ఒకటి కాదు... రెండు కాదు... ఏడు!

ABN , First Publish Date - 2022-02-06T05:30:00+05:30 IST

‘ఏ నిమిషానికి ఏమి జరుగునో..’ అనే పాటే..‘ఏ రోజుకి.. ఏ సినిమా వచ్చునో...’ అని మార్చి పాడుకుంటోంది టాలీవుడ్‌....

ఒకటి కాదు... రెండు కాదు... ఏడు!

‘ఏ నిమిషానికి ఏమి జరుగునో..’ అనే పాటే..‘ఏ రోజుకి.. ఏ సినిమా వచ్చునో...’ అని మార్చి పాడుకుంటోంది టాలీవుడ్‌. ఎందుకంటే పరిస్థితులు అలా ఉన్నాయి. తెలుగు సినిమాల రిలీజ్‌ డేట్ల విషయంలో ఇంకా కన్‌ఫ్యూజన్‌ కొనసాగుతూనే ఉంది. ఎప్పుడు ఏ సినిమా వస్తుందో, ఏ సినిమా వాయిదా పడుతుందో చెప్పలేని పరిస్థితి. దాదాపు పెద్ద సినిమాలన్నీ రిలీజ్‌ డేట్లు ప్రకటించేసినా.. ఇంకా ఏదో గందరగోళం. ఒక సినిమా వాయిదా పడినా, ఆ ప్రభావం మిగిలిన సినిమాలపై, రిలీజ్‌ డేట్లపై పడుతోంది. దాంతో.. అవి కూడా వాయిదా వేసుకోవాల్సివస్తోంది. ఇది టాలీవుడ్‌కి తలనొప్పిగా మారుతోంది. 


ఏ సినిమాకైనా ఓ రిలీజ్‌ డేట్‌ అంటూ ఉంటుంది. కానీ అదేంటో విచిత్రంగా రెండు మూడు రిలీజ్‌డేట్లు ప్రకటించి కన్‌ఫ్యూజ్‌ చేస్తున్నారు నిర్మాతలు. నాని అయితే ఏకంగా తన కొత్త సినిమా ‘అంటే... సుందరానికి’ కోసం ఏడు డేట్లు లాక్‌ చేశాడు. ఇది తెలుగులో కొత్త పోకడ. ఏప్రిల్‌ 22, 29.. మే 6, 20, 27, జూన్‌లో అయితే....3 లేదా 10... ఇవన్నీ ‘సుందరం...’ రిలీజ్‌ డేట్లే. ఈ ఏడు డేట్లలో ఎప్పుడైనా నాని సినిమా రావొచ్చు. ‘భీమ్లా నాయక్‌’, ‘గని’, ‘రామారావు ఆన్‌ డ్యూటీ’ సినిమాలకూ రెండేసి డేట్లే. నిజానికి ఈ తలనొప్పి అంతా ‘ఆర్‌.ఆర్‌.ఆర్‌’ వల్ల వచ్చింది. రెండు రిలీజ్‌ డేట్ల పోకడకు తెర తీసింది ఈ సినిమానే. సంక్రాంతికి రావాల్సిన సినిమా ఇది. పరిస్థితులు బాగోక.. వాయిదా పడింది. ఆ తరవాత ‘మార్చి 18, లేదంటే ఏప్రిల్‌ 28న మా సినిమా విడుదల చేస్తాం..’ అని ప్రకటించారు. ‘ఆర్‌.ఆర్‌.ఆర్‌’ బాటలోనే మిగిలిన సినిమాలూ నడవాల్సివచ్చింది.


‘భీమ్లా నాయక్‌’ కూడా రెండు డేట్లు లాక్‌ చేసింది. ఫిబ్రవరి 25, లేదంటే ఏప్రిల్‌ 1న ‘భీమ్లా..’ రాబోతున్నాడు. ‘గని’ కూడా అంతే. వస్తే.. ఫిబ్రవరి 25.. లేదంటే మార్చి 4. ‘భీమ్లా...’ ఈనెల 25న వస్తే... ‘గని’ వెనక్కి వెళ్తుంది. లేదంటే.. ఫిబ్రవరి 25న వచ్చేస్తుంది. రవితేజ కొత్త సినిమా కూడా ఇలాంటి డైలామాలోనే ఉంది. మార్చి 25న ఈ సినిమాని విడుదల చేయాలని నిర్ణయించారు. కానీ.. ఆ రోజు ‘ఆర్‌.ఆర్‌.ఆర్‌’ కోసం లాక్‌ చేశారు. దాంతో.. ‘రామారావు’ కూడా గందరగోళంలో పడింది. ఈ చిత్రాన్ని మార్చి 25 లేదంటే.. ఏప్రిల్‌ 15న విడుదల చేయబోతున్నట్టు చిత్రబృందం ప్రకటించింది. 


ఈ సినిమాల్లానే ‘ఆచార్య’ కూడా చాలాసార్లు వాయిదా పడుతూ వస్తోంది. ఇప్పటికే అరడజను సార్లు రిలీజ్‌డేట్‌ పోస్టర్లు వేసింది ‘ఆచార్య’. కానీ పరిస్థితులు అనుకూలించలేదు. ఫిబ్రవరి 4న వస్తాం అనిచెప్పి ఏప్రిల్‌ 1కి షిఫ్ట్‌ అయ్యారు. ఇప్పుడు ఏప్రిల్‌ 29న విడుదల చేస్తామని ప్రకటించారు. అయితే ఒక రోజు ముందు అంటే.. ఏప్రిల్‌ 28న ‘ఎఫ్‌ 3’ రాబోతోంది. రెండు పెద్ద సినిమాలు ఒక రోజు వ్యవధిలో రావడం.. సినీ ప్రేమికులకు సంతోషకరమైన విషయమే అయినా, సినిమాకు మంచిది కాదు. థియేటర్ల సమస్య ఎదురవుతుంది. వసూళ్లని పంచుకోవాల్సి వస్తుంది. అందుకే.. ఈ రెండు సినిమాల్లో ఏదో ఒకటి తగ్గే అవకాశం ఉందని ట్రేడ్‌ వర్గాల అభిప్రాయం. 


విడుదల తేదీ ప్రకటించడం, ఆ తరవాత వాయిదా వేయడం ‘రాధే శ్యామ్‌’కి అలవాటుగా మారింది. అయితే.. ఈ విషయంలో చిత్ర బృందం తప్పేమీ లేదు. పరిస్థితులు అంతలా పగబట్టాయి. ఎప్పుడు విడుదల చేద్దామన్నా.. కరోనానే అడ్డంకిగా మారేది. మార్చి 4, లేదంటే మార్చి 11న ‘రాధేశ్యామ్‌’ ని  రిలీజ్‌ చేద్దామనుకున్నారు. ఇప్పుడు మార్చి 11 ఫిక్సయ్యింది. ‘సర్కారు వారి పాట’ కూడా వాయిదాల పరంపర కొనసాగించింది. చివరకు మే 12న రాబోతోంది.




అయితే ఇవి పక్కానా... అంటే సమాధానం దొరకదు. రిలీజ్‌ డేట్ల ప్రహసనం పేక మేడల ఆటని గుర్తుకు తెస్తోంది. పేక మేడ ఎంత ఎత్తుగా ఉన్నా, ఒక ముక్క జరిపితే చాలు, అది కుప్పకూలిపోతుంది. ఇదీ అంతే. ఒక సినిమా వాయిదా పడితే, మళ్లీ అన్ని సినిమాలూ విడుదల తేదీని మార్చుకోవాల్సివస్తుంది. ఇదంతా నిర్మాతల తప్పు కూడా కాదు. పరిస్థితులు అలా ఉన్నాయి. కరోనా ప్రభావం, నైట్‌ కర్ఫ్యూల వల్ల పెద్ద సినిమాలు భయపడ్డాయి. తమ ఆదాయానికి గండిపడుతుందన్న అనుమానంతో విడుదల తేదీలు వాయిదా వేశాయి. ఆంధ్రాలో టికెట్‌ రేట్ల విషయంలో ఇంకా ఓ స్పష్టత రాలేదు. ఈ వ్యవహారం ఇంకా కోర్టులోనే ఉంది. ప్రభుత్వం పెద్ద మనసు చేసుకుని, టికెట్‌ రేట్లు పెంచితే, పెద్ద సినిమాలకు వెసులుబాటు కలుగుతుంది. ప్రభుత్వం నుంచి ఏదో ఓ సమాధానం వచ్చేంత వరకూ వేచి చూడాలన్నది నిర్మాతల అభిప్రాయం. ఫిబ్రవరి దాటినా, ఈ విషయంలో పురోగమనం లేకపోతే, మళ్లీ ఈ సమస్య మొదటికి వస్తుంది. కొంతమంది నిర్మాతలైతే.. ‘ఏదోలా విడుదల చేసేద్దాం’ అనుకుంటున్నారు. అందుకే ఇప్పటికీ.. టాలీవుడ్‌లో కొత్త సినిమాల కళ కనిపిస్తోంది. ఫిబ్రవరి దాటితే గానీ, వేసవి సినిమాల విషయంలో ఓ స్పష్టత రాదు.

Updated Date - 2022-02-06T05:30:00+05:30 IST