AMUL పని అయిపోయనట్లేనా.. ఎందుకింత అనాసక్తి..!?

ABN , First Publish Date - 2021-10-23T05:45:30+05:30 IST

‘అమూల్‌’కు పాలు పోసేందుకు జిల్లాలోని పాడి రైతులు పెద్దగా ఆసక్తి చూపడం లేదు. దీంతో గ్రామ స్థాయిలో సంఘాల ఏర్పాటు ప్రభుత్వం ఆశించిన విధంగా ముందుకు సాగడం లేదు.

AMUL పని అయిపోయనట్లేనా.. ఎందుకింత అనాసక్తి..!?

  • పాల సంఘాల్లో సభ్యులుగా చేరేందుకు..
  • ముందుకురాని జిల్లాలోని మహిళా రైతులు
  • గ్రామాల్లో నత్తనడకన సంఘాల ఏర్పాటు
  • పక్షం రోజుల్లో కేవలం 124 మాత్రమే ఏర్పాటు
  • లక్ష్యం 6,400
  • వేగం పెంచాలంటూ ప్రభుత్వం ఒత్తిడి
  • ఏం చేయాలో పాలుపోక తలలు పట్టుకుంటున్న అధికారులు

(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)

‘అమూల్‌’కు పాలు పోసేందుకు జిల్లాలోని పాడి రైతులు పెద్దగా ఆసక్తి చూపడం లేదు. దీంతో గ్రామ స్థాయిలో సంఘాల ఏర్పాటు ప్రభుత్వం ఆశించిన విధంగా ముందుకు సాగడం లేదు. అమూల్‌ కోసం 6,400 గ్రూపులు ఏర్పాటుచేయాలని ప్రభుత్వం లక్ష్యంగా నిర్దేశించింది. ఈ నేపథ్యంలో పక్షం రోజుల క్రితం జిల్లాలో ఎంపిక చేసిన పది మండలాల్లో మహిళా పాడి రైతులతో గ్రూపుల ఏర్పాటుకు అధికారులు నడుంబిగించారు. అయితే గ్రూపుల్లో చేరేందుకు మహిళా రైతులు సుముఖత చూపడం లేదు. ఒక గ్రూపు ఏర్పాటు చేయడానికి 11 మంది ఉండాలి. కొన్నిచోట్ల మహిళలు విడివిడిగా సహకార బ్యాంకుల్లో ఖాతాలు తెరిచినా గ్రూపు విషయానికి వచ్చేసరికి 11 మంది లేకపోవడంతో ప్రతిష్టంభన నెలకొంటుంది.


గ్రూపుల ఏర్పాటుకోసం ముమ్మారు మహిళలను కలుస్తున్నా...అనుకున్నంత స్పందన లేదని అధికారులు, సిబ్బంది వాపోతున్నారు. ప్రస్తుతం తాము పాలు పోస్తున్న డెయిరీతో తమకు ఎటువంటి ఇబ్బందులు లేవని అటువంటప్పుడు ‘అమూల్‌’లో సభ్యులుగా ఎందుకు చేరాలని అత్యధికులు ప్రశ్నిస్తున్నారు. ‘ఏళ్ల తరబడి ఒకే డెయిరీకి పాలు పోస్తున్నాం...సదరు డెయిరీ యాజమాన్యం పాల సేకరణ విషయంలో పారదర్శకత చూపకపోవడం కొంతవరకూ వాస్తవమే. అయితే మాకు...ఆవులు, మేత కొనుగోలుకు వడ్డీ లేని రుణాలు ఇస్తోంది. విద్య, వైద్యానికి సాయం చేస్తోంది. ఇంట్లో పిల్లల పెళ్లిళ్లకు రూ.పది వేలు సాయం అందజేస్తోంది. అటువంటప్పుడు ఆ డెయిరీని కాదని అమూల్‌కు ఎందుకు పాలు పోయాలి?...’ అంటూ ప్రశ్నిస్తున్నారు.


పోసిన పాలకు పది రోజులకొకసారి చెల్లింపులు జరుపుతారు తప్ప ఇతరత్రా రాయితీలు అమూల్‌ కంపెనీ ఇవ్వదు...కదా? అని కొందరు మహిళలు అడుగుతున్నారు. వారికి ఏం సమాధానం చెప్పాలో అర్థంకాక అధికారులు, సిబ్బంది తలలు పట్టుకుం టున్నారు. గ్రూపుల ఏర్పాటుకు తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే గ్రామాల్లో అధికారులు, సిబ్బంది పర్యటించడానికి ముందే ప్రైవేటు డెయిరీకి చెందిన సిబ్బంది వెళ్లి పాలుపోసే రైతులను కలుస్తున్నారు. రైతుకు అనేక రకాలుగా సాయం అందిస్తున్న డెయిరీని కాదని కొత్త కంపెనీకి వెళ్లడం వల్ల ప్రయోజనం వుండదని చెబుతున్నారు. ఇందుకోసం   డెయిరీతోపాటు దాని అనుబంధ సంస్థల్లో ఉద్యోగాలు చేస్తున్న వ్యక్తులను గ్రామాలకు పంపిస్తున్నారు.  


124 సంఘాలు ఏర్పాటు

జిల్లాలో తొలి విడత పది మండలాల పరిధిలోని 233 గ్రామాల్లో ‘అమూల్‌’ కోసం పాల సేకరణ చేపట్టాలని నిర్ణయించారు. ఇందుకు 21 రూట్లను గుర్తించారు. ఈ నేపథ్యంలో పది మండలాల్లో 32 వేల మంది పాడి రైతులతో 6,400 గ్రూపులు ఏర్పాటుకు ప్రతిపాదించారు. అయితే ఇప్పటివరకూ 1,178 మంది (124 గ్రూపులు) మాత్రమే బ్యాంకుల్లో అకౌంట్లు ప్రారంభించారు. పదకొండు మంది సభ్యులుంటే తప్ప గ్రూపు అకౌంట్‌ ప్రారంభం కాదు. ఈ లెక్కన 6,400 గ్రూపులు ఏర్పాటుచేయాలంటే...ఎన్ని నెలలు పడుతుందోనని అధికారులు ఆందోళన చెందుతున్నారు. మరోవైపు వీలైనంత త్వరగా పాల సేకరణకు ఏర్పాట్లు చేయాలని ఉన్నతాధికారుల నుంచి ఒత్తిడి వస్తోంది. ఈ నేపథ్యంలో జిల్లాలో రెండు నెలల నుంచి అమూల్‌ పాల సేకరణను వాయిదా వేస్తూ వచ్చిన అధికారులు ఈ పర్యాయం ఏదోవిధంగా ప్రారంభించాలని చూస్తున్నారు. వచ్చే నెల తొలి వారంలో పాల సేకరణను ప్రయోగాత్మకంగా చేపట్టాలని యోచిస్తున్నారు. అయితే ప్రకాశం, చిత్తూరు జిల్లాల్లో మాదిరిగా అట్టహాసంగా ప్రారంభించి, ఆ తరువాత చేతులెత్తేస్తారా?, లేదా దీర్ఘకాలం కొనసాగిస్తారా అన్నది కాలమే నిర్ణయించాలని అధికారి ఒకరు వ్యాఖ్యానించారు. 

Updated Date - 2021-10-23T05:45:30+05:30 IST