ఖరారు కాని కార్యాచరణ.. ధాన్యం కొనుగోళ్లపై రాని స్పష్టత

ABN , First Publish Date - 2021-03-03T04:38:36+05:30 IST

ఖరారు కాని కార్యాచరణ.. ధాన్యం కొనుగోళ్లపై రాని స్పష్టత

ఖరారు కాని కార్యాచరణ.. ధాన్యం కొనుగోళ్లపై రాని స్పష్టత
ధాన్యం కోతలు కోస్తున్న దృశ్యం (పైల్‌)

త్వరలోనే వరికోతలు షురూ

ఖమ్మం జిల్లాలో 2.35లక్షల ఎకరాల్లో యాసంగి వరి సాగు

ఖమ్మం కలెక్టరేట్‌, మార్చి 2: కాలం కలిసొచ్చింది. సాగర్‌తో పాటు ఇతర ప్రాజెక్టుల నుంచి సమృద్ధిగా సాగునీరు అందడంతో ఖమ్మం జిల్లాలో యాసంగి వరి సాగు ఆశాజనకంగా మారింది. ఇంతవరకు బాగానే ఉన్నా ఈ సారి ధాన్యం కొనుగోళ్లు లేవంటూ ఇటీవల సీఎం ప్రకటన చేయడంతో రైతులు అయోమయంలో పడ్డారు. కానీ రైతుల నుంచి వచ్చిన ఒత్తిడో.. లేదంటే కేంద్రప్రభుత్వం కొత్త చట్టాలపై పునరాలోచనకు సమయం తీసుకున్న నేపథ్యంలోనో రాష్ట్ర ప్రభుత్వం మళ్లీ ధాన ్యం సేకరణకు ఓకే చెప్పడంతో రైతులు ఊపిరి పీల్చుకున్నారు. ఖమ్మం  జిల్లాలో  ఈ ఏడాది వానాకాలంలో  3.30లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని సేకరించారు. వానాకాలంలో సన్నరకం సాగు చేయడం, కాలం కలిసి రాకపోవడంతో దిగుబడులు తగ్గిపోయాయి. ఆ పరిస్థితి ఎలా ఉన్నా యాసంగిలో మాత్రం వరిసాగు దాదాపు రెట్టింపు అయ్యింది. అధికారుల అంచనాలు తలకిందులు చేసేలా దిగుబడులు వచ్చే ఆస్కారం ఉంది. జిల్లాలో ఇప్పటి వరకు వ్యవసాయ శాఖ అంచనాల ప్రకారం నాగార్జున సాగర్‌ ప్రాజెక్టుతో పాటు వివిధ ప్రాజెక్టుల కింద 2.35లక్షల ఎకరాల్లో వరి సాగయ్యింది. వీటి ద్వారా సుమారు 5.65లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం దిగుబడులు వచ్చే ఆస్కారం ఉందని వ్యవసాయశాఖ ప్రాథమిక అంచనా. దీనికి తగినట్టుగా ధాన్యాన్ని సేకరించేందుకు గత సీజన్‌కంటే ఎక్కువే కేంద్రాలు అవసరం ఉంటుంది. వానాకాలంలో జిల్లాలో 324 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఈ సారికి దాదాపు 400కు పైగానే కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తేనే రైతులకు వెసులుబాటు ఉంటుందని భావిస్తున్నారు. దీనికి తగినట్లుగానే అధికారులు ధాన్యం సేకరణకు ఏర్పాట్లు చేయాల్సి ఉంది. మార్చి మొదటి, రెండో వారం నుంచి పంట కోతలు ప్రారంభం అయ్యే ఆస్కారం ఉంది. అయితే రాష్ట్ర వ్యాప్తంగా ధాన్యం కొనుగోళ్లపై ప్రభుత్వం స్పష్టమైన ప్రకటన చేసినా జిల్లా యంత్రాంగం యాసంగి కార్యాచరణ ఒక కొలిక్కి రాలేదు. ప్రాథమికంగా అంచనాలు రూపొందించినా తుది నివేదికపై ఇంకా స్పష్టత రావాల్సి ఉండగా.. దీనికి సమయం పడుతుందని అధికారులే చెబుతున్నారు. ఫలితంగా రైతులు ధాన్యం విక్రయించుకునేందుకు వ్యాపారులను ఆశ్రయించాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. దీనికి తోడు ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్‌ ప్రభావం ధాన్యం సేకరణపై ఉంటుందేమోనన్న అనుమానం రైతులు వ్యక్తం చేస్తున్నారు. 

సేకరణకు సమగ్ర కార్యాచరణ ఇలా.. 

సాగైన విస్తీర్ణం వచ్చే దొడ్డురకం బియ్యం దిగుబడి వివరాలను మండలాల వారీగా వ్యవసాయశాఖ అధికారులు గుర్తించి పౌరసరఫరాల శాఖకు లెక్కలు అందించాల్సి ఉంది. ఆ తర్వాత సహకార, గ్రామీణాభివృద్ధి శాఖలతో సమన్వయం చేసుకుని కొనుగోలు కేంద్రాల ఏర్పాటుకు సమగ్ర కార్యాచరణ రూపొందించాల్సి ఉంది. ఇందులో కేంద్రాల సంఖ్య, గోనెసంచులు, మిల్లింగ్‌ కోసం మిల్లుల గుర్తింపు, ధాన్యం తరలింపునకు వాహనాల సేకరణ తదితర అంశాలు ఉంటాయి. అయితే వ్యవసాయశాఖ అంచనాలు, కొనుగోలు కేంద్రాల ఏర్పాటుపై ప్రాథమికంగా  చర్చించి నివేదికలను సిద్ధం చేసినట్టు సమాచారం. అయితే ఈ నివేదికలను ఉన్నతాధికారులకు పంపగా.. నేడో రేపో వెల్లడి చేస్తారని భావిస్తున్నారు. సాధ్యమైనంత త్వరగా కార్యాచరణ ప్రకటిస్తే అధికారులు ఆదిశగా ఏర్పాట్లు చేసుకోవాల్సిన అవసరం ఉంటుందంటున్నారు. 

కార్యాచరణ సిద్ధం చేశాం 

ఎన్‌.మధుసూదన్‌, ఖమ్మం అదనపు కలెక్టర్‌

జిల్లాలో యాసంగి ధాన్యం సేకరణకు ఇప్పటికే కార్యాచరణను సిద్ధం చేశాం. నేడో రేపో వివరాలు వెల్లడించనున్నాం. రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా జిల్లా ధాన్యం సేకరించడానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం. రైతులు ఆందోళన చెందాల్సిన పనిలేదు. ఎంత ధాన్యాన్ని సేకరించాలన్న లక్ష్యంపై త్వరలో స్పష్టత వస్తుందన్నారు. 

Updated Date - 2021-03-03T04:38:36+05:30 IST