డీపీఆర్‌ కోసం కాదు..నిర్మాణ పనులే

ABN , First Publish Date - 2021-09-09T07:43:10+05:30 IST

రాయలసీమ ఎత్తిపోతల పథకం ప్రతిపాదిత ప్రాంతంలో జరిగిన పనులు చూస్తుంటే అవి సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్‌) రూపకల్పన కోసం చేసినట్లు కనిపించడం లేదని జాతీయ హరిత ట్రైబ్యునల్‌ (ఎన్‌జీటీ) వ్యాఖ్యానించింది. ...

డీపీఆర్‌ కోసం కాదు..నిర్మాణ పనులే

రాయలసీమ ఎత్తిపోతల పథకం పనులపై

జాతీయ హరిత ట్రైబ్యునల్‌ వ్యాఖ్య

కేంద్ర పర్యావరణ శాఖ నివేదికపై అసంతృప్తి

ప్రాజెక్టు పనులు పూర్తిగా ఆపాలన్న గవినోళ్ల

వ్యతిరేకించిన ఏపీ సీనియర్‌ న్యాయవాది

ప్రాసిక్యూషన్‌ అధికారం ట్రైబ్యునల్‌కు

ఉందో లేదో వాదనలు వినిపిస్తామని వెల్లడి

తదుపరి విచారణ 16కి వాయిదా


న్యూఢిల్లీ, సెప్టెంబరు 8 (ఆంధ్రజ్యోతి): రాయలసీమ ఎత్తిపోతల పథకం ప్రతిపాదిత ప్రాంతంలో జరిగిన పనులు చూస్తుంటే అవి సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్‌) రూపకల్పన కోసం చేసినట్లు కనిపించడం లేదని జాతీయ హరిత ట్రైబ్యునల్‌ (ఎన్‌జీటీ) వ్యాఖ్యానించింది. ఆ పనులు ప్రాజెక్టు నిర్మాణానికి పునాదులు తీసే స్థాయిలో ఉన్నాయని సామాన్యుడికి కూడా అర్థమవుతుందని పేర్కొంది. ట్రైబ్యునల్‌ ఉత్తర్వులను ఉల్లంఘించి ఆంధ్ర ప్రభుత్వం ప్రాజెక్టు పనులు చేపడుతోందని తెలంగాణలోని నారాయణపేట జిల్లాకు చెందిన గవినోళ్ల శ్రీనివాస్‌, తెలంగాణ ప్రభుత్వం వేర్వేరుగా దాఖలు చేసిన కోర్టు ధిక్కరణ పిటిషన్లపై బుధవారం ఎన్‌జీటీ న్యాయ సభ్యుడు జస్టిస్‌ కె.రామకృష్ణన్‌, సభ్య నిపుణుడు కె.సత్యగోపాల్‌తో కూడిన ద్విసభ్య ధర్మాసనం విచారణ జరిపింది.


కేంద్ర పర్యావరణ శాఖ అందించిన నివేదికపై అసంతృప్తి వ్యక్తం చేసింది. తీర్పును ఉల్లంఘిస్తున్నారో లేదో సమాచారమివ్వాలని తాము ఆదేశిస్తే.. ఏపీ ప్రభుత్వం పనులు ఆపేసిందంటూ నివేదిక ఇచ్చారని, పనులు ఆపేశామని రాష్ట్ర ప్రభుత్వమే చెబుతున్నప్పుడు మీరు కొత్తగా చెప్పేదేంటని పర్యావరణ శాఖను ప్రశ్నించింది. గవినోళ్ల తరఫున న్యాయవాది శ్రవణ్‌ కుమార్‌ వాదనలు వినిపిస్తూ.. పనులు నిలిపివేశామని ఏపీ ప్రభుత్వం చెబుతోంది కాబట్టి ప్రాజెక్టులు పనులు చేపట్టినట్లు అంగీకరించినట్లేనని తెలిపారు. తాము పిటిషన్‌ వేశాకే పనులు నిలిపివేశారని, పిటిషన్‌ వేసి ఉండకపోతే ప్రాజెక్టును పూర్తి చేసేవారని ఆరోపించారు. ప్రాజెక్టు పనులు పూర్తిగా నిలిపివేస్తూ ఉత్తర్వులు జారీ చేయాలని కోరారు. దీనిని ఏపీ ప్రభుత్వ సీనియర్‌ న్యాయవాది వెంకటరమణి వ్యతిరేకించారు. పనులు ఇప్పటికే నిలిపివేశామని, తాను అధికారులతో మాట్లాడానని, తన వాదనను రికార్డు చేసుకోవాలని.. ఉత్తర్వులు ఇవ్వవద్దని అభ్యర్థించారు. సమగ్ర నివేదిక కోరాలని శ్రవణ్‌ కుమార్‌ కోరగా.. వెంకటరమణి విభేదించారు. ప్రాసిక్యూట్‌ చేసే అధికారం ట్రైబ్యునల్‌కు ఉన్నదీ లేనిదీ తాము న్యాయపరంగా వాదనలు వినిపిస్తామని తెలిపారు.


అప్పటి వరకు కొత్త నివేదికలు కోరవద్దని.. కొత్తగా కమిటీలను కూడా పంపించవద్దని విజ్ఞప్తి చేశారు. దాంతో తదుపరి విచారణను ధర్మాసనం ఈ నెల 16కు వాయిదా వేసింది. కాగా.. ఎత్తిపోతల పనులు ఇప్పటికీ జరుగుతున్నాయని, నిఘా వర్గాలను పంపించి సమాచారాన్ని తెప్పించామని తెలంగాణ అదనపు అడ్వకేట్‌ జనరల్‌ రామచందర్‌రావు తెలిపారు. ట్రైబ్యునల్‌ అనుమతిస్తే డ్రోన్ల ద్వారా వాస్తవిక సమాచారాన్ని అందిస్తామన్నారు. ధర్మాసనం జోక్యం చేసుకుని.. ‘మీరు వాళ్ల ప్రాజెక్టులపై డ్రోన్లను తిప్పితే.. వాళ్లు కూడా మీ ప్రాజెక్టులపైకి డ్రోన్లను పంపిస్తారు’ అని వ్యాఖ్యానించింది.

Updated Date - 2021-09-09T07:43:10+05:30 IST