తెలంగాణ పోలీస్‌ కాదు.. టీఆర్‌ఎస్‌ పోలీస్‌

ABN , First Publish Date - 2022-07-07T09:12:22+05:30 IST

రాష్ట్రంలో ఉన్నది తెలంగాణ పోలీస్‌ కాదని, టీఆర్‌ఎస్‌ పోలీస్‌ అని వైఎస్సాఆర్‌టీపీ అధ్యక్షురాలు షర్మిల విమర్శించారు.

తెలంగాణ పోలీస్‌ కాదు.. టీఆర్‌ఎస్‌ పోలీస్‌

  • పరాకాష్ఠకు ఎమ్మెల్యే సైదిరెడ్డి గుండాయిజం..
  • సోమన్నపై ఆయన బంధువులే దాడి చేశారు
  • పాదయాత్రను ఎలా అడ్డుకుంటారో చూస్తా: వైఎస్‌ షర్మిల


గరిడేపల్లి/ హుజూర్‌నగర్‌/ మఠంపల్లి, జూలై 6 : రాష్ట్రంలో ఉన్నది తెలంగాణ పోలీస్‌ కాదని, టీఆర్‌ఎస్‌ పోలీస్‌ అని వైఎస్సాఆర్‌టీపీ అధ్యక్షురాలు షర్మిల విమర్శించారు. భూకబ్జాలు, ధనార్జనే ధ్యేయంగా ఎమ్మెల్యే సైదిరెడ్డి గుండాయిజం పరాకాష్ఠకు చేరిందని అన్నారు. తమ నాయకుడు ఏపూరి సోమన్నపై దాడికి పాల్పడిన వారంతా ఎమ్మెల్యే సొంత మండలమైన మఠంపల్లి మండలానికి చెందిన వారేనని, వారిలో ఆయన ముఖ్య అనుచరులు, బంధువులు ఉన్నారని ఆరోపించారు. దాడి సమయంలో పోలీసులు ప్రేక్షకులపాత్ర వహించడం విడ్డూరంగా ఉందని విమర్శించారు. పాదయాత్ర ఎలా చేస్తారో చూస్తామంటూ స్వయంగా పోలీసులే బెదిరిస్తున్నారని, ఎలా అడ్డుకుంటారో చూస్తానని ఆమె సవాల్‌ విసిరారు. ప్రజాప్రస్థానం పాదయాత్రలో భాగంగా బుధవారం సూర్యాపేట జిల్లా హుజూర్‌నగర్‌ శ్రీనివాసపురం క్యాంపు నుంచి అమరవరం, హనుమంతులగూడెం మీదుగా గరిడేపల్లి మండలం కల్మలచెర్వుకు చేరుకుంది.


 ఈ సందర్భంగా ఆయా ప్రాంతాల్లో స్థానికులతో మాట-ముచ్చట నిర్వహించారు. బంగారు తెలంగాణ అని చెప్పి పోలీసులతో లూటీలు చేయిస్తోందని ఆరోపించారు. తాను రాజన్న బిడ్డనని, టీఆర్‌ఎస్‌ గుండాలు, రౌడీలకు భయపడేదాన్ని కాదన్నారు. ఎనిమిదేళ్ల పాలనలో కేసీఆర్‌ ఇచ్చిన ఏఒక్క హామీని నిలబెట్టుకోలేదని విమర్శించారు. రాష్ట్రంలో మద్యం ఏరులై పారుతోందన్నారు. డిగ్రీలు, పీజీలు చేసిన వారు సైతం కూలీలుగా మారడం బాధ కలిగిస్తోందని, ఇదేనా బంగారు తెలంగాణ అని ప్రశ్నించారు. కేసీఆర్‌ ఛాతిలో ఉన్నది గుండె కాదు, పెద్ద బండ అని వ్యాఖ్యానించారు. రాష్ట్రం లో మహిళల మాన ప్రాణాలకు రక్షణ లేదని, మైనర్లపై అత్యాచారాలు జరుగుతున్నా చర్యలే లేవన్నారు. ఇది తాలిబన్ల రాజ్యం, దొంగల రాజ్యం, దోపిడీ రాజ్యం గా అభివర్ణించారు. ఎన్నికల వేళ మళ్లీ మాయమాటలతో కేసీఆర్‌ వస్తాడని, గాడిదకు రంగు పూసి ఇదే ఆవు అంటాడని అన్నారు. కేసీఆర్‌ మోసపూరిత మాటలు నమ్మితే మన బిడ్డలే మనల్ని క్షమించరని పేర్కొన్నారు.  


పాదయాత్రకు మూడు రోజుల విరామం

ప్రజాప్రస్థానం పాదయాత్రలో ఉన్న షర్మిల మూడు రోజుల పాటు విరామం తీసుకోనున్నారు. ఈ నెల 8న దివంగత వైఎస్‌ రాజశేఖరరెడ్డి జయంతి సందర్భంగా ఇడుపులపాయలో జరిగే కార్యక్రమంలో ఆమె పాల్గొననున్నారు. ఈ నెల 10న పాదయాత్రను ఆమె పునః ప్రారంభిస్తారు.

Updated Date - 2022-07-07T09:12:22+05:30 IST