మాటలు కాదు.. చేతలు కావాలి

ABN , First Publish Date - 2022-04-08T05:33:36+05:30 IST

ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ శుక్రవారం నంద్యాలకు వస్తున్నారు. జగనన్న వసతి దీవేన పథకాన్ని సీఎం ప్రారంభించనున్నారు. ఎస్పీజీ క్రీడా సభాస్థలిని ఏర్పాటు చేశారు.

మాటలు కాదు.. చేతలు కావాలి
ముఖ్యమంత్రికి స్వాగతం పలుకుతూ ఏర్పాటు చేసిన హోర్డింగ్‌లు

కర్నూలు జిల్లాలో ఆర్డీఎస్‌, వేదవతి పురోగతి ఏదీ?

గుండ్రేవుల జలాశయం నిర్మిస్తే 20 టీఎంసీల నిల్వ 

నంద్యాల జిల్లా పాలనకు శాశ్వత భవనాలు అవసరం

మెడికల్‌ కళాశాల నిర్మాణం తక్షణమే పూర్తి చేయాలి


కర్నూలు/నంద్యాల-ఆంధ్రజ్యోతి: ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ శుక్రవారం నంద్యాలకు వస్తున్నారు. జగనన్న వసతి దీవేన పథకాన్ని సీఎం ప్రారంభించనున్నారు. ఎస్పీజీ క్రీడా సభాస్థలిని ఏర్పాటు చేశారు. కర్నూలు, నంద్యాల జిల్లాల్లో ఎన్నో సమస్యలు వేధిస్తున్నాయి. పెండింగ్‌ ప్రాజెక్టులు పూర్తి కాలేదు. ప్రతిపక్ష నేతగా జగన్‌ పాదయాత్ర చేసినప్పుడు ఇచ్చిన హామీలు కూడా నెరవేరలేదు. దీంతో జగన్‌ మూడేళ్ల పాలనపై ఉమ్మడి జిల్లా వాసులు పెదవి విరుస్తున్నారు. ఈసారైనా కర్నూలు, నంద్యాల జిల్లాల సమస్యలు ఆలకించి పరిష్కరించాలని ప్రజలు కోరుతున్నారు. 


ఆర్డీఎస్‌, వేదవతి పూర్తి చేయాలి


మంత్రాలయం, ఎమ్మిగనూరు, కోడుమూరు నియోజకవర్గాల్లో 40 వేల ఎకరాలకు సాగునీరు, 1.2 లక్షల జనాభాకు తాగునీరు అందించే లక్ష్యంగా ఆర్డీఎస్‌ కుడి కాలువ చేపట్టారు. జస్టిస్‌ బ్రిజేష్‌కుమార్‌ ట్రిబ్యునల్‌ 4 టీఎంసీల తుంగభద్ర జలాలు కేటాయించింది. టీడీపీ హయాంలో రూ.1,985.42 కోట్లు కేటాయించి టెండర్లు పిలిచారు. హైదరాబాదుకు చెందిన ఎన్‌సీసీ సంస్థ పనులు చేపట్టింది. ప్రధాన కాలువ, కొటేకల్లు, కోసిగి, పెద్దకడుబూరు, చిన్నమరివీడు జలాశయాల నిర్మాణానికి భూసేకరణ పూర్తి కాలేదు. 0.5 శాతం పనులు కూడా పూర్తి కాలేదు. అలాగే.. ఆలూరు, ఆదోని నియోజకవర్గాల్లో 80 వేల ఎకరాలకు సాగునీరు, 1.5 లక్షల జనాభాకు తాగునీటిని అందించాలని వేదవతి ఎత్తిపోతల పథకం చేపట్టారు. రూ.1,94.80 కోట్లతో చేపట్టిన ఈ పనులు హైదరాబాద్‌కు చెందిన మెగా సంస్థ చేపట్టింది. ఈ ప్రాజెక్టులోనూ భూ సేకరణ సమస్య వేధిస్తోంది. మూడేళ్లు గడిచినా 6.48 శాతం పనులు చేసి రూ.104 కోట్లు ఖర్చు చేశారు. 


గుండ్రేవుల నిర్మాణం జరిగేనా?


కేసీ కెనాల్‌ ఆయకట్టు 2.65 లక్షల ఎకరాలు. 29.5 టీఎంసీల నికర జలాల వాటా ఉన్నా.. ఆ నీటిని నిల్వ చేసుకునే జలాశయం లేదు. ఏటేటా తుంగభద్రకు వరద తగ్గుతుండడంతో ఆయకట్టు రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. సుంకేసుల ఎగువన 20 టీఎంసీల సామర్థ్యంతో గుండ్రే వుల జలాశయం నిర్మాణానికి గత టీడీపీ ప్రభుత్వం రూ.2,980 కోట్లు మంజూరు చేస్తూ 2019 ఫిబ్రవరి నెలలో జీవో నం.153 జారీ చేసింది. ఎన్నికలకు ముందు ప్రతిపక్ష నేతగా సీఎం జగన్‌ పాదయాత్ర సమయంలో హామీ కూడా ఇచ్చారు. ఈ రిజర్వాయర్‌ నిర్మిస్తే.. కేసీ ఆయకట్టుకు సాగునీరు సహా కోడుమూరు, ఎమ్మిగనూరు, మంత్రాలయం నియోజ కవర్గాల్లో గురు రాఘవేంద్ర ఎత్తిపోతల పథకాలు, పులికనుమ, పులకుర్తి లిఫ్టు ద్వారా 1.25 లక్షల ఎకరాల వరకు సాగునీరు ఇవ్వవచ్చు. ప్రాధాన్యత ప్రాజెక్టుల్లో చేర్చినా.. ఈ మూడేళ్లల్లో ఒక్క అడుగు కూడా పడలేదు.


ఆడా ఏర్పాటు చేయాలి


పులివెందుల ఏరియా డెవలప్‌మెంట్‌ అఽథారిటీ (పాడా) తరహాలో ఆదోని, పత్తికొండ, ఆలూరు, ఎమ్మినూరు, మంత్రాలయం నియోజకవర్గాలను కలుపుతూ ‘ఆదోని ఏరియా డెవలప్‌మెంట్‌ అథారిటీ (ఆడా) ఏర్పాటు చేయాలి. తాగునీరు, సాగునీటి ప్రాజెక్టులు, రోడ్లు.. వంటి పనులు సహా నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించే ఐటీ సంస్థలు, పారిశ్రామిక అభివృద్ధికి చర్యలు తీసుకోవాలి. ప్రభుత్వ ఉన్నత విద్యా సంస్థలు నెలకొల్పాలి. 


ఆదోనికి హంద్రీ నీవా జలాల మళ్లింపుపై.. 


హంద్రీ నీవా ద్వారా కృష్ణా జలాలు ఆదోని, ఆలూరు, ఎమ్మిగనూరు నియోజకవర్గాలకు మళ్లించే ప్రాజెక్టుపై అధ్యయనం చేయాలి. పత్తికొండ సమీపం నుంచి ఆదోని మండలం డాణాపురం వద్ద ఉన్న నగరూరు చెరువుకు గ్రావిటీ ద్వారా మళ్లించాలి. అక్కడి నుంచి నాగనాథనహల్లి, ఇస్వీ చెరువులకు గ్రావిటీ ద్వారా మళ్లించవచ్చు. అలాగే.. సలకలకొండ సమీపంలో జలాశయం నిర్మించి నగరూరు చెరువు నుంచి ఎత్తిపోతల ద్వారా ఆ జలాశయం నింపి.. ఆదోని, ఎమ్మిగనూరు, ఆలూరు నియోజక వర్గాల్లోని పలు గ్రామాలకు తాగు, సాగునీరు ఇవ్వవచ్చని ఇంజనీర్లు అంటున్నారు. ఆ దిశగా సర్వే చేసి ప్రయోజనకరంగా ఉంటే తక్షణం చేపట్టాలని రైతులు కోరుతున్నారు. 


ఉల్లి, మిరప ప్రాసెసింగ్‌ యూనిట్లు ఏర్పాటు చేయాలి


కర్నూలు జిల్లాలో మిగిలింది వర్షాధారమైన మెట్ట వ్యవసాయమే. అనావృష్ఠి పరిస్థితుల వల్ల ఏటేటా రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. పత్తి 1.75 లక్షల హెకార్లు, మిరప 18 వేల హెక్టార్లు, ఉల్లి 15 వేల హెక్టార్లు, టమోటా 4-6 వేల హెక్టార్లు, రబీలో పప్పు శనగ 80 వేల హెక్టార్లు. జొన్న, సజ్జ, కొర్ర, సాములు.. వంటి మిల్లెట్‌ పంటలు దాదాపు 25-30 వేల హెక్టార్లలో విభజన కర్నూలు జిల్లాలో సాగు చేస్తున్నారు. మెట్ట రైతులను ఆదుకోవాలంటే ఆదోని డివిజన్‌లో ప్రతి నియోజకవర్గంలో ఉల్లి, టమోటా ప్రాసెసింగ్‌ యూనిట్లు, ఆదోని మార్కెట్‌ యార్డులో మిరప కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలి. మిల్లెట్‌ బోర్డు ఏర్పాటు చేసి చిరుధాన్యల సాగు ప్రొత్సాహించాలి. 


నిధులు ఇవ్వండి సారూ!


కొత్త జిల్లాగా ఆవిర్భవించిన నంద్యాలకు తొలిసారిగా వస్తున్న సీఎం జగన్‌మోహన్‌రెడ్డి ఎలాంటి వరాలు ఇస్తారోనని చర్చించుకుంటున్నారు. నిధుల మంజూరు, కార్యాచరణకు ఎలాంటి చర్యలు తీసుకుంటారోనని ఎదురు చూస్తున్నారు. 


టీడీపీ ప్రభుత్వ హయాంలో నంద్యాలలో గాంధీచౌక్‌ సెంటర్‌ నుంచి నూనెపల్లె ఓవర్‌ బ్రిడ్జి వరకు రోడ్ల వెడల్పు రూ.100కోట్ల వ్యయంతో పూర్తి చేశారు. అయితే కల్పనాసెంటర్‌ నుంచి ఆర్టీసీ బస్టాండ్‌ (భైర్మల్‌వీధి), గాంధీ చౌక్‌ నుంచి పెద్దబండ (బంగారు ఆంగళ్ల వీధి), గాంధీచౌక్‌ నుంచి ఆత్మకూరు బస్టాండ్‌ సర్కిల్‌ (కోటవీధి) వరకు రోడ్లను వెడల్పు చేయాలి. జిల్లా కేంద్రంగా నంద్యాల ఆవిర్భావంతో అత్యంత ప్రాధాన్యమైన ఈ రోడ్లను విస్తరించాల్సి ఉంది. 

నంద్యాలలో ప్రభుత్వ కార్యాలయాల శాశ్వత భవనాల నిర్మాణం చేపట్టాలి. ప్రస్తుతం తాత్కాలిక భవనాల్లో సౌకర్యాలు లేకుండా ఈనెల 4వ తేదీన జిల్లాను ప్రారంభించారు. ముఖ్యంగా 50ఎకరాల విస్తీర్ణంలో కొత్త కలెక్టరేట్లను నిర్మించి, ఒకేచోట అన్ని ప్రభుత్వ శాఖలు ఉండేలా చర్యలు తీసుకుంటామని సీఎం జగన్‌ ఇప్పటికే చెప్పారు. నంద్యాలలో 50ఎకరాల స్థలాన్ని ఎక్కడ సేకరిస్తారో ప్రశ్నార్థకంగా ఉంది. 

రాష్ట్రంలో కొత్తగా వైద్య కళాశాలలను మంజూరు చేస్తూ గత ఏడాది ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. నంద్యాలలో వైద్యకళాశాల కోసం వందేళ్లకు పైగా చరిత్ర కలిగిన ఆర్‌ఏఆర్‌ఎస్‌కు చెందిన 50ఎకరాలను కేటాయించారు. దీనిపై కొందరు హైకోర్టును ఆశ్రయించగా, కోర్టు స్టే విధించింది. అయినా జిల్లా ప్రభుత్వ ఆస్పత్రి ఆవరణలో శిలాఫలాకలు వేసి వైద్యకళాశాల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. వైద్యకళాశాలకు ఆర్‌ఏఆర్‌ఎస్‌ భూమి కాకుండా శివారులో ఉన్న ప్రభుత్వ భూములను కేటాయించాలని రైతు సంఘాలు డిమాండ్‌ చేస్తున్నాయి. 

నంద్యాల జిల్లా ప్రభుత్వ ఆస్పత్రి స్థాయిని 200పడకల నుంచి 300పడకల స్థాయికి పెంచాల్సి ఉంది. ఆస్పత్రిలో మౌలిక వసతులు కల్పనలో కూడా చర్యలు తీసుకోలేదనే విమర్శలు ఉన్నాయి. రూ.కోట్ల వ్యయంతో నిర్మాణంలో ఉన్న ఓపీడీ బిల్డింగ్‌ పనులు నిలిచిపోయాయి. వాటిని పూర్తి చేసేందుకు సరైన చొరవ తీసుకోలేదన్న విమర్శలు ఉన్నాయి. ఆస్పత్రి ప్రాంగణంలోనే డీఎంఅండ్‌ హెచ్‌వో కార్యాలయాన్ని ఏర్పాటు చేశారు. ఆస్పత్రిలో మౌలిక వసతులు కల్పించడంతో పాటు జిల్లాస్థాయి ఆస్పత్రికి తగ్గట్టుగా వైద్యులు, సిబ్బందిని నియమించాలి. 

నంద్యాల నూలుమిల్లు (పాణ్యం సమీపంలోని) మూతపడి మూడు దశాబ్దాలు కావస్తోంది. తిరిగి ప్రారంభించడానికి స్థానికులు, వివిధ పార్టీల నాయకులు డిమాండ్‌ చేస్తున్నా ఫలితం లేదు. నంద్యాల జిల్లా ఆవిర్భవించడం, ఇందులోకి పాణ్యం మండలం కూడా చేరడంతో నూలుమిల్లును పునః ప్రారంభించాలన్న డిమాండ్‌ ఉంది. దీనివల్ల ఎంతోమందికి ఉపాధి కలుగుతుందని చెబుతున్నారు.

పాణ్యం సమీపంలో విష్ణుప్రియ స్టీల్‌ ఫ్యాక్టరీ విషయమై కూడా ప్రభుత్వం చర్యలు చేపట్టాలన్న డిమాండ్‌ ఉంది. ఫ్యాక్టరీని నిర్మిస్తే కొత్త జిల్లా నంద్యాల పారిశ్రామికంగా అభివృద్ధి చెందే అవకాశం ఉందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. 

నంద్యాల పట్టణాన్ని భారీ వర్షాలప్పుడు ముంపు నుంచి కాపాడేందుకు శాశ్వత వరద నివారణ చర్యలు చేపట్టాల్సిఉంది. కాంగ్రెస్‌ ప్రభుత్వ హయాంలో ఈ పనుల కోసం రూ.100కోట్లు మంజూరు అయ్యాయి. పనుల జాప్యం వల్ల ఆ నిధులు తిరిగి వెనక్కి వెళ్లాయి. ఆ తరువాత పలుసార్లు నంద్యాల ముంపునకు గురైంది. పట్టణ సమీపంలోని కుందూనది, చామకాల్వ, మద్దిలేరు వరద ఉధృతి తగలకుండా శాశ్వత వరద నివారణ గోడల నిర్మాణం చేపట్టాలి. ఇందుకోసం నిధులు కేటాయించాలి. 

నంద్యాల మున్సిపాల్టీకి గతంలో అండర్‌ గ్రౌండ్‌ డ్రైనేజీ నిర్మాణం కోసం రూ.70కోట్లు మంజూరయ్యాయి. కాంట్రాక్టర్‌కు స్థానిక నాయకుల నుంచి కమీషన్ల వేధింపులు ఎక్కువ కావడంతో పనులు 10శాతం కూడా పూర్తి చేయలేదు. కొత్త జిల్లాగా నంద్యాల ఆవిర్భవించడంతో పట్టణాభివృద్ధిలో అత్యంత కీలకమైన అండర్‌గ్రౌండ్‌ డ్రైనేజీని నిర్మించాల్సిన అవసరం ఉంది. 

Updated Date - 2022-04-08T05:33:36+05:30 IST