బీజేపీ ప్రత్యామ్నాయం కాంగ్రెస్, తృణమూల్ కాదు.. లెఫ్టేనట!

ABN , First Publish Date - 2021-12-15T02:14:38+05:30 IST

ప్రధానంగా ఆయన కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేసుకుని, భారతీయ జనతా పార్టీకి ప్రత్యామ్నాయ కూటమి ఏర్పాటు చేసే అవకాశం కాంగ్రెస్‌కు లేదని, ఒకవేళ ఏర్పాటు చేసినప్పటికీ ప్రజలు ఆదరించరని ఆయన అన్నారు..

బీజేపీ ప్రత్యామ్నాయం కాంగ్రెస్, తృణమూల్ కాదు.. లెఫ్టేనట!

తిరువనంతపురం: భారతీయ జనతా పార్టీకి రాజకీయ ప్రత్యామ్నాయంపై దేశంలో అనేక చర్చలు నడుస్తున్నాయి. కొందరు కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలో కూటమి ఏర్పడుతుందని అంటున్నారు. కొద్ది రోజుల క్రితం దేశంలో బీజేపీ, కాంగ్రెస్‌లకు వ్యతిరేకంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు చేస్తానని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ హడావిడి చేసి చల్లబడ్డారు. ఈ మధ్యే కాంగ్రెస్ లేకుండా బీజేపీ ప్రత్యామ్నాయం ఏర్పాటు చేస్తామని బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ అధినేత మమతా బెనర్జీ శపథం చేస్తున్నారు. అయితే ఇవేవీ కావని, భారతీయ జనతా పార్టీ వ్యతిరేకంగా ‘సెక్యూలర్ ప్రత్యామ్నాయం’ లెఫ్ట్ పార్టీల ఆధ్వర్యంలోనే ఏర్పడుతుందని కేరళ ముఖ్యమంత్రి పినరయ్ విజయన్ అన్నారు.


ప్రధానంగా ఆయన కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేసుకుని, భారతీయ జనతా పార్టీకి ప్రత్యామ్నాయ కూటమి ఏర్పాటు చేసే అవకాశం కాంగ్రెస్‌కు లేదని, ఒకవేళ ఏర్పాటు చేసినప్పటికీ ప్రజలు ఆదరించరని ఆయన అన్నారు. జైపూర్‌లో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన ‘మెహంగాయి హటావో’ (ధరలు తగ్గించండి) అనే కార్యక్రమంలో రాహుల్ ప్రసంగంలోని హిందూ, హిందుత్వ పదాలను ఉదహరిస్తూ ఆయన ఈ విషయాన్ని నొక్కి చెబుతున్నారు. కాంగ్రెస్ పార్టీ సెక్యూలరిజాన్ని కాకుండా సాఫ్ట్ హిందుత్వ గురించి మాట్లాడుతోందని, దీంతో ప్రజలకు ఇప్పటికి కాంగ్రెస్‌పై ఉన్న నమ్మకం సన్నగిళ్లిపోయిందని విజయన్ అన్నారు.


‘‘రాహుల్ గాంధీ మాటల్లోని సాఫ్ట్ హిందుత్వ స్టాండ్‌ను కాంగ్రెస్ ఎప్పటి నుంచో అనుసరిస్తూ వస్తోంది. కాకపోతే జైపూర్‌లో రాహుల్ గాంధీ ఈ విషయాన్ని మరోసారి ప్రస్తావించారంతే. కాంగ్రెస్ పట్ల ప్రజలు నమ్మకాన్ని కోల్పోయారు. కార్యకర్తల్లో కూడా ఆ పార్టీపై నమ్మకం పోయింది. ఇలాంటి పరిస్థితుల్లో బీజేపీకి వ్యతిరేకంగా ‘సెక్యూలర్ ప్రత్యామ్నాయం’ కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేయలేదు. సెక్యూలరిజం కాకుండా హిందూయిజం గురించి కాంగ్రెస్ మాట్లాడడం తన ఉనికిని మరింత తగ్గించుకోవడమే. కాంగ్రెస్‌కు ఇంతకంటే పెద్ద తప్పు అవసరం లేదు’’ అని విజయన్ అన్నారు.

Updated Date - 2021-12-15T02:14:38+05:30 IST