గిరి ఉద్యోగులకు ఇచ్చిన నోటీసులు ఉపసంహరించుకోవాలి

ABN , First Publish Date - 2021-10-29T05:08:22+05:30 IST

ఆదివాసీలకు జరుగుతున్న అన్యాయాలపై నిర్వహించే పోరాటాల్లో పాల్గొనే ఉద్యోగులకు అధికారులు జారీ చేసిన నోటీసులను తక్షణమే ఉపసంహరించుకోవాలని గిరిజన ఉద్యోగుల సంఘం రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడు బి.తౌడన్న డిమాండ్‌ చేశారు.

గిరి ఉద్యోగులకు ఇచ్చిన నోటీసులు ఉపసంహరించుకోవాలి
విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న తౌడన్న(మధ్యలో వ్యక్తి)


సంఘం రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడు తౌడన్న డిమాండ్‌ 

పాడేరు, అక్టోబరు 28: ఆదివాసీలకు జరుగుతున్న అన్యాయాలపై నిర్వహించే పోరాటాల్లో పాల్గొనే ఉద్యోగులకు అధికారులు జారీ చేసిన నోటీసులను తక్షణమే ఉపసంహరించుకోవాలని గిరిజన ఉద్యోగుల సంఘం రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడు బి.తౌడన్న డిమాండ్‌  చేశారు. స్థానిక గిరిజన సంఘం కార్యాలయంలో గురువారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆదివాసీల సమస్యలపై అనేక దశాబ్దాలుగా చేపడుతున్న పోరాటాలు, ఉద్యమాల్లో ఉద్యోగులు పాల్గొంటున్నారని, కాని ఉద్యోగులపై ఇలా వేధించడం ఇదే తొలిసారన్నారు. ప్రభుత్వ పెద్దల మెప్పు కోసం ఆదివాసీ ఉద్యమాన్ని అణచి వేయాలనే లక్ష్యంతో ఐటీడీఏ పీవో గోపాలక్రిష్ణ నిరంకుశంగా వ్యవహరిస్తూ గిరిజన ఉద్యోగులను వేధిస్తున్నారన్నారు. ఐటీడీఏ పీవోఓ వైఖరి మార్చుకోకపోతే తీవ్ర పరిణామాలను ఎదుర్కొవాల్సి వస్తుందని తౌడన్న హెచ్చరించారు. అధికారుల నోటీసులకు గిరిజన ఉద్యోగుల భయపడాల్సిన అవసరం లేదన్నారు. వాటిని  అధికారులు తక్షణమే ఉపసంహరించుకోకుంటే ఉద్యమం తీవ్రతరం చేస్తామని  హెచ్చరించారు. ఈకార్యక్రమంలో గిరిజన ఉద్యోగుల సంఘం(సిటీ), జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కోరాబు, సత్యనారాయణ, కటారి శోభన్‌కుమార్‌ పాల్గొన్నారు.

Updated Date - 2021-10-29T05:08:22+05:30 IST