ఏవీ రాలేదు

ABN , First Publish Date - 2022-06-30T06:40:20+05:30 IST

: వేసవి సెలవుల పూర్తయ్యాయి. 2022-23 విద్యా సంవత్సరం మొదలైంది. టీచర్లు బడి బాట పట్టారు.

ఏవీ రాలేదు
స్టాక్‌ పాయింట్‌కు వచ్చిన అరకొర పాఠ్య పుస్తకాలు

ఐదు రోజుల్లో బడిగంట

జిల్లాకు చేరని జగనన్న కిట్లు

అరకొరగా సెమిస్టర్‌-1 పుస్తకాలు

24.65 లక్షల పుస్తకాల్లో వచ్చింది 18 లక్షలే

బూట్లు, సాక్సులు, డిక్షనరీలు ఎప్పుడొస్తాయో..!


   అనంతపురం విద్య, జూన్‌ 29: వేసవి సెలవుల పూర్తయ్యాయి. 2022-23 విద్యా సంవత్సరం మొదలైంది. టీచర్లు బడి బాట పట్టారు. మరో 5 రోజుల్లో పిల్లలు సైతం స్కూళ్లకు వెళ్లాల్సిందే. బడి గంట కొట్టగానే పరుగులు తీయ్యాల్సిందే. వచ్చే నెల 5న  పాఠశాలలు పునఃపారంభం అవుతాయి. ఇక 5 రోజులు మాత్రమే ఉంది. అప్పటికల్లా జగనన్న విద్యాకానుక కిట్లు అందిస్తామని ప్రభుత్వం అంటోంది. కానీ కిట్లు ఇంకా జిల్లాకు చేరలేదు. పాఠ్యపుస్తకాలను సైతం స్కూళ్లకు చేర్చలేదు. సెమిస్టర్‌-1 పుస్తకాలు అరకొరగా వచ్చినా, స్కూల్‌ పాయింట్‌కు పోలేదు. జిల్లావ్యాప్తంగా ఉన్న విద్యార్థులకు 2.34 లక్షల బ్యాగులు, 2.34 లక్షల జతల బూట్లు, సాక్సులు, 42,091 డిక్షనరీలు అవసరం. ఇవేవీ జిల్లాకు చేరలేదు. ఇలా ఐతే ఎలా అని ఉపాధ్యాయులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.


సెమిస్టర్‌ విధానం.. ఇష్టారాజ్యం

జిల్లాలోని విద్యార్థులకు ఏటా పాఠ్యపుస్తకాలను సకాలంలో అందించే వారు. ఏ క్లాస్‌ పిల్లలకు.. ఆ క్లాస్‌ పుస్తకాలను సబ్జక్టుల వారీగా ఒకేసారి ఇచ్చేవారు. వైసీపీ ప్రభుత్వం వచ్చాక.. పుస్తకాలను సెమిస్టర్లుగా విభజించి, పలుమార్లు ముద్రించి సొమ్ము చేసుకుంటున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. మొదట్లో ఫస్ట్‌ సెమిస్టర్‌ పుస్తకాలు ఇవ్వడం, చివరలో హడావుడి చేసి కొన్ని సెమిస్టర్‌ పుస్తకాలు ఎగరగొట్టడం పరిపాటిగా మారింది. 2022-23 ఏడాదికి సెమిస్టర్‌-1కు 24,65,442 పాఠ్యపుస్తకాలు అవసరం. ఇప్పటి వరకూ   18,80,753 పుస్తకాలు మాత్రమే వచ్చాయి. ముద్రణాలయాల నుంచి జిల్లాకు వచ్చిన ఈ పుస్తకాలలో జిల్లా కేంద్రం నుంచి 31 మండలాలకు 14,49,956 పుస్తకాలను మాత్రమే సరఫరా చేశారు. సెమిస్టర్‌ -1కి ఇంకా 5,84,689 పాఠ్య పుస్తకాలు జిల్లాకు రావాల్సి ఉంది. మొదటి సెమిస్టర్‌ పుస్తకాల పరిస్థితే ఇలా ఉంటే, సెమిస్టర్‌ -2, -3 పుస్తకాల పరిస్థితి ఎలా ఉంటుందో అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గత ఏడాది సైతం పూర్తిస్థాయిలో సెమిస్టర్‌ 2, 3 పుస్తకాలు పిల్లలకు చేరలేదు. అదిగో.. ఇదిగో అంటూ కాలయాపన చేశారు. ఈ ఏడాది ఏం చేస్తారో అని టీచర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.


బూట్లు, బ్యాగులు ఏవీ..?

జగనన్న కిట్లలో సగానికి సగం జిల్లాకు రాలేదు. కొన్ని ఐటమ్స్‌ ఊసే లేదు. జిల్లాకు 12,11,026 నోట్‌ పుస్తకాలు, 1,76,361 బెల్టులు, 2,34,671 జతల బూట్లు, సాక్సులు అవసరం.  1వ తరగతి నుంచి  5వ తరగతి విద్యార్థులకు 19,139 పిక్టోరియల్‌ డిక్షనరీలు,  6వ తరగతి నుంచి 10వ తరగతి వరకూ 22,952 ఆక్స్‌ఫర్‌ ్డ డిక్షనరీలు,  2,34,671 మంది విద్యార్థులకు యూనిఫాం మెటీరియల్‌,  2,34,671 బ్యాగులు సరఫరా కావాల్సి ఉంది. పాఠశాలల పునఃప్రారంభం నాటికి వీటిని జిల్లాకు చేరిస్తేనే.. పంపిణీకి వీలుగా ఉంటుంది. ఇప్పటి వరకు నోట్‌ పుస్తకాలు, బ్యాగులు, బెల్టులు మాత్రమే, అవీ అరకొరగా వచ్చాయి. బూట్లు, సాక్సులు, డిక్షనరీలు జిల్లాకు చేరనేలేదు. 


అక్రమాలు కప్పిపుచ్చుకోడానికి..

జగన్న కిట్ల సరఫరాలో ఏటా గోల్‌మాల్‌ జరుగుతోంది.  నోట్‌ పుస్తకాల సరఫరాలో భారీగానే అక్రమాలు జరుగుతున్నాయి. బూట్లు, బ్యాగులు, డిక్షనరీలు.. ఎన్ని ఇస్తున్నారో కూడా అధికారులు ప్రకటించడం లేదు. ‘ఉన్నతాధికారులు చెప్పొద్దన్నారు. మేమే ఏమీ చెప్పం’ అని సమగ్రశిక్ష ప్రాజక్టు అధికారులు బాహాటంగానే అంటున్నారు. అధికార పార్టీ నేతల కనుసన్నల్లో సరఫరాదారులు, అధికారులు పనిచేస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. ఈ కారణంగానే జగన్న కిట్ల పంపిణీలో అక్రమాలు భారీగా జరుగుతున్నాయని సమాచారం. ఎక్కడ తమ అక్రమాలు బయటపడతాయోనని సమాచారాన్ని బయటకు పొక్కనివ్వడం లేదు. 



Updated Date - 2022-06-30T06:40:20+05:30 IST