేశించారు. నిరుద్యోగ యువతీ, యువకులు కష్టపడి మంచి విద్యాబోధన ద్వారా ప్రభుత్వ కొలువులు సాధించాలన్నారు. ప్రభుత్వం విడుదల చేస్తున్న లక్ష ఉద్యోగాల గ్రూపు-1, 2, 3, 4 నోటిఫికేషన్లలో ప్రతిమ ఫౌండేషన్‌ అభ్యర్థులు కూడా మంచి ప్రతిభను కనబరిరి ఉద్యోగాలు సాధించాలని సూచించారు. విద్యార్థులు కోరినట్లుగా కృషిభవన్‌లో ఇంకా కొంత అదనంగా స్థలం కేటాయిస్తే మరికొంత మంది యువతీ, యువకులకు బోధన శిక్షణ అవకాశం కల్పిస్తామన్నారు. బోధనపరంగా మంచి నైపుణ్యం కలిగిన టీచర్లను కూడా కేటాయించి శిక్షణ అందించడంతోపాటు కావాల్సిన స్టడీ మెటీరియల్‌ను అందిస్తామన్నారు. మేయర్‌ వై యాదగిరి సునీల్‌రావు మాట్లాడుతూ ప్లానింగ్‌ బోర్డు వైస్‌ చైర్మన్‌ వినోద్‌కుమార్‌ ఆదేశాల ప్రకారం నగరంలోని జిల్లా లైబ్రరీ వద్ద నగరపాలక సంస్థ ద్వారా ఎలాగైతే అన్నపూర్ణ క్యాంటీన్‌ ద్వారా 5 రూపాయల భోజన వసతి కల్పిస్తున్నామో అలాగే ప్రతిరోజు కృషిభవన్‌ వద్ద కూడా స్టడీ సర్కిల్‌ 150 మంది విద్యార్థులకు సరిపడా భోజన సౌకర్యం కల్పిస్తామన్నారు. అంతేకాకుండా కరీంనగర్‌ డెయిరీ సహకారంతో విద్యార్థులకు చల్ల, లస్సీ ఇచ్చే ఏర్పాట్లు చేస్తామన్నారు.  అన్ని రకాల సౌకర్యాలు కల్పించి శిక్షణ తరగతులు జరిగేలా చర్యలు తీసుకుంటామన్నారు. ఈ కార్యక్రమంలో ప్రతిమ ఫౌండేషన్‌ నిర్వాహకులు, యువతీ యువకులు పాల్గొన్నారు. 

Updated Date - 2022-05-26T06:03:53+05:30 IST