మూడు కాదు..వారం రోజులు

ABN , First Publish Date - 2022-05-14T05:50:54+05:30 IST

ప్రభుత్వం ఏర్పాటు చేసిన కేంద్రాల్లో ధాన్యం అమ్మిన రైతులకు డబ్బు చెల్లింపునకు వారంరోజులు పడుతున్నది.

మూడు కాదు..వారం రోజులు
సంగారెడ్డి జిల్లా కంది మండలంలోని కేంద్రంలో జరుగుతున్న ధాన్యం కొనుగోళ్లు

ధాన్యం అమ్మిన రైతులకు డబ్బు చెల్లింపుల్లో ఆలస్యం

రైస్‌ మిల్లులకు చేరాలి...ట్రక్‌ షీట్‌లో అప్‌లోడ్‌ చేయాలి

ఈ ప్రక్రియ  పూర్తవ్వడానికి వారం రోజులు తప్పనిసరి

ఇప్పటి వరకు 7,763 మెట్రిక్‌ టన్నుల ధాన్యం అమ్మిన 1,740 మంది రైతులు 


 ఆంధ్రజ్యోతి ప్రతినిధి, సంగారెడ్డి, మే 13: ప్రభుత్వం ఏర్పాటు చేసిన కేంద్రాల్లో ధాన్యం అమ్మిన రైతులకు డబ్బు చెల్లింపునకు వారంరోజులు పడుతున్నది. ధాన్యం విక్రయించిన రైతులకు 72 గంటల్లో (మూడు రోజుల్లో) డబ్బు చెల్లిస్తామని పాలకులు ప్రతి యేటా ప్రకటిస్తున్నారు తప్ప ఎక్కడా అమలుకావడం లేదు. 72 గంటలు కాస్తా 168 గంటల (వారం రోజుల) సమయం పడుతుంది. 


 ఏర్పాటైన 140 కేంద్రాలు

సంగారెడ్డి జిల్లాలో ఆ యాసంగిలో 35,262 ఎకరాల్లో వరిధాన్యం సాగు చేశారు. మొత్తం 84,600 మెట్రిక్‌ టన్నుల ధాన్యం దిగుబడి వచ్చినా 75వేల మెట్రిక్‌ టన్నుల ధాన్యం మాత్రమే అమ్ముతారని అధికార యం త్రాంగం అంచనా వేసింది. మిగిలిన తొమ్మిది వేల మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని విత్తనాల కోసం నిల్వ ఉంచనున్నట్లు అధికారులు తెలిపారు. అయితే ధాన్యం కొనుగోలుకు 155 కేంద్రాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఈ వారం రోజుల వ్యవధిలో 140 కేంద్రాలను ప్రారంభించారు.  మిగిలిన కేంద్రాలను కూడా మరో 2, 3 రోజుల్లో ప్రారంభిస్తామని అధికార వర్గాలు తెలిపాయి. 


ట్రక్‌షీట్‌తోనే

కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం అమ్మిన రైతులకు డబ్బు చెల్లించడంలో ట్రక్‌షీట్‌ కీలకంగా ఉన్నది. ప్రతీ కొనుగోలు కేంద్రం వద్ద సంబంధిత సంస్థ ఒక కంప్యూటర్‌ ఆపరేటర్‌ను నియమించుకున్నది. కేంద్రంలో రైతులు వరి ధాన్యం అమ్మగానే రైతు పూర్తి వివరాలతో పాటు విక్రయించిన ధాన్యం కంప్యూటర్‌ ఆపరేటర్‌ ట్రక్‌ షీట్‌లో నమోదు చేస్తున్నారు.   అనంతరం తమకు కేటాయించిన రైస్‌మిల్లులకు లారీల్లో తరలిస్తారు.  కొనుగోలు కేంద్రాలకు లారీలతో సరిపడా ధాన్యం వచ్చిన తర్వాతే మిల్లులకు పంపిస్తున్నారు.  రైస్‌ మిల్లులకు కంప్యూటర్‌ ఆపరేటర్‌ సంబంధిత ట్రక్‌ షీట్‌ను తీసుకెళ్లి యజమానులకు చూపించిన అనంతరం వారు ధాన్యాన్ని పరిశీలించి ఆమోదం తెలిపితే ఆ వివరాలను పౌర సరఫరాల సంస్థ కమిషనర్‌కు పంపిస్తారు. ఈ తతంగమంతా అవ్వడానికి కనీసం మూడు, నాలుగు రోజులైనా పడుతుంది. ఆ తర్వాత డబ్బు జమ అవ్వడానికి మరో 2, 3 రోజులు. అంటే మొత్తం వారం రోజుల సమయం పడుతుంది. 


రూ.3.6కోట్లు చెల్లింపు

కొనుగోలు కేంద్రాలు ఏర్పాటైన వారం పదిరోజుల్లో ధాన్యం అమ్మిన రైతుకు డబ్బులు చెల్లిచడంలో జాప్యం జరుగుతున్నది. ఇప్పటిదాకా 1740 మంది రైతులు 7763 మెట్రిక్‌ టన్నుల ధాన్యంను కొనుగోలు కేంద్రాల్లో అమ్మారు. 7109 మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని  రైస్‌ మిల్లులకు తరలించారు. ఇంకా 654 మెట్రిక్‌ టన్నుల ధాన్యం కొనుగోలు కేంద్రాల్లోనే నిల్వ ఉన్నది. ఇప్పటి వరకు రైతులు విక్రయించిన ధాన్యం విలువ రూ.15.22 కోట్లు కాగా, 409 మంది రైతులకు రూ.3.6కోట్లు చెల్లించారు. ఇంకా 1331 మంది రైతులకు రూ.11.62 కోట్లను చెల్లించాల్సి ఉన్నది.

Read more