భయపడే ప్రసక్తే లేదు

ABN , First Publish Date - 2021-10-20T05:25:40+05:30 IST

ధర్నాల పేర్లతో భయాందోళనలకు గురిచేయాలని ప్రయత్నిస్తే, భయపడే ప్రసక్తే లేదని, వైసీపీ శ్రేణుల దౌర్జన్యాలను అడ్డుకుంటామని టీడీపీ కడప పార్లమెంట్‌ అధ్యక్షుడు మల్లెల లింగారెడ్డి పేర్కొన్నారు.

భయపడే ప్రసక్తే లేదు
ప్రొద్దుటూరులో లింగారెడ్డి ఇంటి వద్ద ధర్నా చేస్తున్న వైసీపీ శ్రేణులు

వైసీపీ దౌర్జన్యాలను అడ్డుకుంటాం

టీడీపీ కడప పార్లమెంట్‌ అధ్యక్షుడు మల్లెల లింగారెడ్డి


ప్రొద్దుటూరు, అక్టోబరు 19 : ధర్నాల పేర్లతో భయాందోళనలకు గురిచేయాలని ప్రయత్నిస్తే, భయపడే ప్రసక్తే లేదని, వైసీపీ శ్రేణుల దౌర్జన్యాలను అడ్డుకుంటామని టీడీపీ కడప పార్లమెంట్‌ అధ్యక్షుడు మల్లెల లింగారెడ్డి పేర్కొన్నారు. వైసీపీ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ప్రొద్దుటూరులో మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ బంగారురెడ్డి నేతృత్వంలో వైసీపీ శ్రేణులు లింగారెడ్డి ఇంటి ఎదుట నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా బంగారురెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డిని టీడీపీ నేత పట్టాభి దూషించారని, ఇది ఇలాగే కొనసాగితే తస్మాత్‌ జాగ్రత్త అంటూ హెచ్చరించారు. ప్రతిపక్ష నేత చంద్రబాబు క్షమాపణ చెబుతూ, తమ పార్టీ నేత పట్టాభితో కూడా క్షమాపణ చెప్పించాలని డిమాండ్‌ చేశారు. వీరి ఆందోళన విషయం తెలుసుకున్న పోలీసులు లింగారెడ్డి ఇంటి వద్దకు చేరుకుని వైసీపీ శ్రేణులను పంపించేశారు. అనంతరం లింగారెడ్డి మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో పాలన సాగిస్తున్నది వైసీపీ అని, అలాంటి ప్రభుత్వంలోనే వైసీపీ శ్రేణులు టీడీపీ వారి ఇళ్లను ముట్టడించడం అవివేకమన్నారు. రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత అనేక మంది టీడీపీ నేతలను తప్పుడు కేసులు పెట్టి ఆరెస్టు చేసి, జైళ్లకు పంపారన్నారు. అసెంబ్లీలో ముఖ్యమంత్రి సాక్షిగా ప్రతిపక్షనేత చంద్రబాబునాయుడును, నీయమ్మ మొగుడంటూ దూషించిన మంత్రి కొడాలి నానిపై ఏ కేసులు పెట్టారని, ఆయనను ఎందుకు అరెస్టు చేయలేదంటూ లింగారెడ్డి ప్రశ్నించారు. డ్రగ్స్‌ దొరికిన వెంటనే ఎలాంటి విచారణ చేయకుండానే డ్రగ్స్‌ వ్యవహారంలో వైసీపీకి ఎలాంటి సంబంధం లేదంటూ స్వయంగా డీజీపీ చెప్పడం ఏంటన్నారు. భవిష్యత్తులో టీడీపీ శ్రేణుల ఇళ్ల వద్దకు ధర్నాకు వస్తే, బాహాబాహీకి సిద్ధమని ఆయన హెచ్చరించారు.


లింగారెడ్డి ఇంటివద్దకు టీడీపీ శ్రేణులు 

లింగారెడ్డి ఇంటి వద్ద వైసీపీ శ్రేణులు ధర్నా చేస్తున్న విషయం తెలుసుకున్న టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి డాక్టర్‌ జీవీ ప్రవీణ్‌కుమార్‌రెడ్డి నేతృత్వంలో టీడీపీ శ్రేణులు అక్కడకు వెళ్లేందుకు ప్రయత్నించారు. విషయం తెలుసుకున్న పోలీసులు వారిని మధ్యలోనే అడ్డుకున్నారు. దీంతో టీడీపీ నాయకులు రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. అనంతరం ప్రవీణ్‌కుమార్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ శాంతి ప్రొద్దుటూరును చేస్తామన్న ఎమ్మెల్యే ఇలాంటి దౌర్జన్యాలను ప్రోత్సహించడం సరికాదన్నారు. ఎమ్మెల్సీని బెదిరిస్తే ఇప్పటివరకు నిందితులను పట్టుకోలేకపోవడం పాలకుల చేతకానితనమన్నారు. టీడీపీ రాష్ట్రకార్యనిర్వాహక కార్యదర్శి వీఎస్‌ ముక్తియార్‌ మాట్లాడుతూ వైసీపీ శ్రేణులు పోలీసులు రాకపోతే, లింగారెడ్డిపై దాడికి దిగేవారన్నారు. రాష్ట్రంలో రాజారెడ్డి రాజ్యాంగం నడుస్తోందన్నారు. జగన్‌ జైలుకు వెళ్లే రోజులు దగ్గరపడ్డాయన్నారు. రాష్ట్రం శాంతియుతంగా ఉండాలని అలోచిస్తున్నామన్నారు. దౌర్జన్యాలకు దిగితే వైసీపీ శ్రేణులను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ పట్టణ అధ్యక్షుడు ఈవీ సుధాకర్‌రెడ్డి, కడప పార్లమెంట్‌ అధికార ప్రతినిధి దస్తగిరి, తెలుగు యువత నాయకులు నల్లబోతుల నాగరాజు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-10-20T05:25:40+05:30 IST