గుడులు, మసీదులను తవ్వడం కాదు..

ABN , First Publish Date - 2022-05-27T05:26:58+05:30 IST

‘గుడులు, మసీదులను గడ్డపారతో తవ్వడం కాదు... నిన్ను ఎంపీగా గెలిపించిన నియోజకవర్గ ప్రజలపై అభిమానం ఉంటే కేంద్రం నుంచి పెద్ద ఎత్తున నిధులు తెచ్చి అభివృద్ధి చేయాలి.. ఇలా రెచ్చగొట్టే విధ్వంసకర వాఖ్యలు చేయడం సరికాదు.. గౌరవ ప్రదమైన ఎంపీ హోదాలో కొనసాగుతూ మత విద్వేషాలు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడం దురదృష్టకరం’ అని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాలశాఖమంత్రి గంగుల కమలాకర్‌ అన్నారు.

గుడులు, మసీదులను తవ్వడం కాదు..

 - నిధులు తెచ్చి అభివృద్ధి చేయాలి 

- రెచ్చగొట్టే విధ్వంసకర వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలి

- బండి సంజయ్‌పై మంత్రి గంగుల ఫైర్‌ 

కరీంనగర్‌ టౌన్‌, మే 26: ‘‘గుడులు, మసీదులను గడ్డపారతో తవ్వడం కాదు... నిన్ను ఎంపీగా గెలిపించిన నియోజకవర్గ ప్రజలపై అభిమానం ఉంటే కేంద్రం నుంచి పెద్ద ఎత్తున నిధులు తెచ్చి అభివృద్ధి చేయాలి.. ఇలా  రెచ్చగొట్టే విధ్వంసకర వాఖ్యలు చేయడం సరికాదు..  గౌరవ ప్రదమైన ఎంపీ హోదాలో కొనసాగుతూ మత విద్వేషాలు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడం దురదృష్టకరం’ అని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాలశాఖమంత్రి గంగుల కమలాకర్‌ అన్నారు. సీఎం కేసీఆర్‌ పాలనలో రాష్ట్రంలో మత కలహాలు లేకుండా శాంతిభద్రతలు అదుపులో ఉన్నాయని, ఇక్కడ జరుగుతున్న అభివృద్ధిని చూసి ఓర్వలేక రాజకీయ లబ్ధి కోసం చేసిన  రెచ్చగొట్టే విధ్వంసకర వ్యాఖ్యలను సంజయ్‌ వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. గురువారం కరీంనగర్‌లోని బీరప్ప ఆలయంలో నిర్మించతలపెట్టిన కమ్యూనిటీ హాల్‌ నిర్మాణానికి మంత్రి గంగుల కమలాకర్‌తో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి గంగుల మాట్లాడుతూ తాము అభివృద్ధి చేసి ఓట్లు అడిగితే బండి సంజయ్‌ మత విద్వేషాలను రెచ్చగొట్టి ఓట్లు అడుగుతున్నారని విమర్శించారు. గుజరాత్‌లో ఇలాంటి నాయకులు చేసే ఇలాంటి వ్యాఖ్యలతో శాంతిభద్రతల దృష్ట్యా ఆ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ఎవరూ ముందుకు రావడం లేదని అన్నారు. తెలంగాణ ఏర్పాటుకు ముందు ఇక్కడ కర్ఫ్యూలు, బంద్‌లతో శాంతిభద్రతల సమస్య ఉండేదని, అందుకే అప్పుడు అభివృద్ధి జరుగలేదని, కేసీఆర్‌ పాలనలో శాంతిభద్రతలకు సమస్య లేనందున పెద్ద ఎత్తున హైదరాబాద్‌లో కంపెనీలు నెలకొల్పేందుకు ముందుకు వస్తున్నారని చెప్పారు. సీఎం కేసీఆర్‌ పాలనలో కరీంనగర్‌లో ఎటు చూసినా అభివృద్ధి పనులు జరుగుతున్నాయని, వందల కోట్లతో అభివృద్ధి పరుగులు పెడుతుందని మంత్రి గంగుల అన్నారు. కరీంనగర్‌ను దేశచిత్రపటంలో ప్రముఖంగా నిలిపేందుకు కేబుల్‌ బ్రిడ్జి, మానేరు రివర్‌ ఫ్రంట్‌ను నిర్మిస్తూ పర్యాటకంగా అభివృద్ధి చేసేందుకు కృషిచేస్తున్నామని చెప్పారు. మరోవైపు ఇక్కడి విద్యార్థుల కోసం మెడికల్‌ కాలేజీని, ఉన్నత విద్యనభ్యసించిన యువతకు ఇక్కడే ఉద్యోగావకాశాలు కల్పించేందుకు ఐటీ టవర్‌ను నిర్మించామని చెప్పారు. కార్యక్రమంలో మేయర్‌ వై సునీల్‌రావు, కార్పొరేటర్లు గందె మాధవి మహేశ్‌, దిండిగాల మహేశ్‌, తోట రాములు, ఐలేందర్‌యాదవ్‌, నాయకులు ఎడ్ల అశోక్‌, కర్రె రాజు, కర్రె పావని పాల్గొన్నారు. 

Updated Date - 2022-05-27T05:26:58+05:30 IST