క్రిప్టో కాదు, డిజిటల్‌ మేలు

ABN , First Publish Date - 2021-12-21T06:21:39+05:30 IST

కొత్త డబ్బు క్రిప్టో కరెన్సీ. గోప్యత, భద్రత ఉన్న సంకేత నిక్షిప్త సందేశమే ఈ కొత్త కరెన్సీ. సొంతదారుకు మినహా మరెవ్వరికీ ఇది అందుబాటులో ఉండదు. కంప్యూటర్ నైపుణ్యోత్సాహులు...

క్రిప్టో కాదు, డిజిటల్‌ మేలు

కొత్త డబ్బు క్రిప్టో కరెన్సీ. గోప్యత, భద్రత ఉన్న సంకేత నిక్షిప్త సందేశమే ఈ కొత్త కరెన్సీ. సొంతదారుకు మినహా మరెవ్వరికీ ఇది అందుబాటులో ఉండదు. కంప్యూటర్ నైపుణ్యోత్సాహులు ఒక చోట కూడి, సుడోకు లాంటి ప్రహేళిక నొకదాన్ని పరిష్కరించేందుకు పూనుకుంటారు. ఆ ప్రహేళికను సంపూర్ణంగా, సక్రమంగా పరిష్కరించిన వ్యక్తికి బిట్ కాయిన్ లాంటి క్రిప్టో కరెన్సీ రూపేణా బహుమానాన్ని ఇస్తారు. ఈ నవ్య కరెన్సీ నియంత్రణ అనేది ఏ ఒక్క వ్యక్తి చేతిలోనూ ఉండదు. సంబంధిత కంప్యూటర్ క్రీడలో పాల్గొన్న వారందరూ ఆ కరెన్సీపై ఉమ్మడి నియంత్రణ కలిగి ఉంటారు. ఒక ప్రహేళికను పరిష్కరించి, విజేతకు ఒక క్రిప్టో కాయిన్‌ను బహూకరించిన తరువాత మరో కొత్త ప్రహేళికను పరిష్కరించే ఆట ప్రారంభమవుతుంది. ఈ విధంగా కొత్త క్రిప్టో కరెన్సీ తయారవుతుంది. కొత్త పేపర్ కరెన్సీ నోట్లను ముద్రించిన విధంగానే క్రిప్టో కరెన్సీ ఉనికి లోకి వస్తుంది.


క్రిప్టో కరెన్సీలను ప్రోత్సహించేందుకు దేశదేశాల సెంట్రల్ బ్యాంకులు విముఖత చూపుతున్నాయి. అవి లోపభూయిష్టమైనవని, ఆర్థికాభివృద్ధికి వాటి వల్ల అనేక అవరోధాలు ఏర్పడతాయని సెంట్రల్ బ్యాంకులు నొక్కి చెబుతున్నాయి. క్రిప్టో కరెన్సీలు దేశ ఆర్థికవ్యవస్థను అస్థిరపరచి దాని పెరుగుదలకు అవరోధంగా మారతాయి. ఉదాహరణకు ద్రవ్యోల్బణం చాలా హెచ్చుస్థాయిలో ఉందనుకుందాం. రిజర్వ్‌బ్యాంక్ (మన సెంట్రల్‌బ్యాంక్) ఆ విపరీత పరిస్థితిని నియంత్రించేందుకు ద్రవ్య సరఫరాను తగ్గిస్తుంది. అయితే క్రిప్టో కరెన్సీ చాలా పెద్ద పరిమాణంలో ఉత్పత్తి కావడం రిజర్వ్‌బ్యాంక్ చేపట్టిన ద్రవ్య సరఫరా తగ్గింపు చర్యను నిరర్థకం చేస్తుంది. ఈ విధంగా ప్రభుత్వాలు ద్రవ్య విధానంపై నియంత్రణను కోల్పోవడంతో క్రిప్టో కరెన్సీలు ఆర్థిక వ్యవస్థను అస్థిరత్వ పరుస్తాయి. ఇది వాటి వల్ల సంభవించే పెనునష్టం. నేరాల పెరుగుదలకు ఆలంబన కావడం ద్వారా ఆర్థిక వ్యవస్థకూ, సమాజానికీ అవి చాలా హాని చేస్తాయి. ఇటీవల అమెరికాలోని చమురు కంపెనీల కంప్యూటర్ల నుంచి సమాచారం తస్కరణకు గురయింది. ఆ కంప్యూటర్లను హ్యాక్ చేసిన వారు క్రిప్టో కరెన్సీల రూపేణా తమకు పెద్ద ఎత్తున ప్రతిఫలం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఇటువంటి అవరోధాలు, నష్టాలు ఎన్ని ఉన్నప్పటికీ సెంట్రల్ బ్యాంకులు బాధ్యతారహితంగా వ్యవహరించే పరిస్థితులలో క్రిప్టో కరెన్సీలు ప్రయోజనకరంగా ఉండి సమస్యల పరిష్కారానికి తోడ్పడుతాయి. సెంట్రల్ బ్యాంక్ విచక్షణారహితంగా పేపర్ కరెన్సీని ముద్రించిందనుకోండి. దానివల్ల కేవలం ఒక్క ఏడాదిలోనే ధరలు నాలుగు రెట్లు పెరుగుతాయి. అటువంటి పరిస్థితుల్లో క్రిప్టో కరెన్సీ భద్రతను సమకూరుస్తుంది. మరింత స్పష్టంగా చెప్పాలంటే సరైన విధానాలను అనుసరించని సెంట్రల్ బ్యాంకులను అదుపులో ఉంచేందుకు క్రిప్టో కరెన్సీలు తోడ్పడుతాయి. సంగ్రహించి చెప్పాలంటే సెంట్రల్ బ్యాంకులు వివేకవంతమైన విధానాలను అనుసరించినప్పుడు క్రిప్టో కరెన్సీలు హాని కలిగించేవిగా ఉంటాయి. సెంట్రల్ బ్యాంకులు అవివేక విధానాలను అనుసరించినప్పుడు ఈ నవ్య కరెన్సీలు ఆర్థికవ్యవస్థకు విశేష ప్రయోజనాలను చేకూర్చుతాయి.


సరే, ఇప్పుడు ‘డిజిటల్ కరెన్సీ’ రాబోతోంది. ఈ అధునాతన కరెన్సీ కూడా క్రిప్టో కరెన్సీ వంటిదే. ఇదీ కంప్యూటర్‌లో ఒక సంకేత నిక్షిప్త సందేశమే. ఇది ఒక అంకె రూపంలో ఉంటుంది. అయితే క్రిప్టో కరెన్సీ మాదిరిగా అనామక కరెన్సీ కాదు. దీన్ని మన రిజర్వ్‌బ్యాంక్ లాంటి ఏదైనా సెంట్రల్‌బ్యాంక్ జారీ చేయవచ్చు. అయితే దాని విలువ ఎంతనేది మార్కెట్‌లో వేలంపాట ప్రక్రియ ద్వారా నిర్ణయమవుతుంది. సరఫరా, గిరాకీ సూత్రం ప్రాతిపదికన పేపర్ కరెన్సీ విలువ నిర్ణయమయినట్టుగానే డిజిటల్ కరెన్సీ విలువ నిర్ణయమవుతుంది. డిజిటల్ కరెన్సీ యజమానులు ఎవరో రిజర్వ్‌బ్యాంక్ గుర్తించగలుగుతుంది. తద్వారా నేర కార్యకలాపాలకు దాన్ని ఉపయోగించకుండా నిరోధించడం సాధ్యమవుతుంది. ఏ పరిమాణంలో డిజిటల్ కరెన్సీని జారీ చేయాలో నిర్ణయించే అధికారం పూర్తిగా రిజర్వ్‌బ్యాంక్‌దే. కనుక ఈ అధునాతన కరెన్సీ ఆర్థికవ్యవస్థ అస్థిరత్వం పాలు కాకుండా నివారించగలుగుతుంది. అయితే రిజర్వ్‌బ్యాంక్ అనుసరించే అసంబద్ధ విధానాలను అధిగమించడంలో ప్రజలకు డిజిటల్ కరెన్సీ ఏ విధంగాను తోడ్పడదు. పేపర్ కరెన్సీని రిజర్వ్‌బ్యాంక్ వివిధ సందర్భాలలో విచక్షణారహితంగా జారీ చేసింది. అలాగే డిజిటల్ కరెన్సీని కూడా చాలా పెద్ద మొత్తాల్లో జారీ చేయాలని ఆ బ్యాంక్ నిర్ణయం తీసుకుంటే దాన్ని ఎవరూ నిలువరించలేరు. సెంట్రల్ బ్యాంకు అనుసరించే లోపభూయిష్ట విధానాలను డిజిటల్ కరెన్సీ నియంత్రించలేదు. 


డిజిటల్ కరెన్సీని నేను స్వాగతిస్తాను, క్రిప్టో కరెన్సీని వ్యతిరేకిస్తాను. మన రిజర్వ్‌బ్యాంక్ గానీ, మరేదైనా సెంట్రల్‌ బ్యాంక్ గానీ అనుసరించే అసంబద్ధ, అవివేక విధానాలను నియంత్రించగల సామర్థ్యం డిజిటల్ కరెన్సీకి లేదు. అయితే ఆర్థికవ్యవస్థను అస్థిరత్వం పాలు చేయగల సత్తా కూడా ఈ అధునాతన కరెన్సీకి లేదు. ఈ విషయంలో దాని అనుకూలతలు, ప్రతికూలతల మధ్య ఒక సమతుల్యత ఉంది. డిజిటల్ కరెన్సీ వల్ల ఇంకా ఇతర ప్రయోజనాలు ఉన్నాయి. క్రిప్టో కరెన్సీల వలే నేర కార్యకలాపాలకు అది ఉపయోగపడకపోవడం వాటిలో ఒకటి. నామమాత్రపు ఖర్చుతో భద్రంగా నిల్వ చేసుకోగలగడం మరో ప్రయోజనం. పేపర్ కరెన్సీలతో పోలిస్తే వీటితో జరిపే లావాదేవీల వ్యయం కూడా తక్కువే. ద్రవ్య విధాన నిర్వహణకు సంబంధించిన అన్ని సమస్యలను డిజిటల్ కరెన్సీ పరిష్కరించలేదు. అయితే పరస్పర భిన్నమైనవి అయిన పేపర్, క్రిప్టో కరెన్సీల లక్షణాలు సమన్వితమవడం డిజిటల్ కరెన్సీ ప్రత్యేకత. క్రిప్టో కరెన్సీని కోరుకోవడమంటే ఆర్థికవ్యవస్థ అస్థిరత్వాన్ని ఆహ్వానించడమే అవుతుంది. మరోవైపు దానిని తిరస్కరిస్తే సెంట్రల్‌బ్యాంక్ అవివేకమైన విధానాలకు మేలైన ప్రత్యామ్నాయాన్ని ప్రజలకు సమకూర్చలేము. కనుక వాస్తవాన్ని అంగీకరిద్దాం. క్రిప్టో, డిజిటల్ కరెన్సీల లాంటి సాంకేతిక నవకల్పనలతో, రిజర్వ్‌బ్యాంక్ అనుసరించే విధానాల వల్ల నెలకొంటున్న సమస్యలు పరిష్కారం కావు. అందుకు మొత్తంగా పాలన మెరుగుపడవలసిన అవసరం ఎంతైనా ఉంది.


భరత్ ఝున్‌ఝున్‌వాలా

(వ్యాసకర్త ఆర్థికవేత్త, బెంగుళూరు ఐఐఎం రిటైర్‌్డ ప్రొఫెసర్‌)

Updated Date - 2021-12-21T06:21:39+05:30 IST