నిరాశ చెందక్కర్లేదు!

ABN , First Publish Date - 2020-12-05T09:22:56+05:30 IST

జీహెచ్‌ఎంసీ ఎన్నికల ఫలితాలపై నిరాశ చెందాల్సిన అవసరం ఏ మాత్రం లేదని టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మంత్రి కేటీఆర్‌ అన్నారు. 12

నిరాశ చెందక్కర్లేదు!

హైదరాబాద్‌, డిసెంబరు 4 (ఆంధ్రజ్యోతి): జీహెచ్‌ఎంసీ ఎన్నికల ఫలితాలపై నిరాశ చెందాల్సిన అవసరం ఏ మాత్రం లేదని టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మంత్రి కేటీఆర్‌ అన్నారు. 12-15 డివిజన్లలో స్వల్ప తేడాతో తమ అభ్యర్థులు ఓడిపోయారని చెప్పారు. గ్రేటర్‌లో అతిపెద్ద పార్టీ టీఆర్‌ఎస్సే అన్నారు. ప్రజాతీర్పుపై త్వరలో సమావేశమై సమీక్ష జరుపుతామని, ఫలితాలను విశ్లేషిస్తామని తెలిపారు. జీహెచ్‌ఎంసీ ఎన్నికల ఫలితాలపై తెలంగాణభవన్‌లో శుక్రవారం రాత్రి కేటీఆర్‌ మీడియాతో మాట్లాడారు.


‘‘జీహెచ్‌ఎంసీ ఎన్నికల ఫలితాలు మేం ఆశించిన విధంగా రాలేదు. ఇప్పుడొచ్చిన సీట్లకు మరో 20-25 అదనంగా వస్తాయని ఆశించాం. ఎగ్జిట్‌పోల్స్‌ కూడా టీఆర్‌ఎస్సే గెలుస్తుందని చెప్పాయి. కానీ, ఫలితాలు వేరుగా వచ్చాయి’’ అని కేటీఆర్‌ అన్నారు. గ్రేటర్‌ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థుల గెలుపునకు కృషి చేసిన టీఆర్‌ఎస్‌ నాయకులు, కార్యకర్తలు, సోషల్‌మీడియా యోధులకు కృతజ్ఞతలు తెలిపారు. టీఆర్‌ఎస్‌ అభ్యర్థులను గెలిపించిన ఓటర్లకు ధన్యవాదాలు తెలియజేశారు.


‘‘బీఎన్‌రెడ్డి కాలనీలో 18, మల్కాజిగిరిలో 70, మూసాపేటలో 100, మౌలాలిలో 200 ఓట్ల స్వల్ప తేడాతో మా పార్టీ అభ్యర్థులు ఓటమిపాలయ్యారు. 12-15 సీట్లలో స్వల్ప తేడాతో ఓడిపోయాం. ఈ ఫలితం వల్ల నిరాశ చెందాల్సింది ఏమీ లేదు. జీహెచ్‌ఎంసీలో అతిపెద్ద పార్టీగా టీఆర్‌ఎ్‌సను ప్రజలు ఆశీర్వదించారు. పార్టీ సమావేశం ఏర్పాటు చేసుకుని అన్ని విషయాలపై చర్చించి.. ఒక నిర్ణయం తీసుకుని ముందుకువెళ్తాం’’ అని కేటీఆర్‌ చెప్పారు.

మేయర్‌ అభ్యర్థి ఖరారుపై అడిగిన ప్రశ్నకు.. ఇంకా రెండు నెలల సమయం ఉందని, అప్పుడే తొందరపడాల్సిన అవసరంలేదని సమాధానం ఇచ్చారు.


Updated Date - 2020-12-05T09:22:56+05:30 IST