తగ్గని ఆయిల్‌ ధరలు

ABN , First Publish Date - 2022-08-10T06:34:45+05:30 IST

కేంద్ర ప్రభుత్వం వంట నూనెల ధరలు తగ్గిపోతున్నాయని ప్రకటనల మీద ప్రకటనలు ఇస్తోంది.

తగ్గని ఆయిల్‌ ధరలు
ఆన్‌లైన్‌లో తక్కువకు లభిస్తున్న వంటనూనెలు

ఇంకా లీటరు రూ.180కే అమ్మకాలు

ఆన్‌లైన్‌లో రూ.154 నుంచి రూ.165కి లభ్యం

పట్టని విజిలెన్స్‌ అధికారులు


(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)

కేంద్ర ప్రభుత్వం వంట నూనెల ధరలు తగ్గిపోతున్నాయని ప్రకటనల మీద ప్రకటనలు ఇస్తోంది. కానీ వాస్తవంగా వినియోగదారుల దగ్గరకు వచ్చేసరికి వ్యాపారులు పాత ధరలనే వసూలు చేస్తున్నారు. ఉక్రెయిన్‌ యుద్ధం ప్రారంభం కాగానే అక్కడి నుంచి రావలసిన ఆయిల్‌ దిగుమతులు ఆగిపోవడంతో దేశంలో వంట నూనెల ధరలు ఒక్కసారిగా పెరిగిన సంగతి తెలిసిందే. సన్‌ఫ్లవర్‌, వేరుశెనగ, తదితర రిఫైన్డ్‌ ఆయిల్‌ ధరలు లీటరు రూ.200 దాటిపోయాయి. మూడు నెలలు అవే ధరలు కొనసాగాయి. వ్యాపారులు పాత నిల్వలను బయటకు తీసి, ధరలు మార్పు చేసి ఎక్కువ రేట్లకు అమ్ముకున్నారు. ఫిర్యాదులు రావడంతో విజిలెన్స్‌ అధికారులు గోదాముల్లో సోదాలు నిర్వహించి, నిల్వలను బయటకు తీయించారు. ప్యాకెట్లపై వున్న పాత రేట్లకే అమ్మేలా చేశారు. దీంతో వ్యాపారులు వాస్తవ రేటుకు అధికంగా ఎంఆర్‌పీ ముద్రించడం అలవాటు చేసుకున్నారు. ఎక్కువ రేటు వేసి, తక్కువకు ఇస్తున్నట్టు బిల్డప్‌ ఇవ్వడం ప్రారంభించారు. దాంతో విజిలెన్స్‌ అధికారులు కూడా ఏమీ చేయలేకపోయారు. ఇప్పుడు ఆయిల్‌ రేట్లు ప్రపంచవ్యాప్తంగా తగ్గుముఖం పట్టడంతో వినియోగదారులకు లీటరుకు రూ.20 చొప్పున తగ్గుతుందని ఇప్పటికే రెండుసార్లు కేంద్రం ప్రకటించింది. ఆ ప్రకారం రెండు రూ.20లు అంటే రూ.40 తగ్గాలి. ఆన్‌లైన్‌లో ఆ విధంగానే తగ్గింపు ధరకు లభ్యమవుతున్నాయి. విశాఖపట్నంలో ఎక్కువగా ఫ్రీడం బ్రాండ్‌ ఆయిల్‌ అమ్మకాలు జరుగుతాయి. ఫ్రీడమ్‌ సన్‌ఫ్లవర్‌ ఆయిల్‌ ఆన్‌లైన్‌లో లీటరు రూ.154, వేరుశెనగనూనె రూ.169, రైస్‌బ్రాన్‌ ఆయిల్‌ రూ.158 చొప్పున అమ్ముతున్నారు. అదే విజయ బ్రాండ్‌ అయితే రైతుబజార్లలో సన్‌ఫ్లవర్‌ లీటరు రూ.168, రైస్‌బ్రాన్‌ రూ.145, వేరుశెనగ రూ.164 చొప్పున అమ్ముతున్నారు. పామాయిల్‌ విజయ బ్రాండ్‌ లీటరు రూ.126 కాగా, ఆన్‌లైన్‌లో రూ.100లోపే దొరుకుతున్నాయి. 

అయితే నగరంలో చిల్లర వ్యాపారులు అంతా ఫ్రీడమ్‌ ఆయిల్‌ లీటరు రూ.180 నుంచి రూ.185 చొప్పున ఇంకా అమ్ముతున్నారు. రేట్లు తగ్గాయి కదా? అని ప్రశ్నిస్తే... అందుకే రూ.210 ఎంఆర్‌పీ వున్న ప్యాకెట్‌ను రూ.180కి ఇస్తున్నామని దబాయిస్తున్నారు. ఎంఆర్‌పీలను ఎక్కువగా ముద్రించడం వల్ల వారు దొరక్కుండా తప్పించుకుంటున్నారు. దీనిపై విజిలెన్స్‌ అధికారులు దృష్టిసారించి, తగ్గిన ధరలకు వంట నూనెలు లభించేలా చూడాల్సి ఉంది. 


ఇంకా ప్రారంభం కాని జెండాల పంపిణీ

13 నుంచి ప్రతి ఇంటిపై జెండా ఎగురేయాలని కేంద్రం ఆదేశం


విశాఖపట్నం, ఆగస్టు 9 (ఆంధ్రజ్యోతి): కేంద్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్న ‘హర్‌ ఘర్‌ తిరంగా’ కార్యక్రమం నిర్వహణపై నగరంలో గందరగోళం నెలకొంది. ఈనెల 13 నుంచి 15 వరకూ ప్రతి ఇంటిపైనా జాతీయ జెండా ఎగురవేయాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశిస్తే, ఇంతవరకూ జెండాల పంపిణీ ప్రారంభం కాలేదు. ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌లో భాగంగా కేంద్ర ప్రభుత్వం ‘హర్‌ ఘర్‌ తిరంగా’ (ప్రతి ఇంటిపైనా జాతీయ జెండా ఎగురవేసేలా) కార్యక్రమానికి పిలుపునిచ్చింది. ప్రతి ఇంటికీ ఒక జాతీయ జెండాతోపాటు ఎగురవేసేందుకు వీలుగా కర్రను పంపిణీ చేయాలని, ఇంటిపై జెండా ఎగురవేసిన తర్వాత ప్రత్యేకంగా రూపొందించిన యాప్‌లో ఫొటోను జియోట్యాగింగ్‌ చేసి అప్‌లోడ్‌ చేయించాలని అన్ని జిల్లాల అధికారులు, స్థానిక సంస్థల అధికారులకు సూచించింది. జీవీఎంసీ పరిధిలో 5.45 లక్షల నివాసాలు వుండడంతో ఆ మేరకు జాతీయ జెండాలు, జెండా కర్రలను జిల్లా కలెక్టర్‌ కార్యాలయం ద్వారా జీవీఎంసీకి అందజేసింది. జీవీఎంసీ యూసీడీ అధికారులు వీటిని వార్డు సచివాయలంలోని వెల్ఫేర్‌ సెక్రటరీల పర్యవేక్షణలో వార్డు వలంటీర్లకు అందజేశారు. పదో తేదీలోగా పంపిణీ పూర్తిచేసి 13వ తేదీ నాటికి ప్రతి ఇంటిపైనా జెండా ఎగిరేలా చర్యలు ప్రారంభించాలని ఆదేశించారు. అయితే నగరంలో ఇంతవరకూ జెండాల పంపిణీయే ప్రారంభం కాకపోవడం ఆశ్చర్యానికి గురిచేస్తోంది. జెండాల కంటే జెండా కర్రలు తక్కువగా ఇవ్వడంతో వలంటీర్లు వాటిని ఇంటింటికీ పంపిణీ చేయడం లేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. జెండాలు, జెండా కర్రల కొరతపై అధికారులకు ఇప్పటికే పలుమార్లు చెప్పామని, అయినప్పటికీ స్పందన లేకపోవడంతో తాము పంపిణీ విషయంలో ఎటూ తేల్చుకోలేదంటూ వార్డు సచివాలయ కార్యదర్శులు, వార్డు వలంటీర్లు చెబుతున్నారు. 


నేడు జీవీఎంసీ కౌన్సిల్‌ సమావేశం

12 అంశాలతో అజెండా సిద్ధం

ఆస్తిపన్ను ఆధారంగా చెత్త పన్ను వసూలుకు ప్రతిపాదన

భీమిలిలో 50 ఎకరాలు వీఎంఆర్‌డీఏకు అప్పగింత


విశాఖపట్నం, ఆగస్టు 9 (ఆంధ్రజ్యోతి): మహా విశాఖ నగర పాలక సంస్థ (జీవీఎంసీ) కౌన్సిల్‌ సమావేశం బుధవారం జరగనున్నది. ఆధునికీకరించిన కౌన్సిల్‌ హాల్‌లో ఉదయం 10.30 గంటల నుంచి మేయర్‌ గొలగాని హరివెంకటకుమారి అధ్యక్షతన సమావేశం ప్రారంభమవుతుంది. ఇందుకోసం 12 అంశాలతో ప్రధాన, సప్లిమెంటరీ అజెండాలను తయారుచేశారు. వీటిలో ఆస్తి పన్ను ఆధారంగా చెత్త సేకరణకు యూజర్‌ చార్జీల వసూలు, భీమిలి మండలం కొత్తవలస గ్రామంలోని సర్వే నంబర్‌ 73లో 50 ఎకరాల ప్రభుత్వ భూమి వీఎంఆర్‌డీఏకు అప్పగింత ప్రధానమైనవి. కాగా చెత్తపన్నును పూర్తిగా రద్దు చేయడంతోపాటు పెంచిన ఆస్తి పన్నును తగ్గించాలని డిమాండ్‌ చేస్తూ జీవీఎంసీ కార్యాలయం ఎదుట సోమవారం ధర్నా నిర్వహించాలని సీపీఎం కార్పొరేటర్‌ బి.గంగారావు నిర్ణయించారు.  

Updated Date - 2022-08-10T06:34:45+05:30 IST