నోటికాడ పంట.. నీటిపాలు!

ABN , First Publish Date - 2022-10-08T08:55:48+05:30 IST

వర్షాలు కురిస్తే రైతులకు ఆనందం.. పంటలు బాగా పండుతాయని సంతోషం.. అలాంటి వర్షాలు అనవసర సమయంలో కురిస్తే..

నోటికాడ పంట.. నీటిపాలు!

  • చేతికొచ్చే దశలో చెడగొట్టు వానలు..
  • సోయాబీన్‌, పత్తి, మొక్కజొన్న దిగుబడిపై ప్రభావం
  • పలు జిల్లాల్లో 35 వేల ఎకరాల్లో పంట నష్టం
  • నిరంతర వర్షాలతో తెగుళ్లు, చీడపీడలు

హైదరాబాద్‌, అక్టోబరు 7 (ఆంధ్రజ్యోతి): వర్షాలు కురిస్తే రైతులకు ఆనందం.. పంటలు బాగా పండుతాయని సంతోషం.. అలాంటి వర్షాలు అనవసర సమయంలో కురిస్తే.. అన్నదాతలకు ఆందోళన. పంట చేతికొచ్చే సమయంలో కురిస్తే.. రైతన్నలు కుదేలే! రాష్ట్రంలో ఇప్పుడు ఇదే పరిస్థితి నెలకొందది. వానాకాలం సాగు ప్రారంభ దశలోనే పంటలను దెబ్బతీసిన వర్షాలు.. రైతులు ఆరుగాలం శ్రమించిన పండించిన ఆ పంటలు చేతి కొచ్చే దశలో కూడా వెంటాడుతున్నాయి. ఉపరితల ద్రోణి, ఆవర్తన ప్రభావంతో నాలుగైదు రోజులుగా పలు జిల్లాల్లో కురుస్తున్న వర్షాలు పంటలను దెబ్బతీస్తున్నాయి. ఉమ్మడి ఆదిలాబాద్‌, మహబూబ్‌నగర్‌, నల్లగొండ, రంగారెడ్డి, వరంగల్‌, కరీంనగర్‌ జిల్లాల్లో కొద్దిరోజులుగా కురుస్తున్న వర్షాలకు సుమారు 35 వేల ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నట్లు వ్యవసాయ శాఖ అధికారులు అంచనా వేశారు. పంటలు చేతికొచ్చే దశలో చెడగొట్టు వానలు ఇబ్బంది పెడుతున్నాయని, దిగుబడి భారీగా తగ్గుతుందని రైతులు ఆందోళన చెందుతున్నారు. 


ఈ వానాకాలం సీజన్‌ ప్రారంభంలోనే కుండపోత వానల కారణంగా.. పత్తి, వరి, సోయాబీన్‌, కంది, మొక్కజొన్న తదితర పంటలు బాగా దెబ్బతిన్నాయి. జులై, ఆగస్టు నెలల్లో కురిసిన భారీ వర్షాలకు రాష్ట్రవ్యాప్తంగా సుమారు 15 లక్షల ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయి. పత్తి విత్తనాలైతే రెండు, మూడు సార్లు నాటాల్సి వచ్చింది. వరి నార్లు కొట్టుకుపోయాయి. అయినా రాష్ట్ర ప్రభుత్వం పంట నష్టంపై ఎలాంటి సర్వే చేయించలేదు. స్థానికంగా ఉండే ఏఈవోలు సేకరించిన ప్రాథమిక సమాచారం ప్రకారం.. అప్పట్లో రూ.3,750 కోట్ల విలువైన పంట నష్టం జరిగినట్లు సాగురంగ నిపుణులు అంచనా వేశారు. రాష్ట్రంలో పంటల బీమా పథకాలు అమలులో లేకపోవడంతో ప్రభుత్వం పంట నష్టంపై ఏమాత్రం స్పందించలేదు. రైతులు మాత్రం తెగుళ్లు, చీడపీడలను ఎదుర్కొంటూ పంటలను కాపాడుకుంటున్నారు. చీడపీడల ప్రభావంతో సాధారణం కంటే సుమారు 15-20 శాతం దిగుబడి తగ్గుతుందని వ్యవసాయ శాస్త్రవేత్తలు అంచనా వేశారు. పరిస్థితి ఇలా ఉండగానే.. మళ్లీ నాలుగైదు రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. 


పంటలను ముంచుతున్నాయి..

ఇప్పటికే సమస్యలు ఎదుర్కొంటున్న రైతులకు.. తాజా వర్షాలు మరింత ఇబ్బందికరంగా మారాయి. స్థానిక ఏఈవోలు సేకరించిన ప్రాథమిక వివరాల మేరకు ఆదిలాబాద్‌, రంగారెడ్డి, మహబూబ్‌నగర్‌, వికారాబాద్‌, నారాయణపేట, కుమ్రంభీం ఆసిఫాబాద్‌, సూర్యాపేట తదితర జిల్లాల్లో సుమారు 35 వేల ఎకరాల్లో పంటలు నష్టపోయినట్లు సమాచారం. ఆదిలాబాద్‌ జిల్లాలో కోతకు వచ్చిన సోయా పంటను చేలల్లోనే వదిలేస్తున్నారు. కొన్నిచోట్ల నూర్పిడి చేసిన తర్వాత సోయాలు తడిసిపోయాయి. పత్తి తీసే దశకు రాగా.. వానలకు తడిసి ముద్దయిపోతోంది. రంగారెడ్డి జిల్లాలోని ఆమనగల్లు, తలకొండపల్లి, కేశంపేట, శంకర్‌పల్లి మండలాల్లో కురిసిన భారీ వర్షానికి వరదనీరు పంట చేలల్లోకి చేరింది. వికారాబాద్‌ జిల్లాలో మక్కలు తడిసిపోయాయి. భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్‌ జిల్లాలో వర్షాల ప్రభావంతో మిర్చి పంటను చీడపీడలు ఆశించాయి. ఇక మహబూబ్‌నగర్‌ జిల్లాలో వేల ఎకరాల్లో వరి పంట నేలకొరిగింది.  4,300 ఎకరాల్లో పత్తి, 200 ఎకరాల్లో మొక్కజొన్న దెబ్బతిన్నట్లు అధికారులు తెలిపారు. నారాయణపేట జిల్లాలో భారీ వర్షాలకు 5 వేల ఎకరాల్లో పత్తి పంట దెబ్బతింది. సూర్యాపేట జిల్లాలో వరిపొలాలు నీట మునిగాయి. పత్తి పూత రాలిపోయింది. ఖమ్మం జిల్లాలో 5 వేల ఎకరాల్లో పత్తికి నష్టం వాటిల్లినట్లు అధికారులు తెలిపారు.


సీజన్‌ ముగిసినా నిష్క్రమించని నైరుతి..!

వానాకాలం జూన్‌లో మొదలై సెప్టెంబరు నెలాఖరుతో ముగుస్తుంది. కానీ, ఇంతవరకు నైరుతి రుతు పవనాలు రాష్ట్రం నుంచి నిష్క్రమించలేదు. అక్టోబరులో వారం గడిచినా వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. ఈ చెడగొట్టు వానలతో పంటలు దెబ్బతింటున్నాయి. 


రాష్ట్రంలో మరో 5 రోజులు వర్షాలు

హైదరాబాద్‌ సిటీ, అక్టోబరు 7 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో మరో 5 రోజుల పాటు తేలికపాటి నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావారణ శాఖ తెలిపింది. గురువారం దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్‌, పరిసర ప్రాంతాల్లో ఉన్న ఉపరితల ఆవర్తనం శుక్రవారం తెలంగాణ, పరిసరాల్లోని విదర్భలో కొనసాగుతూ సముద్ర మట్టానికి 1.5 కి.మీ నుంచి 3.1 కి.మీ ఎత్తులో విస్తరించిందని పేర్కొంది. దీంతో తెలంగాణలోని పలు జిల్లాల్లో శుక్రవారం ఆకాశం మేఘావృతమై చిరుజల్లులు, మోస్తరు వర్షం కురిసిందని తెలిపింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని అంకంపాలెంలో అత్యధికంగా 4.3 సెం.మీ వర్షపాతం నమోదైందని పేర్కొంది. ఇదే జిల్లాలోని మందలపల్లిలో 3.7, నల్లగొండ జిల్లా జునుతులాలో 3.5, ఇదే జిల్లాలోని కోదండపురాంలో 3.6 సెం.మీ వర్షం కురిసిందని వెల్లడించింది. కాగా, రాగల 5 రోజులపాటు రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు ఉంటాయని వాతావరణశాఖ అధికారులు వెల్లడించారు. 

Updated Date - 2022-10-08T08:55:48+05:30 IST