జైలు కాదు.. బెయిల్‌!

ABN , First Publish Date - 2022-07-22T07:25:29+05:30 IST

ఆల్ట్న్యూస్ సహవ్యవస్థాపకుడు మహమ్మద్ జుబైర్ కు బెయిల్ మంజూరు చేసే విషయంలో సుప్రీంకోర్టు చూపిన చొరవ, ఇచ్చిన ఆదేశాలు స్వాగతించదగ్గవి....

జైలు కాదు.. బెయిల్‌!

ఆల్ట్ న్యూస్ సహవ్యవస్థాపకుడు మహమ్మద్ జుబైర్ కు బెయిల్ మంజూరు చేసే విషయంలో సుప్రీంకోర్టు చూపిన చొరవ, ఇచ్చిన ఆదేశాలు స్వాగతించదగ్గవి. ఢిల్లీకోర్టు బెయిల్ ఇచ్చినా ఆయన ఇంకా జైల్లోనే ఉండాల్సి వచ్చిన దుస్థితిని దృష్టిలో పెట్టుకొని ఆయనపై నమోదైన అన్ని కేసుల్లోనూ సర్వోన్నత న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది. యూపీలోనే ఆయనపై ఏడుచోట్ల ఎఫ్ఐఆర్‌లున్న నేపథ్యంలో అన్నింటినీ కట్టకట్టి ఢిల్లీ పోలీసు స్పెషల్ సెల్‌కు బదిలీ చేయాలన్నది. ఇదే అంశంమీద భవి ష్యత్తులో నమోదయ్యే కేసులకు కూడా బెయిల్, బదిలీ నియమాలు వర్తిస్తాయని ముందుగానే చెప్పడం, యూపీ ప్రభుత్వపు ‘సిట్’ను రద్దుచేయడం ప్రశంసనీయమైనవి. జుబైర్‌ను జైల్లోనే కొనసాగించాల్సినంత బలమైన అవసరాలు, కారణాలు కనిపించడం లేదని వ్యాఖ్యానించడం, ఒకే అంశంమీద వరుసఎఫ్ఐఆర్‌ల నమోదును ఒక విషవలయంగా, జుబైర్‌ను నిరంతరం జైల్లో మగ్గేట్టు చేసే పన్నాగంగా అభివర్ణించడం ప్రశంసనీయమైనవి. నిజాన్ని నిగ్గుతేల్చే ఓ వ్యక్తి చుట్టూ బిగిసిన ఉచ్చును న్యాయమూర్తులు చక్కగానే గుర్తించారు. 


జుబైర్ జర్నలిస్టు కాదనీ, విషం చిమ్మడం, ఓ వర్గం ప్రయోజనాలను దెబ్బతీయడమే ఆయన పని అని పాలకుల వాదన. ప్రతీ ట్వీటుకు ఆయనకు భారీగా డబ్బు వస్తుందనీ, ఎంత రెచ్చగొట్టే ట్వీటు చేస్తే అంత సొమ్ము ముడుతుందనీ, కోట్లు సంపాదించాడనీ ప్రభుత్వం తరఫు న్యాయవాది అంటున్నారు. విషం చిమ్మి డబ్బు సంపాదిస్తున్నాడన్న ఈ ఆరోపణలకు ప్రభుత్వం దగ్గర ఏ ఆధారాలున్నాయో తెలియదు. అసలు ఆరోపణకు, విదేశీ విరాళాల చట్టం ఉల్లంఘనను కూడా చేర్చినందున ఈ విషయంలో ప్రభుత్వం ముందుచూపుతోనే వ్యవహరిస్తోందని అనుకోవాలి. సుప్రీంకోర్టు మాత్రం జుబైర్‌ను పాత్రికేయుడుగానే సంబోధించింది. ఇకపై ట్వీట్లు చేయకుండా నిషేధించాలన్న యూపీ అభ్యర్థనను తోసిపుచ్చుతూ, జర్నలిస్టును రాయొద్దని చెప్పడం, న్యాయవాదిని వాదించవద్దని అనడంతో సమానమన్న వ్యాఖ్య దీటైన జవాబు. ఆయన చేయబోయే ట్వీట్లకు ఆయనదే బాధ్యత అన్నవ్యాఖ్య హక్కులూ బాధ్యతల గురించి ప్రజలకు మాత్రమే కాదు, పాలకులకు వారి సేవకులకూ కూడా తెలియచెబుతుంది.


పాలకుల మనసులు తరచూ గాయపడుతూ ఎఫ్ఐఆర్‌లు విరివిగా నమోదవుతున్న కాలంలో సుప్రీంకోర్టు వ్యాఖ్యలు ఆశలు రేకెత్తిస్తున్నాయి. అరెస్టును అరుదుగా వాడుతూండండి అన్నది హితవు మాత్రమే కాదు, హెచ్చరిక కూడా. సుప్రీంకోర్టు పలుమార్లు చెప్పిన ఆ మాటను ప్రభుత్వపెద్దలు పెడచెవిన పెట్టి వీరంగం వేస్తున్న దశలో, న్యాయస్థానాలు కనీసం వెంటనే బెయిల్ మంజూరు చేయడం అవసరం. ముఖ్యంగా, వాక్ స్వాతంత్ర్యం వంటి కనీస హక్కుల విషయంలో అవి చొరవచూపించవచ్చు. హింసకు నేరుగా కారణమైన వ్యాఖ్యలనూ, ప్రభుత్వాలు ఆరోపణ మాత్రమే చేస్తున్న జుబైర్ తరహా కేసులకూ ఉన్న తేడా వాటికి తెలియకపోదు. బెయిల్ వచ్చి నిందితుడు జైలునుంచి బయటకు పోగానే చాలా కేసులు కొనసాగవు కూడా. పాలకుల లక్ష్యం తమకు వ్యతిరేకంగా పనిచేస్తున్నవారిపై కక్ష తీర్చుకోవడం, బెయిల్ రాకుండా జైళ్ళలో ఏళ్ళతరబడి మగ్గేట్టుచేయడమే కనుక, తక్షణ బెయిల్ ఖాయమని తెలిసొచ్చినప్పుడు ఈ తరహా కేసులు కూడా తగ్గిపోతాయి. వరుస కేసులు పెట్టడం, పదిహేను రోజులు కస్టడీ కోరడం వంటి విన్యాసాలకు స్వస్తిచెప్పవలసింది న్యాయస్థానాలే. విచారణకు ముందే సుదీర్ఘకాలం జైల్లో ఉండటం కంటే పెద్ద శిక్ష ఏదీ లేదు.


విశ్వాసాలు, గౌరవాలు, దేశప్రయోజనాలు వంటి ఉన్నతమైన మాటలతో గిట్టనివారిని మాత్రమే వేటాడుతున్న కాలం ఇది. తాము తలుచుకుంటే, ఎవరినైనా, ఏ ఆరోపణతోనైనా జైల్లో కుక్కగలమని పాలకుల నమ్మకం. ఆరోపణలు ఎదుర్కొంటున్న ఐఏఎస్ అధికారి పూజా సింఘాల్‌తో కేంద్రహోంమంత్రి అమిత్ షా ఉన్న ఫోటోను ట్వీట్ చేసినందుకు సినీప్రముఖుడు అవినాశ్ దాస్‌ను అహ్మదాబాద్ పోలీసులు అరెస్టుచేయడం, ఢిల్లీ పెద్దలను సంతోషపెట్టడానికి ఆ పార్టీ రాష్ట్రనేతలు ఎంతగానో తాపత్రయపడతారనడానికి ఉదాహరణ. ముందుగా అరెస్టుచేయడం, ఆ తరువాత తాపీగా ఆధారాలకోసం అన్వేషించడం ఇప్పుడు విరివిగా జరిగిపోతున్నది. ‘బెయిలు సహజం, జైలు అరుదు’ అన్న హితవు ఎప్పటినుంచో వింటున్నప్పటికీ అది ఆచరణలో కనిపించని స్థితిలో, జుబైర్ కేసులో సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యలను, చూపిన చొరవనూ అన్ని న్యాయస్థానాలు గుర్తించి, అనుసరించడం అవసరం. సుప్రీంకోర్టు ఇటీవల ఆశించిన బెయిల్ చట్టం అన్నది రూపొందితే ఈ ఆశ మరింత చక్కగా నెరవేరుతుంది.

Updated Date - 2022-07-22T07:25:29+05:30 IST