అసంపూర్తిగా పుష్కర ఏర్పాట్లు

ABN , First Publish Date - 2020-11-20T05:08:30+05:30 IST

సప్తనదీ సంగమ క్షేత్రంలో పుష్కర పనులు అసంపూర్తిగానే మిగిలిపోయాయి.

అసంపూర్తిగా పుష్కర ఏర్పాట్లు
సంగమేశ్వరం - కపిలేశ్వరం మధ్య అసంపూర్తిగా రోడ్డు

సంగమేశ్వరంలో చివరిరోజు హడావిడిగా పనులు

నేటి నుంచి తుంగభద్ర పుష్కరాలు


ఆత్మకూరు/కొత్తపల్లి, నవంబరు 19: సప్తనదీ సంగమ క్షేత్రంలో పుష్కర పనులు అసంపూర్తిగానే మిగిలిపోయాయి. శుక్రవారం నుంచి తుంగభద్ర పుష్కరాలు ప్రారంభం కానున్నాయి. అయితే గురువారం హడావిడిగా పనులు చేశారు. సంగమేశ్వరానికి విచ్చేయు భక్తులను కపిలేశ్వరం వద్ద నిలిపివేస్తారు. అక్కడే బస్టాండ్‌ను ఏర్పాటు చేసినప్పటికీ అక్కడ భక్తులకు అవసరమయ్యే ఏర్పాట్లను సమృద్ధిగా చేయలేదు. విశ్రాంతి తీసుకునేందుకు గదుల సదుపాయం కల్పించలేదు. గురువారం సాయంత్రం హడావిడిగా మరుగుదొడ్లను ఏర్పాటు చేస్తున్నారు. దీనికి అనుసంధానంగా అప్పటికప్పుడు డ్రైనేజీ గుంతను తవ్వించి పైకప్పు కూడా ఏర్పాటు చేయలేదు. అలాగే మరుగుదొడ్లకు నీటి సదుపాయాన్ని కల్పించే ప్రక్రియ కూడా పూర్తికాలేదు. గురువారం సాయంత్రానికి కూడా కపిలేశ్వరం బస్టాండ్‌ ప్రాంగణానికి విద్యుత్‌ సరఫరా ఇవ్వలేదు. కపిలేశ్వరం-సంగమేశ్వరం మధ్యలో పెండింగ్‌లో ఉన్న 700 మీటర్ల రోడ్డు పనులు ఇంకా జరుగుతూనే ఉన్నాయి. సంగమేశ్వర క్షేత్రంలో బోర్లు వేసే ప్రయత్నం చేసినప్పటికీ నీళ్లు పడలేదు. సంగమేశ్వరం వద్ద ఉన్న బస్టాండ్‌ ప్రాంగణంలో కూడా ఎటువంటి ఏర్పాట్లు చేయలేదు. మహిళలు దుస్తుల మార్పిడి చేసుకునేందుకు ఉన్న గదు లకు తలుపులు లేనప్పటికీ ఈ సమస్యను ఏ మాత్రం పట్టించుకోలేదు. పుష్కరాల్లో విధులు నిర్వహించే ఉద్యోగులు, సిబ్బందికి కపిలేశ్వరం లో కాశిరెడ్డినాయన ఆశ్రమం వారి సహకారం తో భోజన సదుపాయాన్ని సిద్ధం చేశారు. అన్నదాన కేంద్రాలపై కూడా స్పష్టత లేకుండా పోయింది. పుష్కర స్నానాలకు అనుమతి లేకపోవడంతో పలు పుష్కర ఘాట్ల వద్ద షవర్లను అందుబాటులో ఉంచారు. అయితే సంగమేశ్వరం లో షవర్లను ఏర్పాటు చేయలేదు. భక్తులు కపిలేశ్వరం వద్దకు చేరుకుని అక్కడి నుంచి ప్రత్యేక ఆర్టీసీ బస్సు ద్వారా సంగమేశ్వరానికి వెళ్లాల్సి ఉంటుంది. గత కృష్ణా పుష్కరాల్లో కపిలేశ్వరం నుంచి సంగమేశ్వరానికి ఉచిత బస్సులను అందుబాటులో ఉంచా రు. అయితే ఈ సారి భక్తుల నుంచి డబ్బులు వసూళ్లు చేయాలని ఆర్టీసీ అధికారులు నిర్ణయించారు. ఇన్ని రోజుల పాటు కాలయాపన చేసి చివరి రోజు పనుల హడావిడి చేస్తున్న ప్పటికీ పనులనన్నీ పెండింగ్‌లో ఉండటం తో అధికార యంత్రానికి దిక్కుతోచడం లేదు.

‘తొలి పుష్కర స్నానం లలితా సంగమేశ్వరులకే ’

సప్తనదీ సంగమేశ్వర క్షేత్రంలో శుక్రవారం 1.21నిమిషాలకు తుంగభద్ర పుష్కరాలు ప్రారంభం కానున్నాయి. తొలి పుష్కర స్నానం శ్రీలలితా సంగమేశ్వర స్వామి అమ్మవార్ల ప్రాచీన ఉత్సవమూర్తులకు జరపనున్నట్లు ఆలయ పురోహితులు తెలకపల్లి రఘురామశర్మ గురువారం తెలిపారు. ప్రస్తుతం దిగువ సంగమేశ్వరం సప్తనదీ జలాల్లో మునిగిపోవడంతో ఎగువ ఉమామహేశ్వరాలయంలోనే అన్ని పూజా క్రతువులను నిర్వహించనున్నారు.

Updated Date - 2020-11-20T05:08:30+05:30 IST