సానుభూతి కాదు...గౌరవం కావాలి!

ABN , First Publish Date - 2022-06-15T08:00:42+05:30 IST

‘‘సెక్స్‌వర్కర్లకు కావాల్సింది సానుభూతి కాదు, గౌరవంగా బతికే అవకాశం. అదే ‘మీ అండ్‌ మై వరల్డ్‌ నెట్‌వర్క్‌’ నినాదం కూడా.

సానుభూతి కాదు...గౌరవం కావాలి!

‘‘స్వచ్ఛందంగా సెక్స్‌వర్క్‌లోకి వచ్చిన మహిళలను అసంఘటిత కార్మికుల్లా చూడాలి. దీన్నొక గౌరవప్రదమైన వృత్తిగా ప్రకటించాలనేది’’ ‘మీ అండ్‌ మై నెట్‌వర్క్‌’ కన్వీనర్‌ పొట్లూరి దేవి డిమాండ్‌. అందుకోసం వారంతా కొన్నేళ్లుగా పోరాడుతున్నారు కూడా. సెక్స్‌వర్కర్ల పట్ల పోలీసుల తీరు మారాలంటూ సుప్రీంకోర్టు వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో వాళ్ల హక్కులకు సంబంధించిన పలు అంశాలు చర్చకు వచ్చాయి. ఈ సందర్భంగా జాతీయ సెక్స్‌వర్కర్ల నెట్‌వర్క్‌కు ప్రధాన కార్యదర్శిగా వాళ్ల పక్షాన ఉద్యమిస్తున్న దేవి సెక్స్‌వర్కర్ల జీవితాల్లోని బయట ప్రపంచానికి అంతగా తెలియని కొన్ని పార్శ్వాలను ‘నవ్య’కు చెబుతున్నారిలా.!


‘‘సెక్స్‌వర్కర్లకు కావాల్సింది సానుభూతి కాదు, గౌరవంగా బతికే అవకాశం. అదే ‘మీ అండ్‌ మై వరల్డ్‌ నెట్‌వర్క్‌’ నినాదం కూడా. నేను ఆ సంస్థకు కన్వీనర్ని. అందులో ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణలోని పాతికవేలమంది సెక్స్‌వర్కర్లు సభ్యులు. తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర, కేరళ లోని మిగతా నెట్‌వర్క్‌లతోనూ కలిసి పనిచేస్తున్నాం. మా వాళ్లంతా బలవంతంగా ఈ వృత్తిలోకి రాలేదు. కనుక వ్యభిచారం, మురికి కూపం వంటి పదాలు వాడద్దు అని సమాజాన్ని వేడుకుంటున్నాం. దీన్నొక పనిగా, మమ్మల్ని కార్మికులుగా గుర్తించమని చాలాకాలంగా పోరాడుతున్నాం. బతుకుదెరువు కోసమే సెక్స్‌వర్క్‌ను ఒక ఉపాధి మార్గంగా మలుచుకున్నారు. మాలోని చాలామంది ఇదేపని ద్వారా పిల్లలను ఇంజినీరింగ్‌, మెడిసిన్‌ వంటి పెద్ద పెద్ద చదువులు చదివించారు. అయితే, వారంతా శారీరక సుఖం కోసం ఈ మార్గంలోకి రాలేదు. కుటుంబ పరిస్థితులు, ఆర్థిక అవసరాల రీత్యా స్వచ్ఛందంగా సెక్స్‌వర్క్‌లోకి వచ్చారు.  


పోలీసుల తీరు మారాలి...

సెక్స్‌ వర్కర్లు అనగానే, ‘ఒళ్లు అమ్ముకొని బతికేబదులు, ఇళ్లల్లో పాచిపనిచేసుకొని బతకచ్చుకదా.!’ వంటి హితవులు పలికేవారికి కొదవలేదు. పోని! అలా చూసినా, రోజంతా కష్టపడితే వచ్చే అరకొర పైసలతో ఇల్లుగడుస్తుందా.! పిల్లల్ని చదివించగలరా.! భర్త బాధ్యతగా లేకపోవడం వంటి కారణాల వల్ల ఎక్కువగా ఇందులోకి వస్తుంటారు. పోలీసులు సెక్స్‌వర్కర్లను గౌరవంగా చూడాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. వాస్తవానికి పోలీసు శాఖలో కిందిస్థాయి నుంచి ఉన్నతాధికారుల వరకు, ప్రతి ఒక్కరికీ సెక్స్‌వర్కర్లు అంటే చాలా చిన్నచూపు. మానవ అక్రమరవాణా నిరోధక చట్టంలో సెక్స్‌వర్క్‌ను నేరంగా ప్రస్తావించలేదు. కాకుంటే, రోడ్డు మీద నిల్చొని పిలవడం వంటి కొన్ని అంశాలను చట్టవ్యతిరేక చర్యలుగా పొందుపరిచారు. ఆ సెక్షన్ల ఆధారంగా ఎక్కడైనా రైడ్‌ అయినప్పుడు, అరెస్టుచేసి రెస్క్యూ హోమ్‌లేదా రీహాబిలిటేషన్‌ సెంటర్లకు పంపుతున్నారు. ఇద్దరు మేజర్లు పరస్పర అంగీకారంతో శృంగారంలో పాల్గొనడం నేరంకాదని అత్యున్నత న్యాయస్థానం గతంలోనూ వెల్లడించింది. అయినా, మా వాళ్లను పట్టుకొని అక్రమ రవాణా ద్వారా ఈ వృత్తిలోకి వచ్చారనో లేదంటే న్యూసెన్స్‌ వంటి లేనిపోని కేసులు బనాయించి, పోలీసులు నానా హింస పెడుతున్నారు. పోలీసుల హింసకు వ్యతిరేకంగా స్వచ్ఛంద సంస్థలు ఎన్నో 

ఏళ్లుగా పోరాడబట్టి, ఇప్పుడు పరిస్థితి కాస్తంత నయం. అయినా, పోలీసుల తీరు చాలా మారాలి. సెక్స్‌వర్కర్లను సాటిమనుషులగా చూడాలి. అందుకు వాళ్లకు ప్రత్యేక అవగాహన తరగతులు అవసరం.


అప్పులు చేసి లాయర్లకు ఫీజు...

ఒకామె అరెస్టు అయ్యి, రీహాబిలిటేషన్‌ లేదా రెస్క్యూహోంకు వెళ్లిందంటే, తిరిగి తాను బయటకు ఎప్పుడు వస్తుందో తెలియని దయనీయ పరిస్థితి. పైగా ఆమె ఇంటికెళ్లి మరీ పోలీసులు సమాచారం ఇస్తారు. దాంతో ఆ కుటుంబం పడే మానసిక క్షోభ మాటల్లో వర్ణించలేనిది.! ఇరుగుపొరుగు నుంచి ఎదురయ్యే అవమానాలు, ఛీత్కారాల గురించి చెప్పనక్కర్లేదు.! ఈ మధ్య కాలంలో వైజాగ్‌, శ్రీకాకుళానికి చెందిన ఇద్దరిని హైదరాబాద్‌లో పోలీసులు అరెస్టు చేసి, అక్కడే ఒక రెస్క్యూ హోంలో ఉంచారు. ఇంటి వద్ద ఒంటరిగా మిగిలిన వాళ్ల పిల్లల పరిస్థితి ఏమిటని తలుచుకుంటేనే గుండె తరుక్కుపోతుంది. ఆ హోమ్‌ల నుంచి బయటకు రావాలంటే, లాయర్‌ ఫీజు తదితర ఖర్చులు ఏమైతేనేం... రూ.30వేల నుంచి లక్ష రూపాయల వరకు అవుతుంది. అంత మొత్తాన్ని అధిక వడ్డీకి అప్పు తెచ్చి కట్టి బయటకు వచ్చినా, తిరిగి అదే పని ద్వారా వాళ్లే ఆ బాకీ తీర్చాలి. అందుకే స్వచ్ఛందంగా సెక్స్‌వర్క్‌లోకి వచ్చిన మహిళలకు రీహాబిలిటేషన్‌ హోమ్‌లు అక్కర్లేదు. కనుక వాటిని ఎత్తేయమని అడుగుతున్నాం. 


లైసెన్స్‌లు అడగడంలేదు...

అక్రమరవాణా బాధితులను, ఇష్టపూర్వకంగా సెక్స్‌వర్క్‌లోకి వచ్చినవాళ్లను ఒకేగాటన కట్టద్దు అంటున్నాం. స్వచ్ఛందంగా ఇందులోకి వచ్చిన మహిళల బాధలు వేరు.! అలా అని మాకు లైసెన్స్‌లు ఇమ్మనడంలేదు. సెక్స్‌వర్కర్లమీద హింసను నిలువరించమని అడుగుతున్నాం. ఈ వృత్తిని నేరంగా చూడద్దని కోరుతున్నాం. వీళ్ల వల్ల హెచ్‌ఐవీ వంటి లైంగిక వ్యాధుల వ్యాప్తి తీవ్రమవుతుందని కొందరి వాదన. నిజానికి ఎయిడ్స్‌ నియంత్రణ ఉద్యమంలో సెక్క్‌వర్కర్లు భాగం కావడం వల్లే మంచి ఫలితాలు వచ్చాయి. వాళ్లు కండోమ్‌ వాడకం మీద అవగాహన పెంపొందించారు. మా నెట్‌వర్క్‌లో సుమారు రెండు వేలమంది హెచ్‌ఐవీ బాధితులున్నారు. వారికి ప్రతినెలా మందులు అందిస్తున్నాం.  జీవనోపాధి శిక్షణ ఇప్పించి, ఉపాధి అవకాశాలు చూపిస్తున్నాం. 


ఫ కె. వెంకటేశ్‌

ఫొటోలు: ఉమా మహేశ్వరరావు, గుంటూరు 


గుర్తింపు కార్డు అడగకుండానే సెక్స్‌వర్కర్లకు రేషన్‌ ఇవ్వాలని సుప్రీంకోర్టు ప్రత్యేకంగా నియమించిన ప్యానెల్‌ రాష్ట్ర ప్రభుత్వాలను కోరింది. దాంతో పాటు కొన్ని సిఫార్సులను కూడా జారీచేసింది. అయితే, అందులో కొన్నింటిని మాత్రమే ప్రభుత్వాలు సమ్మతించాయి. వృత్తితో సంబంధంలేకుండా, ప్రతి ఒక్కరికి రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 21 ప్రకారం గౌరవంగా జీవించే హక్కుందని దేశ అత్యున్నత న్యాయస్థానం గుర్తుచేయడం హర్షణీయం. సెక్స్‌వర్కర్ల పట్ల పోలీసుల తీరు మారాలంటూ సూచించడం మంచి పరిణామం. అయితే, సెక్స్‌వర్క్‌ను సుప్రీంకోర్టు చట్టబద్ధం చేసిందన్న ప్రచారంలో నిజం లేదు. 


‘మీ అండ్‌ మై వరల్డ్‌’ అంటే... నేను బావుంటే, నా ప్రపంచం సంతోషంగా ఉంటుందని అర్థం. మా నెట్‌వర్క్‌లోని సభ్యులంతా స్వచ్ఛందంగా సెక్స్‌వర్క్‌లోకి వచ్చినవారే.! వారెవ్వరూ ఇతరులను ఇందులోకి రమ్మని ప్రోత్సహించరు. అక్రమరవాణాను అనుమతించరు. ఇరవై ఏళ్లలోపు వారెవ్వరైనా ఈ వృత్తిలోకి వస్తే, వాళ్లను మా నెట్‌వర్క్‌ సభ్యులు అడ్డుకున్న సంఘటనలు చాలానే ఉన్నాయి.  సెక్స్‌వర్క్‌ ను కేవలం బతుకుదెరువు కోసమే కానీ ఆదాయవనరుగా మా వాళ్లెవరూ చూడరు. కనుకే ఏ ఒక్క సెక్స్‌ వర్కర్‌ కూడా తన బిడ్డలను ఇందులోకి ఇంతవరకు దించలేదు, ఇకపై దించదు కూడా.! 

Updated Date - 2022-06-15T08:00:42+05:30 IST