సామాన్యుల బడ్జెట్ కాదు

ABN , First Publish Date - 2022-02-02T06:11:03+05:30 IST

కేంద్ర బిజెపి ప్రభుత్వం ఇచ్చే ప్రధాన నినాదం సబ్ కే సాథ్ -- సబ్ కా వికాస్! కానీ ఆచరణలో అందుకు భిన్నంగా, ఆర్థిక మంత్రి బడ్జెట్ ప్రతిపాదనలు ఉన్నాయి....

సామాన్యుల బడ్జెట్ కాదు

కేంద్ర బిజెపి ప్రభుత్వం ఇచ్చే ప్రధాన నినాదం సబ్ కే సాథ్ -- సబ్ కా వికాస్! కానీ ఆచరణలో అందుకు భిన్నంగా, ఆర్థిక మంత్రి బడ్జెట్ ప్రతిపాదనలు ఉన్నాయి. కార్పొరేట్ సంస్థలకు సానుకూలంగా, కార్పొరేట్ పన్నుపై సర్‌చార్జ్‌ను 12శాతం నుంచి 7శాతానికి తగ్గించారు. కానీ మధ్య తరగతి ఉద్యోగులు కోరుకున్నట్లుగా ఇన్‌కంటాక్స్ రాయితీ పరిమితి పెంచలేదు. స్లాబ్స్ యథాతథంగా కొనసాగించారు. ప్రజా వ్యతిరేకంగా ఎల్ఐసి ఐపీఓ త్వరలో వస్తుందని ప్రకటించారు. ఈ సందర్భంగా, జీఎస్టిని 18 శాతం నుండి తగ్గించాలన్న పాలసీదారుల విజ్ఞప్తిని మన్నించలేదు. జీవిత బీమా ప్రీమియంలకు ప్రత్యేక ఆదాయపు పన్ను రాయితీలు ఉండాలన్న కోరికనూ పట్టించుకోలేదు. పైపెచ్చు, ఎల్ఐసి షేర్లను విదేశీ కంపెనీలు కూడా కొనుక్కోవచ్చని చెబుతున్నారు.


ఏడేండ్లుగా అధికారంలో ఉన్న మోదీ ప్రభుత్వం, తన మాట మేరకు 14 కోట్ల ఉద్యోగాలు ఇప్పటిదాకా ఇచ్చి ఉండాలి. ఆ పని చేయకపోగా, వచ్చే ఐదేళ్లలో 60 లక్షల కొత్త ఉద్యోగాలు ఇస్తామని చెబుతోంది. పెట్రోలు, డీజిల్, నిత్యావసర వస్తువుల ధరలు అన్నీ పెరిగి ప్రజల జీవితం దుర్భరంగా మారింది. అయినా ధరల నియంత్రణకు, ఏ చర్యలనూ ఆర్థిక మంత్రి ప్రకటించలేదు. రైతులకు గిట్టుబాటు ధరలను చట్టబద్ధం చేసే రీతిలో ఏ చర్యలనూ ప్రకటించలేదు.


ఆర్థిక మంత్రి తన ప్రభుత్వ ధోరణికి అనుగుణంగానే ‘అపనే సాథ్ అపనా వికాస్’ బడ్జెట్ ప్రవేశపెట్టారనిపిస్తున్నది. 

ఎ. రఘునాథరెడ్డి

Updated Date - 2022-02-02T06:11:03+05:30 IST