అద్దె లేదు.. కరెంటు బిల్లు కట్టరు

ABN , First Publish Date - 2021-02-28T05:36:34+05:30 IST

జిల్లా పరిషత్‌ ఆవరణలో ప్రైవేటు, ప్రభుత్వ కార్యాలయాలకు అనువైన స్థలాలు, కార్యాలయాలను అద్దెకు ఇచ్చారు.

అద్దె లేదు.. కరెంటు బిల్లు కట్టరు

  1. జడ్పీ భవనాల్లో అద్దె చెల్లించని పలు శాఖల కార్యాలయాలు
  2. కరెంటు బిల్లులూ జడ్పీ నుంచే చెల్లింపు
  3. తహసీల్దారు కార్యాలయానికి ఉచితం
  4. మంత్రి క్యాంపు కార్యాలయమూ అంతే..!


కర్నూలు(న్యూసిటీ), ఫిబ్రవరి 27: జిల్లా పరిషత్‌ ఆవరణలో ప్రైవేటు, ప్రభుత్వ కార్యాలయాలకు అనువైన స్థలాలు, కార్యాలయాలను అద్దెకు ఇచ్చారు. ప్రైవేటు సంస్థలు మాత్రం ప్రతి నెలా అద్దె చెల్లిస్తున్నాయి. కొన్ని ప్రభుత్వ శాఖలు అద్దె చెల్లించక పోగా, కరెంటు బిల్లులు కూడా కట్డడం లేదని జడ్పీ అధికారులు వాపోతున్నారు. జడ్పీ ఆస్తులను అద్దెకు ఇవ్వడం ద్వారా వచ్చే ఆదాయన్ని జడ్పీ సాధారణ నిధులలో జమ చేస్తారు. పాత జడ్పీ కార్యాలయంలో కొన్ని భాగాలను ప్రభుత్వ కార్యాలయాలకు ఇచ్చారు. అందులో మెగా సీడ్‌ పార్క్‌ కార్పొరేషన్‌ ఒకటి. ఆ సంస్థ కార్యాలయం కోసం గదులను అద్దెకు తీసుకున్నా, ఇప్పటి వరకు ఒక్కపైసా కూడా అద్దె చెల్లించలేదు. కరెంటు బిల్లు మాత్రమే చెల్లించారు.  తహసీల్దారు, కార్మిక శాఖ మంత్రి క్యాంప్‌ కార్యాలయం కూడా ఇక్కడే ఉన్నాయి.  ఈ రెండు కార్యాలయాలకు అద్దె, కరెంటు బిల్లులు చెల్లించడం లేదు. పంచాయతీ రాజ్‌ శాఖ కార్యాలయాలకు అద్దె లేకుండా గదులు ఇవ్వవచ్చని నిబంధనలు చెబుతున్నాయి. ఇతర కార్యాలయాలు ఏవి ఏర్పాటు చేసినా తప్పకుండా అద్దె చెల్లించాలి. జిల్లా పరిషత్‌కు ప్రత్యేక అధికారి కలెక్టర్‌ కావడంతో తహసీల్దారు కార్యాలయానికి అనధికారికంగా అద్దెకు ఇచ్చినట్లు విశ్వసనీయ సమాచారం. 

మెగాసీడ్స్‌ పార్క్‌ కార్పొరేషన్‌ కార్యాలయానికి 2018 అక్టోబరు 4న భవనాన్ని 25 నెలల కాల పరిమితికి అద్దెకు ఇచ్చారు. ప్రతి నెలా రూ.20 వేలు అద్దె చెల్లించాలని ఉత్తర్వులు జారీ చేశారు. ఇప్పటి వరకు ఒక్కపైసా కూడా అద్దె చెల్లించలేదు. సుమారు రూ.5 లక్షల వరకు అద్దె బకాయి ఉందని అధికారులు చెబుతున్నారు.

అర్బన్‌ తహసీల్దారు కార్యాలయం కోసం గత సంవత్సరం అనధికారికంగా భవనాన్ని అద్దెకు ఇచ్చారు. రెవెన్యూ శాఖ నుంచి ఇప్పటి వరకు అద్దె రావడం లేదు. కరెంటు బిల్లు కూడా చెల్లించడం లేదు. ప్రతి నెల సుమారు రూ.1300 నుంచి రూ.1400 దాకా జడ్పీ సాధారణ నిధుల నుంచి  చెల్లింపులు జరుగుతున్నాయి.

కార్మిక శాఖ మంత్రి గుమ్మనూరు జయరాం క్యాంపు కార్యాలయం కోసం 2019 సంవత్సరంలో అద్దెకు ఇచ్చారు. ఇప్పటి వరకు అద్దె చెల్లించలేదు. కరెంటు బిల్లు కూడా జడ్పీ సాధారణ నిధుల నుంచే చెల్లిస్తున్నారు. క్యాంప్‌ కార్యాలయం ఏర్పాటు చేసినప్పటి నుంచి ఇప్పటి వరకు మంత్రి ఒక్కసారి కూడా కార్యాలయానికి రాలేదని అధికారులు చెబుతున్నారు. అలాంటప్పుడు ఇతర శాఖకు అద్దెకు ఇస్తే జడ్పీకి ఆదాయం వస్తుందని కొందరు అంటున్నారు. 

ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంకు, జిల్లా పరిషత్‌  ఆవరణ ముందు భాగంలో సైన్‌ బోర్డ్సు, కొత్త జడ్పీ భవనం పక్కన బీఎస్‌ఎన్‌ఎల్‌ టవర్‌ ఏర్పాటు చేశారు. వీటికి సంబంధించి ప్రతి నెలా అద్దె వస్తోంది. 


ప్రభుత్వానికి నివేదిక పంపాము..

మెగా సీడ్స్‌పార్కు కార్పొరేషన్‌ నుంచి అద్దె రావాల్సి ఉందని ప్రభుత్వాకి ఇప్పటికి రెండు సార్లు నివేదిక పంపాము. ఇతంత వరకు స్పందన రాలేదు. తహసీల్దారు కార్యాలయానికి కలెక్టర్‌ అనుమతి ఇచ్చారు. మిగతా వాటి గురించి జడ్పీ అధికా రులతో చర్చించి త్వరలోనే నిర్ణయం తీసుకుంటాము. - ఎం.వెంకట సుబ్బయ్య, జడ్పీ సీఈవో

Updated Date - 2021-02-28T05:36:34+05:30 IST