పాండిత్యం కాదు.. ప్రజ్ఞ కావాలి

ABN , First Publish Date - 2020-11-16T08:24:07+05:30 IST

ఒకరోజు ఖహోదుడు గట్టిగా ఉచ్చస్వరంతో వేదపఠనం చేస్తున్నాడు. ఇంతలో.. ‘ఆపెయ్‌’ అంటూ ఒక సన్నని మధుర స్వరం వినిపించింది.

పాండిత్యం కాదు.. ప్రజ్ఞ కావాలి

ఒకరోజు ఖహోదుడు గట్టిగా ఉచ్చస్వరంతో వేదపఠనం చేస్తున్నాడు. ఇంతలో.. ‘ఆపెయ్‌’ అంటూ ఒక సన్నని మధుర స్వరం వినిపించింది. చుట్టూ చూశాడు ఖహోదుడు. ఎవరూ కనిపించలేదు. అక్కడ తాను, తన భార్య సుజాత తప్ప మరెవరూ లేరు. తపోదృష్టితో పరిశీలిస్తే.. భార్య సుజాత గర్భంలోని శిశువు మాట్లాడుతున్నట్టు అర్థమైంది. ఖహోదుడు తేరుకునే లోపే లోపలి నుంచి శిశువు తన మాటలను కొనసాగించాడు. 


‘‘అదంతా నిరర్థకం. నిర్జీవం. యాంత్రికం. కేవలం పదాడంబరం, చైతన్య రహితం, ప్రజ్ఞారహిత పఠనం. సత్యం మన అంతరంగ స్థితం. పదాల్లో ఉన్నది వాగాడంబరం. దీనివల్ల మీరు ప్రజ్ఞను తెలుసుకోలేరు. సత్యమార్గం వైపు వెళ్లలేరు’’


అని బోధించాడు. ఇలా ఆ చిన్న స్వరం వినిపిస్తుంటే.. హెచ్చరిస్తుంటే.. ఖహోదుడు తేరిపార చూశాడు. అమ్మ కడుపులో నుంచే.. నిత్యం తన వేదపఠనాన్ని విన్న శిశువు ఈరోజు తనవంటి మహాపండితుణ్నే అడ్డుకొంటున్నాడని భావించాడు. తండ్రినే ఆపుతున్న ఆ బిడ్డపై కోపం వచ్చింది. గర్వం కట్టలు తెగింది. అందుకే తన కొడుకున్న ప్రేమను కూడా మరచి.. ‘నన్నే ఆక్షేపిస్త్ను నీవు అష్టవంకర్లతో జన్మింతువు గాక’ అని శపించాడు. కోపం, గర్వం కలగలవడంతో ఓ మహాజ్ఞాని శపించబడ్డాడు. ఎనిమిది వంకర్లతో పుట్టిన ఆ శిశువు.. ‘అష్టావక్రుడు’ అయ్యాడు. ఆగ్రహం, అహం ఎంత దారుణ కాలకూట విషాలో కదా!! అంగవికృతి గల శరీరంతో, వంగిన వీపుతో, అందవికారంగా జన్మించిన ఆ బాలుడు.. చూడడానికే భయంకరంగా ఉన్నాడు. దెబ్బతిన్న అహం, పెల్లుబికిన క్రోధంతో ఖహోదుడు తన బిడ్డనే శపించాడు. అయితే.. వేదం చదవడం తప్పా? అష్టావక్రుడు ఆక్షేపించింది వేదపఠనాన్నేనా? అని చాలా మందికి సందేహం వస్తుంది. చాలాసార్లు మనం అలాగే అపార్థం చేసుకుంటాం. ఏదైనా ఒక విషయం జరిగినప్పుడు దాని అంతరార్థాన్ని తెలుసుకోకుండా పైపైన చూసి అపార్థం చేసుకోవడం మానవ సహజం. అష్టావక్రుడి ఆక్షేపణ వేదపఠనంపై కాదు. ఆయన ప్రజ్ఞావాది. సాక్షిగా జీవించాలని మనల్ని ఆదేశిస్తున్నాడు. 


రమణ మహర్షి దాన్నే.. ‘నేను’ను కనుక్కోవడం అన్నారు. ఆ ఎరుక కలిగాక పదార్థ విజ్ఞానంలో అణువణువూ మైక్రోస్కో్‌పలో కనిపించినట్లు అలాంటివాళ్లకు అంతా దర్శనమవుతుంది. మనం అనేక పనులు చేసేటప్పుడు మన వ్యక్తిత్వాన్ని (నేను)ను కోల్పోతాం. కేవలం ఆ పనే జ్ఞప్తిలో ఉంటుంది. ఒక మధుర పదార్థం తిన్నాక అది మాయమై దాని రుచి మాత్రమే మిగిలినట్టు! అదే ఈ ప్రజ్ఞలో రహస్యం. జ్ఞానంలో సమాచారం ఉంటుంది. నేను అన్న అహంభావం ఉంటుంది. అందుకే ఆయన దార్శనికుడు. మనోవాక్కాయ కర్మలకు అతీతుడిగా జీవించమంటాడు. ఇక తెలుసుకొన్న తర్వాత పొమ్మంటాడు. ధ్వనులతో, శబ్దాలతో జీవించవద్దు అంటాడు. అది కూడా ఒక స్థాయిలో భౌతికవాదమే. అనుభూతి మార్గంలో, దర్శనమార్గంలో నడవాలని సూచిస్తాడు. అదే అష్టావక్రుడి అంతరంగం.

-డా.పి.భాస్కర యోగి

Updated Date - 2020-11-16T08:24:07+05:30 IST